టెక్ సంస్థల్లోనే ఎక్కువగా ఉద్యోగుల తొలగింపు
పరోక్షంగా కారణమవుతున్న కొత్త టెక్నాలజీ
వ్యాపార విధానాన్ని మారుస్తున్న కంపెనీలు
ప్రపంచ వ్యాప్తంగా టెక్ రంగంలో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటి.. కంపెనీలు కృత్రిమ మేధ వినియోగాన్ని వేగవంతం చేయడం. ఏఐలో పెట్టుబడులు పెట్టడం, పెరుగుతున్న వ్యయాలను కట్టడి చేయడంలో భాగంగా కంపెనీలు తమ వ్యాపార విధానాన్ని మార్చుకోవడం కూడా కొలువుల కోతకు కారణమని నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్
ఏఐ అధిక వినియోగం ఉద్యోగుల తీసివేతలకు కారణం అవుతుందని అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ ఈ ఏడాది జూన్ లో జోస్యం చెప్పారు. ఆయన జోస్యం ఆయన కంపెనీ విషయంలో నిజమైంది. సుమారు 14,000 మందికి ఉద్వాసన పలకనున్నట్టు ఇటీవలే అమెజాన్ ప్రకటించింది. ఏఐలో పెట్టుబడులు పెడుతున్నాం కాబట్టి, ఖర్చులు తగ్గించుకునేందుకు మొత్తం ఉద్యోగుల్లో 4 శాతం వరకు తొలగించనున్నట్టు మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా ప్రకటించింది. మెటా, టీసీఎస్.. ఇలా కంపెనీలు ఒకదాని వెంట ఒకటి ఉద్యోగుల కోతకు శ్రీకారం చుట్టాయి.
వారికంటే ఎక్కువ జీతాలు
ఏఐ నైపుణ్యాలున్న కార్మికుల సగటు వేతనాలు.. సంబంధిత రంగంలోని ఇతర ఉద్యోగుల సగటు జీతం కంటే 56% అధికంగా ఉండడం విశేషం. ప్రధానంగా హోల్‌సేల్–రిటైల్, ఇంధనం, సమాచారం, రవాణా – నిల్వ, రియల్టీ, తయారీ, ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగాల్లో ఈ వ్యత్యాసం ప్రధానంగా కనిపిస్తోంది.
ఏఐ రంగంలో నిపుణుల కొరత వల్లే.. ఈ నైపుణ్యాలకు కంపెనీలు ఎక్కువ విలువ ఇస్తున్నాయని పరిశ్రమ చెబుతోంది. ఈ సంవత్సరం మొత్తం లేఆఫ్‌లలో ఇంటెల్, లెనోవో వంటి హార్డ్‌వేర్ కంపెనీల వాటా సుమారు 28%. అమెజాన్, ఈబే తదితర కంపెనీలు 14%, సేల్స్ (సేల్స్‌ఫోర్స్) 9%, కంజ్యూమర్ టెక్ (మెటా, గూగుల్) సంస్థలు 7% వాటాతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
పెట్టుబడులు ఇంతింతై..
ప్రపంచవ్యాప్తంగా 2013లో ఏఐ రంగంలో పెట్టుబడులు సుమారు 15 బిలియన్ డాలర్లు కాగా.. 2019 నాటికి 103 బిలియన్ డాలర్లకి, 2024కి 252 బిలియన్ డాలర్లకి పెరిగాయి.



