ఉద్యోగాల్లో పురుషుల్ని దాటేసిన మహిళలు
తొలిసారి మహిళల్లో పెరిగిన ఉపాధి రేటు
హైబ్రిడ్, డిజిటల్ నైపుణ్యాలతో అవకాశాలు
తడాఖా చూపుతున్న మహిళా శ్రామిక శక్తి
స్కిల్స్ రిపోర్ట్ అధ్యయనంలో వెల్లడి
భారత్‌లో కృత్రిమ మేధతో (ఏఐ) నడిచే రంగాలు తమ నియామకాల సరళిలోని ప్రాధాన్యాలను మార్చుకోవడంతో ఐదేళ్లలో తొలిసారిగా మహిళల ఉపాధి సామర్థ్యం పురుషులను మించిపోయిందని ఇండియా స్కిల్స్–2026 నివేదిక వెల్లడించింది. ప్రధానంగా కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఇంజనీరింగ్ రంగాలు ఉపాధి సామర్థ్యాల కొలమానాల్లో అగ్రస్థానంలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
కంప్యూటర్ సైన్స్ పట్టభద్రులు 80 శాతం, ఐటీ ఇంజనీర్లు 78 శాతం ఉపాధి సామర్థ్యం కలిగి ఉన్నట్లు తెలిపింది. వారిలో పురుషుల కంటే మహిళా గ్రాడ్యుయేట్స్‌కే నియామకాల్లో ఎక్కువ ప్రాధాన్యం లభిస్తున్నట్లు పేర్కొంది. ఏఐ, డేటా అనలిటిక్స్, ఆటోమేషన్‌కు సంబంధించిన విభాగాలు మహిళలకు విరివిగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు వివరించింది. – సాక్షి, స్పెషల్ డెస్క్
శిక్షణ ఇప్పించి మరీ..
నిపుణుల కొరతను నిరంతరంగా ఎదుర్కొంటున్న కృత్రిమ మేధస్సు, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా, సైబర్ సెక్యూరిటీ రంగాలలోని సంస్థలు.. సూక్ష్మ–క్రెడెన్షియల్స్ (నిర్ధిష్ట నైపుణ్యాలు), పరిమిత స్థాయి యోగ్యతలు కలిగి ఉన్నప్పటికీ మహిళలను నియమించుకుంటున్నాయి. ఏఐ ద్వారా గ్రామీణ ప్రాంతాలలోని మహిళా అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలలోకి తీసుకోవటం, మహిళల నైపుణ్యాలకు ఎక్కువ అవకాశాలకు లభించటం కూడా ఒక కారణమని నివేదిక తెలిపింది.
ఐదేళ్లలో ముందడుగు..
ప్రస్తుతం మహిళల ఉద్యోగ సామర్థ్యం రేటు 54 శాతం వద్ద ఉంది. ఐదేళ్లలో మొదటిసారిగా పురుషులను దాటి మెరుగైన ప్రతిభను కనబరిచారు. పురుషుల విషయంలో ఈ సామర్థ్యం రేటు 51.5 శాతం ఉంది. బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్), విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలలో మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్యం నగరాలు, పట్టణ ప్రాంతాలలో గణనీయంగా పెరిగాయి.
న్యాయ, ఆరోగ్య సేవల రంగాలలోని ఉద్యోగ అవకాశాలపై మహిళలు వరుసగా 96.4 శాతం, 85.95 శాతం మంది ఆసక్తి చూపుతుండగా; పురుషుల్లో 83.11 శాతం మంది గ్రాఫిక్ డిౖజైన్, 64.67 శాతం మంది ఇంజినీరింగ్ డిజైన్ ఉద్యోగావకాశాల వైపు మొగ్గు చూపుతున్నారు.
‘ఫాస్ట్ మూవింగ్..’ లోనూ..!
ఫార్మాస్యూటికల్స్, హెల్త్‌కేర్ వంటి రంగాలు 1–5 సంవత్సరాల అనుభవం ఉన్న మహిళల్ని ఎక్కువగా నియమించుకుంటున్నాయి. ఆ తర్వాతి స్థానాలలో ఎఫ్‌ఎంసీజీ, బీఎఫ్‌ఎస్‌ఐ మహిళా నియామకాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఐటీలో ఇటీవల గ్రాడ్యుయేట్ల నియామకాలు 35 శాతానికి చేరుకోవడం విశేషం. వీరిలో మహిళలకే కాస్త ఎక్కువగా ప్రాధాన్యం లభిస్తోందని నివేదిక పేర్కొంది.
కామర్స్ గ్రాడ్యుయేట్ల ఉద్యోగ అవకాశాలు గత సంవత్సరం ఉన్న 55 శాతం నుంచి ఈ ఏడాదికి 62.81 శాతానికి పెరిగాయి. సైన్స్, ఆర్ట్స్‌కి సంబంధించిన రంగాలు కూడా ఉద్యోగ అవకాశాల పెరుగుదలను నమోదు చేశాయి. ఈ మూడింటిలోనూ మహిళల భాగస్వామ్యం అధికంగా ఉందని నివేదిక తెలిపింది.


