
మళ్లీ గవర్నర్ కోటాలోనే కోదండరాంకు ఎమ్మెల్సీ హోదా
ఈ నెల 29న కేబినెట్ భేటీలోనా లేక
సెప్టెంబర్ 17 తర్వాతి కేబినెట్‌లోనా?
ఓయూ వేదికగా సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో కోదండరాంకు ఎమ్మెల్సీ పదవిపై చర్చ
సాక్షి, హైదరాబాద్: ‘మరో 15 రోజుల్లో కోదండరాంను ఎమ్మెల్సీని చేస్తా. ఎవరు ఆపుతారో చూస్తా’అంటూ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. కోదండరాంతోపాటు కాంగ్రెస్ నేత ఆమేర్ అలీఖాన్‌ల శాసనమండలి సభ్యత్వాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో సీఎం చెప్పినట్లు మళ్లీ కోదండరాంను ఎలా ఎమ్మెల్సీ చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే మళ్లీ గవర్నర్ కోటాలో, రాష్ట్ర మంత్రివర్గ తీర్మానంతోనే ఆయన్ను మరోసారి ఎమ్మెల్సీ చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని.. అందుకే ఆయనకు పదవిపై ఘంటాపథంగా మాట్లాడారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
సుప్రీం ఏమంటుందో?
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరాం, ఆమేర్ అలీఖాన్‌లను అనర్హులుగా ప్రకటిస్తూ ఈ నెల 13న సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. దీంతో వారు పదవులను కోల్పోవాల్సి వచ్చింది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ సోమవారం ఓయూలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారుడికి తాము పదవి ఇస్తే పెద్దపెద్ద లాయర్లను పెట్టి కుట్రలు చేసి దింపేయాలని ప్రయత్నాలు చేశారని చెప్పారు. మళ్లీ ఆయన్ను ఎమ్మెల్సీని చేస్తానని ప్రకటించారు. దీనివెనుక గట్టి నిర్ణయమే ఉందని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి.
కోదండరాంను మళ్లీ ఎమ్మెల్సీగా పంపేందుకు పార్టీ అధిష్టానం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచి్చందని, గవర్నర్ కోటాలో మళ్లీ కేబినెట్ ఆయన పేరును సిఫారసు చేస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సుప్రీంకోర్టు వచ్చే నెల 17న ఈ కేసుపై తదుపరి విచారణ చేపట్టనున్న నేపథ్యంలో ఈ నెల 29న జరిగే కేబినెట్‌లో తీర్మానం చేస్తారా లేక సెపె్టంబర్ 17న సుప్రీం ఏం చెబుతుందో పరిశీలించి ఆ తర్వాత జరిగే కేబినెట్‌లో ఆమోదిస్తారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందంటున్నాయి.
గవర్నర్ కోటాలో మళ్లీ నామినేట్ చేసేందుకు ఆ ఇద్దరూ ప్రాతినిధ్యం వహించిన స్థానాలను మండలి వర్గాలు ఖాళీగా చూపిన తర్వాత ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుందని.. నోటిఫికేషన్ వచ్చాకే కేబినెట్ తీర్మానం చేస్తుందని.. అప్పటికి కేసు పెండింగ్‌లో ఉన్నా కోదండరాం పేరును మళ్లీ సిఫార్సు చేసేందుకు సుప్రీంకోర్టే వెసులుబాటు ఇచ్చినందుకు ఇబ్బందులేవీ ఉండవని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. అయితే కోదండరాంను ఒక్కరినే మళ్లీ గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తారా లేక ఆమేర్‌అలీఖాన్ పేరునూ జతచేస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.