
ఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు తన ఐ క్లౌడ్ పాస్‌వర్డ్ రీసెట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభాకర్‌రావుకు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ పొడిగించింది. రీసెట్ చేసిన తర్వాత డేటా డిలీట్ చేశారని తేలితే కేసు డిస్మిస్ చేస్తామని జస్టిస్ మహదేవన్ హెచ్చరించారు.
ఈ కేసుపై జస్టిస్ బీవీ నాగరత్నం, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం ఇవాళ(అక్టోబర్ 14, మంగళవారం) విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తునకు ప్రభాకర్‌రావు సహకరించడం లేదని.. ఆయనను కస్టోడియల్ ఇంటరాగేషన్‌కు అప్పగించాలన్నారు.
‘‘కస్టోడియల్ ఇంటరాగేషన్ ద్వారానే నిజాలు బయటికి వస్తాయి. ఐ ఫోన్, ఐ క్లౌడ్ పాస్‌వర్డ్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం మారగానే హార్డ్ డిస్క్‌ల్లో డేటా ధ్వంసం చేశారు. కొత్తగా 50 హార్డ్ డిస్కులు అక్కడ పెట్టారు. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, జడ్జిలు, బిల్డర్లు, వ్యాపారుల ఫోన్లు టాప్ చేశారు. నక్సలైట్ల పేరుతో ఈ కార్యక్రమాలన్నీ చేశారు. డేటా మొత్తం డిలీట్ చేసి డివైసెస్ మాకు ఇచ్చారు’’ అని కోర్టుకు సిద్ధార్థ లూథ్రా తెలిపారు. ప్రభాకర్‌రావు తరఫున శేషాద్రి నాయుడు తన వాదనలు వినిపిస్తూ.. డివైస్ రీసెట్ చేసేందుకు సిద్ధమన్నారు. ఇరు వాదనలు విన్న ధర్మాసనం.. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో ప్రభాకర్ రావు ఐ క్లౌడ్ పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల (నవంబర్ 18)కి వాయిదా వేసింది.