
అండగా ఉంటాం పాకిస్తాన్ దాడుల బాధిత కుటుంబాలకు రాహుల్ గాంధీ భరోసా
జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ పట్టణంలో పర్యటన
పూంచ్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ పట్టణంలో పర్యటించారు. ఈ నెల 7 నుంచి 10వ తేదీ దాకా పాకిస్తాన్ సైన్యం దాడు ల్లో మృతిచెందినవారి కుటుంబ సభ్యులను పరామర్శించి, సంఘీభావం ప్రకటించారు. గంటకుపైగా బాధితులతో మాట్లాడారు. వారి ఆవేదన విని చలించిపోయారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు.
బాధితుల సమస్యలను జాతీయ స్థాయికి తీసుకెళ్తామని, అందరికీ తెలియజేస్తామని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు. నియంత్రణ రేఖకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూంచ్ టౌన్‌లో క్రిస్ట్ స్కూల్‌ను రాహుల్ సందర్శించారు. మే 7న ఉదయం పాక్ సైన్యం దాడుల్లో ఈ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు చనిపోయారు.
అయాన్, అరూబా అనే 13 ఏళ్ల ఇద్దరు కవలలు, రమీజ్ ఖాన్ అనే మరో విద్యార్థి మరణించాడు. తమ మిత్రులు దూరం కావడాన్ని ఈ స్కూల్ విద్యార్థులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. రాహుల్ వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. అంతా త్వర లోనే సర్దుకుంటుందని అన్నారు. ‘‘మీకు ఎదురైన సమస్యలకు ప్రతిస్పందనగా చదువులపై దృష్టి పెట్టండి’’అని సూచించారు.
చక్కగా చదువుకోవాలని, చక్కగా ఆడుకోవాలని, ఎంతోమంది స్నేహితులను సంపాదించుకోవాలి అంటూ విద్యార్థులను ఓదార్చారు. పూంచ్ నుంచి ఓ కుటుంబం కారులో సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోతుండగా పాకిస్తాన్ క్షిపణితో దాడి చేసింది. ఈ దాడిలో కారులో ఉన్న 13 ఏళ్ల బాలుడు విహాన్ భార్గవ్ ప్రాణాలు కోల్పోయాడు. విహాన్ భార్గవ్ కుటుంబాన్ని కూడా రాహుల్ పరామర్శించారు.