కేసు కొట్టేసిన మధ్యప్రదేశ్ హైకోర్టు
జబల్పూర్: కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడు కార్తికేయ చౌహాన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యల పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క్షమాపణ కోరారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ హైకోర్టులో రాహుల్ బుధవారం పిటిషన్ వేశారు. గురువారం దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ప్రమోద్‌కుమార్ అగర్వాల్ కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు. 2018లో ఝబువాలో జరిగిన ర్యాలీలో పనామా పత్రాల లీక్ కుంభకోణంతో సంబంధముందంటూ రాహుల్ తన పేరును ప్రస్తావించారంటూ కార్తికేయ ఆరోపిస్తున్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ భోపాల్‌లోని ఎంపీ/ఎమ్మెల్యేల కేసుల ప్రత్యేక కోర్టులో పరువు నష్టం కేసు వేశారు.
ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ కోర్టు రాహుల్‌కు సమన్లు పంపింది. దీంతో, రాహుల్ హైకోర్టును ఆశ్రయించారు. అప్పట్లో తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని రాహుల్ పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం కుమారుడి పేరుకు బదులుగా పొరపాటున కార్తికేయ పేరును ప్రస్తావించానని పిటిషన్‌లో తెలిపారు. పరువునష్టం కేసుతోపాటు సమన్లను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై, కార్తికేయ సానుకూలంగా స్పందించారు. రాహుల్ క్షమాపణను స్వీకరిస్తున్నానని, భోపాల్ కోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటానని తెలిపారు. దీంతో, హైకోర్టు కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులిచ్చింది.
ఆయనకిలాంటివి అలవాటే: బీజేపీ
తప్పుడు ఆరోపణలు పదేపదే చేయడం, న్యాయపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తే తర్వాత క్షమాపణలు చెప్పడం వంటివి రాహుల్ గాం«దీకి అలవాటై పోయాయని బీజేపీ ఆరోపించింది. ఎలాంటి ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తూ ఆయన అబద్ధాల కోరుగా మారారని వ్యాఖ్యానించింది. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత కాదు..దు్రష్పచార నేత’అంటూ అభివర్ణించింది.


