breaking news
panama papers leak
-
ఐశ్వర్య రాయ్‌కు ఈడీ సమన్లు.. ఎందుకంటే ?
Aishwarya Rai Got ED Notices In Panama Paper Case: పనామా పేపర్ల లీక్ కేసు బచ్చన్ కుటుంబానికి కష్టాలు తెచ్చిపెట్టాయి. ఈ వ్యవహారంలో నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఇవాళ (డిసెంబర్ 20) ఢిల్లీలోని లోక్‌నాయక్ భవన్లో తమ ఎదుట హాజరు కావాలని ఈడీ ఆదేశించినట్లు సమాచారం. ఈడీ ఆదేశాల ప్రకారం అధికారుల ముందు ఇవాళ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈడీ అధికారులు ప్రశ్నల జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ పనామా పేపర్స్ కేసులో భారత్ నుంచి సుమారు 500 మందికి ప్రమేయం ఉన్నట్లు సమాచారం. ఇందులో నాయకులు, నటులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నవారు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పనామా పేపర్ల కేసుపై గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈడీ అధికారులు దేశంలోని పలువురు ప్రముఖులను విచారణలో చేర్చారు. అందులో భాగంగా నెల రోజుల క్రితం అభిషేక్ బచ్చన్‌కు కూడా ఈడీ సమన్లు జారీ చేయగా అధికారుల ముందు హాజరయ్యారు. ఈడీ అధికారులకు అభిషేక్ కొన్ని పత్రాలను అందజేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఐశ్వర్య రాయ్‌కు సమన్లు జారీ కావడం చర్చనీయంగా మారింది. -
'పనామా'లో తెలుగువాళ్లు
‘నల్ల’ జాబితా-3 మోటూరి శ్రీనివాస్, జయకుమార్, వోలం భాస్కర్‌రావు నీరా రాడియా, ఎస్కే మోదీ, బళ్లారి పారిశ్రామికవేత్త పేర్లూ తెరపైకి చార్టర్డ్ అకౌంటెంట్, వజ్రాల వ్యాపారులూ.. కొన్ని కంపెనీలు మూతపడ్డాయంటున్న యజమానులు న్యూఢిల్లీ: పనామా పేపర్స్ లీక్‌లో భాగంగా బుధవారం వెల్లడించిన తాజా జాబితాలో ముగ్గురు తెలుగువారి పేర్లు తెరపైకి వచ్చాయి. నందన్ క్లీన్టెక్ కంపెనీ ఎండీ మోటూరి శ్రీనివాస్ ప్రసాద్, నందన్ టెక్నాలజీస్, గ్రాండ్బే కెనాల్ లిమిటెడ్ ఎండీ భావనాసి జయకుమార్, నందన్ టెక్నాలజీస్ మాజీ ఎండీ వోలం భాస్కర్ రావు పేర్లు వెల్లడయ్యాయి. వీరితోపాటు.. ఎనిమిదేళ్ల క్రితం (యూపీఏ హయాంలో) భారత కార్పొరేట్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన నీరా రాడియా పేరు కూడా బయటకొచ్చింది. చాలెంజ్ సాకర్ లిమిటెడ్‌లో ప్రధాన భాగస్వామి ఎస్కే మోదీ, వరల్డ్ వైడ్ గ్రూప్ హోల్డింగ్ భాగస్వాములు ప్రీతమ్ బోత్రా, శ్వేత గుప్తా, పలువురు వజ్రాల వ్యాపారులతోపాటు బళ్లారికి చెందిన ఇద్దరు ముడి ఇనుము ఎగుమతిదారులు, కోల్‌కతా, అహ్మదాబాద్, హిమాచల్‌ప్రదేశ్‌లకు చెందిన వ్యాపారవేత్తలు ఓ చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నారు. మోటూరి శ్రీనివాస్ ప్రసాద్ విదేశాల్లో కంపెనీలు: నాలుగు ప్రాంత: బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్ పనామా పేపర్స్ లిస్టులో హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామిక వేత్త మోటూరి శ్రీనివాస్ ప్రసాద్ పేరుంది. ఈయన 2011 నుంచి బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్‌లోని నాలుగు కంపెనీల్లో డెరైక్టర్‌గా కొనసాగుతున్నారు. శ్రీనివాస్ ప్రసాద్ నందన్ క్లీన్టెక్ కంపెనీకి మేనేజింగ్ డెరైక్టర్‌గా, సికా సెక్యూరిటీస్ లిమిటెడ్ కంపెనీకి సహ-యజమానిగా కొనసాగుతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద బయో ఇంధనం ప్రాసెసింగ్ కంపెనీతో పాటు.. పలు ఇతర కంపనీలను ఈయన స్థాపించారు. బయో ఇంధనం ఎగుమతిలో అవకతవకలున్నాయన్న కేసులో 2012 ఏప్రిల్ 2న శ్రీనివాస ప్రసాద్ అరెస్టయ్యారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. భావనాసి జయకుమార్ విదేశీ కంపెనీలు: నందన్ టెక్నాలజీస్ లిమిటెడ్, యస్ డి వెంచర్స్ ఎస్ఏ, గ్రాండ్బే కెనాల్ లిమిటెడ్ మొదలైనవి ప్రాంతం: బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్ (బీవీఐ) హైదరాబాద్‌కు చెందిన భావనాసి జయకుమార్ పలు విదేశీ కంపెనీల్లో మోటూరి శ్రీనివాస్ ప్రసాద్, వోలం భాస్కర్ రావుతో కలిసి డెరైక్టర్‌గా ఉన్నారు. రికార్డుల ప్రకారం 2008లో బీవీఐలో నందన్ టెక్నాలజీస్‌ను, 2015లో గ్రాండ్బే కెనాల్ కంపెనీని ప్రారంభించినట్లు తెలుస్తోంది. నందన్ టెక్నాలజీస్ కింద నడుస్తున్న ఆరు కంపెనీలకు జయకుమార్ డెరైక్టర్‌గా ఉన్నారు. అయితే.. ఈ కంపెనీలకు తనకూ సంబంధం లేదన్న జయకుమార్ తన భార్య పేరుతో ఈ కంపెనీలున్నట్లు ఒప్పుకున్నారు. వోలం భాస్కర్ రావు విదేశీ కంపెనీలు: నందన్ టెక్నాలజీస్, సంబంధింత ఇతర కంపెనీలు ప్రాంతం: బీవీఐ ఈయన నందన్ టెక్నాలజీకి ఎండీగా బాధ్యతలు నిర్వహించారు. దీంతో పాటు సికా సెక్యూరిటీస్ సహ వ్యవస్థాపకుడిగా, ప్రమోటర్‌గా కూడా ఉన్నారు. దీంతో పాటు నందన్ క్లీన్టెక్ లిమిటెడ్‌కు 2008 నుంచి ఎండీగా ఉన్నారు. ప్రస్తుతానికి రిటైర్మెంట్ తీసుకున్నానంటున్న ఈయన.. యూకేలోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు. నీరా రాడియా కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వంలో సులభంగా పనిచేయించేలా మధ్యవర్తిత్వం నడిపినట్లు రేగిన వివాదంలో కేంద్ర బిందువైన నీరా రాడియా.. ఇప్పుడు విదేశాల్లో పెట్టుబడుల విషయంలో మళ్లీ తెరపైకి వచ్చారు. బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్కు చెందిన ‘క్రౌన్ మార్ట్ ఇంటర్నేషనల్’లో రాడియాకు వాటాలున్నట్లు 232 పేపరల్లో వెల్లడైనట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. అయితే.. దీన్ని రాడియా ఖండించారు. సతీశ్ కే మోదీ మోదీ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ చైర్మన్, కేకే మోదీ చిన్న సోదరుడు సతీశ్ కే మోదీ 2010లో చాలెంజ్ సాకర్ లిమిటెడ్ కంపెనీని ప్రారంభించారు. 2013లో మోదీ టౌన్ ఫుట్‌బాల్ క్లబ్ లిమిటెడ్‌నూ ఈయన ప్రారంభించారు. గోల్డ్‌ఫించ్ హోల్డింగ్ గ్రూపులో షేర్‌హోల్డర్‌గా ఉన్నారు. ప్రసన్న వి ఘోటాగే, వామన్ కుమార్ ముడి ఇనుము ఎగుమతి దారైన ప్రసన్న, అతని భార్య నేహ, మిత్రుడు వామన్ కుమార్‌లకు నార్డ్బెల్ కమర్షియల్స్ లిమిటెడ్ కంపెనీలో వాటాలున్నాయి. ఈ కంపెనీ బీవీఐలో 2007లో ప్రారంభమైంది.ప్రసన్నకు చెందిన పీవీజీ కంపెనీ కర్ణాటకలోని బళ్లారి నుంచి 3వేల ట్రక్కుల ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేసింది. కాగా వామన్ కుమార్ అంతర్జాతీయ వ్యాపార సంబంధాలు, ముడి ఇనుము వ్యాపారంలో సిద్ధహస్తుడు. చేతన్ మెహతా, హర్షద్ రామ్నిక్లాల్ వీరిద్దరూ ప్రముఖ వజ్రాల వ్యాపారులు. బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్‌లోని లీచ్టెన్స్టిన్ బ్యాంకుతో పాటు హెచ్ఎస్బీసీ బ్యాంకులో వాటాలున్నందుకు గతంలోనే వీరిని భారత అధికారులు విచారించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల వ్యాపారుడైన ‘రోసీ బ్లూ’ సంస్థకు హర్షద్ రామ్నిక్లాల్ యజమాని. కాగా, తన పేరుతో వచ్చిన కంపెనీలన్నీ గతంలోనే మూతబడ్డాయని చేతన్ మెహతా తెలిపారు. జార్జ్ మాథ్యూ తిరువనంతపురంకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ జార్జ్ మాథ్యూ 12 ఏళ్ల క్రితం సింగపూర్‌లో సెటిలయ్యారు. ఫ్యూచర్బుక్స్ పేరుతో కంపెనీని తెరిచిన ఈయన.. ఇలాంటి కంపెనీల ఏర్పాటుకు సింగిల్ స్టాప్ సర్వీస్ ప్రొవైడర్‌గా ఉన్నారు. సోల్ రిథమ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌తోపాటు కంపెనీల్లో ఈయనకు షేర్లున్నాయి. -
ప్రపంచవ్యాప్తంగా పనామా ప్రకంపనలు!
లండన్: 'పనామా పేపర్స్' ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సంపన్నులు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు, తాజా మాజీ దేశాధ్యక్షులు.. ఇలా చాలామంది పన్ను ఎగ్గొట్టి విదేశాల్లో అక్రమంగా నల్లడబ్బు దాచినట్టు వెలుగులోకి వచ్చిన వివరాలపై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు విచారణ ప్రారంభించాయి. పనామాలోని ఓ లా కంపెనీకి చెందిన 1.15 కోట్ల పత్రాలు లీకవ్వడంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్ సన్నిహితులు, బ్రిటన్ ప్రధాని కామెరాన్, చైనా ప్రధాని జింగ్పింగ్ బంధువులు, పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ కొడుకులు, ఉక్రెయిన్ ప్రధాని కుటుంబసభ్యులు అక్రమంగా విదేశీ బోగస్ కంపెనీలు ఏర్పాటుచేసినట్టు వెల్లడైంది. వీరితోపాటు ఎంతోమంది రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖుల నల్లడబ్బు లోగుట్టు కూడా వెలుగుచూసింది. నల్లడబ్బును దాచేందుకు బోగస్ కంపెనీలు సృష్టించడంలో పనామాకు చెందిన మొసాక్ ఫొనెస్కా లా కంపెనీ దిట్ట. ఆ కంపెనీ ఇప్పటివరకు వివిధ ప్రముఖుల కోసం 2.40 లక్షల బోగస్ కంపెనీలు సృష్టించింది. అనేకమంది ప్రముఖులు ఈ కంపెనీల్లో నల్లడబ్బును దాచినట్టు వెలుగులోకి వస్తున్నది. లియోనల్ మెస్సీ, జాకీచాన్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ వంటి ప్రముఖుల పేర్లు ఈ జాబితాలో ఉండటం కలకలం రేపుతున్నది. ఈ నేపథ్యంలో రష్యా మొదలు బ్రిటన్ వరకు అన్ని దేశాలు ఈ బాగోతంపై స్పందించాయి. పుతిన్ సన్నిహితుల నల్లడబ్బు వ్యవహారంపై రష్యా స్పందిస్తూ.. ఇందులో కొత్తదనంకానీ, సమగ్ర ఆధారాలుకానీ లేవని కొట్టిపారేసింది. ప్రధాని డేవిడ్ కామెరాన్ దివంతగ తండ్రికి కూడా ఈ కంపెనీతో సంబంధాలు ఉన్నట్టు వచ్చిన వార్తలపై స్పందించడానికి బ్రిటన్ ప్రభుత్వం నిరాకరించింది. ఇది ప్రైవేటు మ్యాటర్ కాబట్టి స్పందించబోమని పేర్కొంది. తన సన్నిహితుల పేర్లు 'పనామా పేపర్స్'లో ఉండటంపై ఐస్లాండ్ ప్రధాని సిగ్ముందర్ గున్లలగ్సన్ నోరువిప్పలేదు. తన కుటుంబసభ్యులు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వివరణ ఇచ్చారు. ఇక తమ దేశాల ప్రముఖుల పేర్లు ఈ జాబితాలో ఉండటంతో ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, ఫ్రాన్స్, స్వీడన్, నెదర్లాండ్ తదితర దేశాలు విచారణకు ఆదేశించాయి. మరోవైపు పనామా దేశం కూడా ప్రపంచంలోనే అతిపెద్ద లీక్ బాగోతంగా భావిస్తున్న ఈ వ్యవహారంపై దర్యాప్తుకు ఆదేశించింది.