న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన కారు పేలుడుపై ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటనకు ముందు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు చెందిన మహిళా డాక్టర్ షహీన్ సయీద్‌ను హర్యానాలోని ఫరీదాబాద్‌లో పేలుడు పదార్థాల అక్రమ రవాణాకు సంబంధించిన ఉదంతంలో పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్ షహీన్ ఒక ప్రొఫెషనల్ మాదిరిగా తన పని తాను చేసుకుంటూ ఉండేవారు. ఆమె సన్నిహితులు కూడా ఆమె ఏమి చేస్తుంటారో గ్రహించలేకపోయారు.
డాక్టర్ షహీన్ సయీద్.. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైష్ ఎ మొహమ్మద్ (జెఎమ్)కు భారతదేశంలో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు కనుగొన్నాయి. హర్యానాలోగల అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో సయీద్‌తో పాటు పనిచేస్తున్న ఒక ప్రొఫెసర్ ‘ఎన్‌డీటీవీ’తో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు చూస్తుంటే సయీద్ ఏమి చేస్తున్నారో ఇప్పుడు అర్థం అయ్యిందన్నారు. సయీద్.. వర్శిటీలో క్రమశిక్షణతో ఉండేవారు కాదని, ఎవరికీ తెలియజేయకుండా బయటకు వెళ్లిపోయేవారని ఆ అని ప్రొఫెసర్ తెలిపారు.
చాలా మంది ఆమెను కళాశాలలో కలవడానికి వచ్చేవారని, ఆమె ప్రవర్తన వింతగా ఉండేదని, ఆమెపై పలు ఫిర్యాదులు కూడా వర్శిటీ యాజమాన్యానికి అందాయని తన పేరు వెల్లడించవద్దని కోరిన ఆ ప్రొఫెసర్ తెలిపారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏకీ తాము సహకరిస్తామని చెప్పారు. కాగా సయీద్ వ్యక్తిగత రికార్డులను, ఆమె గతంలో ఎక్కడ పనిచేసిందనే వివరాలను పరిశీలించాలని వర్శిటీ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.
జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ నేతృత్వంలోని జైషే మహమ్మద్ మహిళా విభాగం జమాత్ ఉల్-మోమినాత్ భారత శాఖకు సయీద్ బాధ్యత వహిస్తున్నారని ‘ఎన్‌డీటీవీ’ తన కథనంలో పేర్కొంది. అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో పనిచేసిన కశ్మీరీ వైద్యుడు ముజమ్మిల్ గనై అలియాస్ ముసైబ్‌తో సయీద్‌కు సంబంధాలున్నాయి. ఫరీదాబాద్‌లోని అతని ఇంటి నుండి 2,900 కిలోల పేలుడు పదార్థాలు, మండే పదార్థాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. అస్సాల్ట్ రైఫిల్, పిస్టల్, మందుగుండు సామగ్రిని నిల్వ చేయడానికి ఉపయోగించిన కారు సయీద్‌కు చెందినదని దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. కాగా ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడితో తొమ్మిది మంది మృతి చెందిన విషయం విదితమే.
ఇది కూడా చదవండి: ఢిల్లీ పేలుడు: ‘భయంతో పేల్చేశారా?’.. నిఘా వర్గాలు


