రెండోవిడత ‘పద్మ’ పురస్కారాలు ప్రదానం | President Murmu confers Padma awards | Sakshi
Sakshi News home page

రెండోవిడత ‘పద్మ’ పురస్కారాలు ప్రదానం

Jun 24 2026 5:25 AM | Updated on Jun 24 2026 5:25 AM

President Murmu confers Padma awards

రాష్ట్రపతి నుంచి ‘పద్మభూషణ్‌’ పురస్కారం అందుకుంటున్న డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు

క్యాన్సర్‌ నివారణలో సేవలందించిన డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడుకు ‘పద్మభూషణ్‌’

రోహిత్‌శర్మకు పద్మశ్రీ ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము

సాక్షి, న్యూఢిల్లీ: రెండోవిడత ‘పద్మ’ పురస్కారాల ప్రదానోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన దాదాపు 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పురస్కారాలు అందజేశారు. మంగళవారం ఢిల్లీ­లోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, స్పీకర్‌ ఓంబిర్లా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తదితరులు హాజరయ్యారు. రెండు పద్మ విభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేశారు. 

మనవాళ్లకు ‘పద్మ’లు
క్యాన్సర్‌ నివారణ, వైద్య రంగంలో అంతర్జాతీయంగా ఎనలేని సేవలందించిన ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు ‘పద్మభూషణ్‌’ అవార్డును స్వీకరించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఈ వేడుకలో ప్రత్యేక గౌరవం దక్కింది. సుదీర్ఘ కాలంగా వెండితెరపై నటుడిగా, నిర్మాతగా సేవలందించిన మాజీ ఎంపీ మురళీమోహన్, వైవిధ్యభరితమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు రాజేంద్రప్రసాద్, తెలంగాణకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ చంద్రమౌళి, డాక్టర్‌ కృష్ణమూర్తి, డాక్టర్‌ కుమారస్వామి తంగరాజ్, పశుసంవర్థక విభాగం నుంచి మామిడి రమారెడ్డికి అవార్డు ప్రకటించగా భార్య శ్యామలారెడ్డి పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలో తన అద్భుత నటనతో గుర్తింపు తెచ్చుకున్న సీనియర్‌ నటుడు మమ్ముట్టిని కేంద్రం ‘పద్మభూషణ్‌’ పురస్కారంతో సత్కరించింది. వీరితో పాటు ప్రముఖ నటుడు ఆర్‌.మాధవన్‌ను కూడా కేంద్రం పద్మశ్రీతో గౌరవించింది. క్రీడా విభాగంలో.. భారత క్రికెట్‌ జట్టుకు ఎన్నో అద్భుత విజయాలను అందించి ప్రపంచ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన కెప్టెన్‌ రోహిత్‌శర్మ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement