2047 నాటికి ‘వికసిత్ భారత్’ స్వప్నం సాకారం
అగ్రశ్రేణి 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్
స్వయం సమృద్ధి.. ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగడం, ఒలింపిక్స్‌కు ఆతిథ్యం, అంతరిక్షంలోకి అడుగుపెట్టడం..
దూరదృష్టితో కూడిన విధానాలు, అవిశ్రాంత కృషితో ఈ లక్ష్యాలను సాధిస్తాం
నా దృష్టిలో ప్రజలు సాక్షాత్తూ దైవస్వరూపులు
ప్రజల పాదపద్మాలకు భక్తిపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా
‘వికసిత్ భారత్ సంకల్ప్ సభ’లో ప్రధాని మోదీ
ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా మోదీ పాలనకు 25 ఏళ్లు పూర్తి
ఓటుబ్యాంకు ప్రయోజనాల కోసం రాజకీయంగా విడిపోవడం దేశం ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్టమైన సవాళ్లలో ఒకటి. ఏదైనా ఆపద వస్తే అది వర్గం లేదా కులానికి అతీతంగా అందరిపైనా ప్రభావం చూపుతుంది. రైతు పొలంలో నీటి కొరత ఏర్పడితే.. ఆ సమస్య కేవలం ఒక కులానికే పరిమితం అవుతుందా? సమస్య అందరికీ సంబంధించినదైనప్పుడు పరిష్కారం కూడా అందరికీ వర్తించేలా ఉండాలి.
– వికసిత్ భారత్ సంకల్ప్ సభలో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా ప్రస్థానం 25 ఏళ్ల మైలురాయిని అధిగమించింది. 2001 అక్టోబర్ 7న తొలిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా, తర్వాత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ పాలనకు పాతికేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మనం అనుకున్నది చేసి చూపిద్దాం(వుయ్ విల్ డూ ఇట్) అనే కొత్త నినాదాన్ని ప్రధానమంత్రి వినిపించారు. ప్రజలందరి ఉమ్మడి కృషితో 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని కచ్చితంగా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మోదీ పాతికేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొని బుధవారం ఢిల్లీలో ‘వికసిత్ భారత్ సంకల్ప్ సభ’ నిర్వహించారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు, మోదీ అభిమానులు భారీగా తరలివచ్చారు. మోదీ మాట్లాడుతూ.. వివిధ రంగాల్లో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావించారు. ఒకప్పుడు అసాధ్యంగా భావించినవి నేడు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. 2026లో మనం కంటున్న ‘అభివృద్ధి చెందిన భారత్’అనే కల కచ్చితంగా సాకారం అవుతుందని, దేశం ఇప్పుడు ఇక్కడే ఆగిపోవడానికి ఎటువంటి కారణం లేదని ఉద్ఘాటించారు. వందేళ్ల క్రితం మన జనాభా 40 కోట్ల కంటే తక్కువగా ఉండేదని, నేడు 140 కోట్లకు చేరిందని అన్నారు. 140 కోట్ల మంది పౌరులు కలిసి 2047 నాటికి ‘వికసిత్ భారత్’ను నిర్మిస్తారని పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే..
ప్రజల శక్తి సామర్థ్యాలపై విశ్వాసం ఉంది
‘‘ఎన్నికల సమయంలో కులపరమైన విభజనలు ఒక ప్రధాన సవాలుగా మారుతున్నాయి. ఓటు బ్యాంకు ప్రయోజనాల కోసం రాజకీయంగా విడిపోవడం దేశం ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్టమైన సవాళ్లలో ఒకటి. ఏదైనా ఆపద వచ్చినప్పుడు అది వర్గం లేదా కులానికి అతీతంగా అందరిపైనా ప్రభావం చూపుతుందని గుర్తుంచుకోవాలి. రైతు పొలంలో నీటి కొరత ఏర్పడినప్పుడు, ఆ సమస్య కేవలం ఒక కులానికే పరిమితమవుతుందా? విద్యుత్ లేనప్పుడు చీకటి కేవలం ఒక వర్గానికే అలుముకుంటుందా? సమస్య అందరికీ సంబంధించినదైనప్పుడు పరిష్కారం కూడా అందరికీ వర్తించేలా ఉండాలి. కేవలం పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి బయటపడగలరని ఎవరైనా ఉహించారా? కానీ. భారత్ దీనిని సాధ్యం చేసి చూపించింది. అందుకే 140 కోట్ల మంది భారతీయుల శక్తి సామర్థ్యాలపై నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. మన దేశం రూపాంతరం చెందడాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఫలితాలు కళ్లముందే కనిపిస్తున్నాయి.
సవాళ్లకు 140 కోట్ల పరిష్కారాలున్నాయి
2047 నాటికి వికసిత్ భారత్: మనం చేసి చూపిద్దాం. అగ్రశ్రేణి 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్: మనం చేసి చూపిద్దాం. స్వయం సమృద్ధి: మనం చేసి చూపిద్దాం. ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగడం: మనం చేసి చూపిద్దాం. ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం: మనం చేసి చూపిద్దాం. అంతరిక్షంలోకి అడుగుపెట్టడం: మనం చేసి చూపిద్దాం. ఈ శక్తి, ఈ ఉత్సాహం, ఈ ఆత్మవిశ్వాసం అద్భుతమైనవి. దూరదృష్టితో కూడిన విధానాలు, అవిశ్రాంత కృషి ద్వారా ఈ లక్ష్యాలను సాధిస్తాం. భారత్ ముందు సవాళ్లు ఉండొచ్చు గానీ 140 కోట్ల పరిష్కారాలు కూడా ఉన్నాయి. ఫ్లై దుబాయ్ విమానంలో ప్రయాణికులను రక్షించిన భారతీయ కెపె్టన్ స్మిత్ మచ్ఛార్ గురించి నేడు ప్రపంచం మాట్లాడుకుంటోంది. మేడ్ ఇన్ ఇండియా విమానాల గురించి కూడా ప్రపంచం మాట్లాడుకునే రోజు వస్తుంది.
కష్టపడి పనిచేసే కార్యకర్తలే నా బలం
2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఈ మైలురాయిని చేరుకుంటానని ఎప్పుడూ ఊహించలేదు. ప్రభుత్వ అధినేతగా అవిశ్రాంతంగా సేవలందిస్తూ ఈ రోజుతో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. నాపై నమ్మకం ఉంచిన దేశ ప్రజలకు ధన్యవాదాలు. నా దృష్టిలో ప్రజలే భగవంతుడు. కష్టపడి పనిచేసే బీజేపీ కార్యకర్తలే నా బలం. దేశ ప్రజల పాదపద్మాలకు భక్తిపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే బీజేపీ, ఎన్డీఏలోని నా సహచరులకు, ప్రజాస్వామ్యం పట్ల అపారమైన గౌరవం ఉన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. గత 25 ఏళ్లలో అనేక ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికలైనా సరే, పార్లమెంటరీ ఎన్నికలైనా సరే ప్రజలు ఎల్లప్పుడూ తమ సేవ కోసం నన్ను ఎన్నుకున్నారు. ఈ రోజు భారతదేశ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి కూడా వందనాలు సమర్పిస్తున్నాను. నేను ఎక్కడ ఉన్నా, ఏ పదవిలో ఉన్నా అందులో ప్రజలదే అత్యంత గొప్ప పాత్ర. నా దృష్టిలో ప్రజలు సాక్షాత్తు దైవస్వరూపులు. కోట్లాది మంది భారతీయుల విశ్వాసం, లెక్కలేనంత మంది పార్టీ కార్యకర్తల కఠోర శ్రమ ఎల్లవేళలా నాకు గొప్ప బలంగా నిలిచాయి.
వారికి సర్వదా కృతజ్ఞుడిని
నేను గతాన్ని తిరిగి చూసుకున్నప్పుడు కృతజ్ఞతాభావం తప్ప మరేమీ కలగదు. నాకు ఎన్నో విషయాన్ని నేర్పించిన ప్రతి వ్యక్తికీ, ప్రతి అనుభవానికీ సర్వదా కృతజ్ఞుడిని. ఉపాధ్యాయులు నాకు వినయాన్ని నేర్పారు. నన్ను కిందకు లాగినవారు తిరిగి ఎలా పైకి లేవాలో నేర్పారు. నా మద్దతుదారులు నన్ను ప్రోత్సహిస్తే, విమర్శకులు నా అంతరాత్మను పరిశీలించుకోవడం నేర్పారు. నాకు అండగా నిలిచినవారు నమ్మకానికి ఉన్న శక్తిని చూపించారు. ఈ దేశం అపారమైన ఆశీర్వాదాలు అందించింది. అందుకే దేశం పట్ల నా బాధ్యత అత్యంత గొప్పది. దేశంలో ప్రతి పౌరుడికీ నాపై ప్రథమ హక్కు ఉందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నా. ప్రజల విశ్వాసంతో కూడిన ఈ 25 ఏళ్ల కాలం, ఈ 25 ఏళ్ల అనుభవం ఒక గొప్ప సంపద. ఈ సంపద కేవలం మోదీకి మాత్రమే చెందినది కాదు.. ఇది దేశానికి చెందినది. భరతమాత బిడ్డలందరికీ ఈ సంపదపై హక్కు ఉంది.
ఒంటరినని ఎప్పుడూ భావించలేదు
నేర్చుకోవాలనే తపన నా జీవితంలో ఒక భాగంగా మారింది. ఇప్పటికీ నన్ను నేను ఒక విద్యార్థిగానే భావిస్తా. ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటా. నేను ఎప్పుడూ ఒంటరినని భావించలేదు. భారతదేశ సాంస్కృతిక ఆత్మకు రక్షకులుగా ఉంటూ, భరతమాతకు సేవ చేయడం అనే ఏకైక లక్ష్యంతో పనిచేసే అసంఖ్యాక స్వయంసేవకులు అండగా ఉన్నారు. తాము సేవలకుమని వారు ప్రతిపక్షం గుర్తుచేస్తుంటారు. అదే నాకు స్ఫూర్తి. నిబద్ధత, అంకితభావంతో దేశానికి సేవ చేస్తున్న ప్రతి స్వయంసేవకుడికి, కార్యకర్తకు నేను గౌరవపూర్వకంగా అభివందనం చేస్తున్నా. నన్ను వ్యతిరేకించిన వారు ప్రజాస్వామ్య శక్తిని నాకు వివరించారు. ప్రతి సంక్షోభం నా సహనాన్ని పరీక్షించింది. ప్రతి విజయం నా బాధ్యతలను మరింత విస్తరింపజేసింది. ప్రతి సాధన గొప్ప లక్ష్యాల దిశగా ముందుకు సాగడానికి ధైర్యాన్ని, దృఢ సంకల్పాన్ని ఇచ్చింది.
కర్తవ్య నిర్వహణే సర్వస్వం.. అదే నా ధర్మం
ఈ రోజు కేవలం జ్ఞాపకాలకే పరిమితమైనది కాదు. మన సంకల్పాలకు నూతన ఉత్సాహాన్ని జోడించుకునే రోజు ఇది. ‘మేము దీన్ని సాధించి తీరుతాం’అనే మాటను, ఆ సంకల్పాన్ని మరోసారి పునరుద్ఘాటించే రోజు ఇది. కేవలం సంస్థ కోసమే పనిచేసిన వ్యక్తిగా నా రాజకీయ పనితీరు నివేదిక (రిపోర్ట్ కార్డ్) ఉంటుంది. గతంలో ఇతరుల తరపున ఎన్నికల్లో పనిచేశాను కానీ, స్వయంగా ఒక్క ఎన్నికలోనూ పోటీ చేయలేదు. ఎన్నికల రాజకీయాల్లో రాణించాలనే కోరిక ఉండి ఉంటే, నేను చాలా ముందే ఆ రంగంలోకి అడుగుపెట్టి ఉండేవాడిని. కానీ, అది నా స్వభావం కాదు. ఎందుకంటే, వ్యక్తిగత ఆశయాల కోసం కాకుండా ఒక నిర్దిష్ట లక్ష్యం(మిషన్) కోసం జీవించే వ్యక్తిగా ఉండాలన్నదే నా ఆశయం. చిన్నప్పటి నుంచి అలాగే పెరిగాను. నాకు లభించిన ఏ బాధ్యతలనైనా సరే, వాటిని ఒకదాని తర్వాత ఒకటిగా సమర్థవంతంగా నిర్వర్తించాను. నా జీవితానికి ఒకే ఒక్క లక్ష్యం ఉంది.. అది దేశం కోసం నిస్వార్థ సేవ. నా దృష్టిలో కర్తవ్య నిర్వహణే సర్వస్వం. అదే నా ధర్మం. కర్తవ్యాన్ని నిర్వర్తించడం నా హక్కు. పనిని నా బాధ్యతగా భావిస్తాను. నా పూర్తి సామర్థ్యంతో ప్రతి పనిని నిరంతరం కొనసాగిస్తూనే ఉంటాను. ఆ పని ఆగకూడదు, ఆ కృషి ఆగిపోకూడదు. నా దృష్టిలో పని అనేది కేవలం ఒక బాధ్యత మాత్రమే కాదు, అది దేశం పట్ల నాకున్న అంకితభావం. దేశం కోసం పని చేస్తా, ప్రజల కోసం పని చేస్తా’’అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.


