భేటీలతో మోదీ బిజీ బిజీ | PM Narendra Modi chairs review meeting post Cyclone Remal situation | Sakshi
Sakshi News home page

భేటీలతో మోదీ బిజీ బిజీ

Jun 3 2024 5:17 AM | Updated on Jun 3 2024 5:17 AM

PM Narendra Modi chairs review meeting post Cyclone Remal situation

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అధికార యంత్రాంగంతో సమీక్షలు నిర్వహించారు. మూడోసారి అధికారంలోకి వస్తే ‘100 రోజుల అజెండా’లో చేయాల్సిన పనులపై చర్చించారు.

వరస సమీక్షలు 
రేమాన్‌ తుపాను బీభత్సం, సహాయక చర్యలు తదితరాలపై మోదీ సమీక్ష జరిపారు. దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో పౌరుల మరణానికి కారణనమైన హీట్‌వేవ్‌పై సమీక్ష జరిగింది. ఆస్పత్రుల్లో సరిపడ పడకలు, వైద్యులు, వైద్యసిబ్బంది, ఔషధాల లభ్యతపై చర్చించారు. జూన్‌ ఐదో తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. 

అన్నింటికన్నా ముఖ్యమైనదిగా భావిస్తున్న ‘100 రోజుల అజెండా’పై విడిగా మరో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారంలోకి రాగానే చేపట్టాల్సిన పనుల పురోగతిపై ప్రధాని అధికారులను ఆరాతీశారు. తొలి 100 రోజుల్లో ఎలాంటి పనులు చేస్తే బాగుంటుందో సలహాలు, సూచనలు ఇవ్వాలని గతంలో మంత్రిమండలి సభ్యులను మోదీ ఆజ్ఞాపించడం తెల్సిందే. 

ఫైర్, ఎలక్ట్రిక్‌ సేఫ్టీ ఆడిట్లు చేయండి 
ఎండలు, వేడి వాతావరణం కారణంగా భవనాల్లో ఎలక్ట్రిక్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి అగి్నప్రమాదాలకు దారి తీయకుండా ఎప్పటికప్పుడు ఫైర్, ఎలక్ట్రిక్‌ సేఫ్టీ ఆడిట్లను చేయాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. అధిక ఉష్ణోగ్రతల ధాటికి అటవీప్రాంతాల్లో కార్చిచ్చు ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అటవీశాఖ అధికారులకు సూచనలు చేశారు. ‘ మిజోరం, అస్సాం, మణిపూర్, త్రిపుర, మేఘాలయలో రేమాల్‌ తుపాను బాధితులకు అండగా ఉంటామని మోదీ భరోసా ఇచ్చారు’ అని కేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ భేటీల్లో పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement