మోదీ కేబినెట్‌లో భారీ మార్పులు? | PM Modi Set For Major Cabinet Reshuffle on the Cards | Sakshi
Sakshi News home page

మోదీ కేబినెట్‌లో భారీ మార్పులు?

Jun 24 2026 1:32 PM | Updated on Jun 24 2026 1:49 PM

PM Modi Set For Major Cabinet Reshuffle on the Cards

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో త్వరలోనే భారీ పునర్వ్యవస్థీకరణ జరగనున్నట్లు జాతీయ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌లో మార్పులు, చేర్పులపై బీజేపీ అధిష్ఠానం అంతర్గతంగా విస్తృత కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల కేంద్ర సహాయ మంత్రి జార్జ్‌ కురియన్‌ రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో మరికొందరు మంత్రులను కూడా రాజీనామా చేయాలని పార్టీ నాయకత్వం కోరే అవకాశముందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సమాచారం మేరకు.. కేంద్ర మంత్రివర్గంలో దాదాపు 38 మంది మంత్రుల బాధ్యతల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పనితీరు ఆశించిన స్థాయిలో లేని మంత్రులకు ఉద్వాసన పలుకుతూ, ఎన్నికల దృష్ట్యా కీలక రాష్ట్రాలకు చెందిన ఎంపీలకు మంత్రి పదవులు కట్టబెట్టే వ్యూహాన్ని బీజేపీ అమలు చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో పంజాబ్‌, యూపీ, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, మణిపూర్‌, గోవా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పెంచే దిశగా నిర్ణయాలు ఉండొచ్చని తెలుస్తోంది. అలాగే మోదీ కేబినెట్‌లో చాలా కాలంగా కొనసాగుతున్న కొందరు సీనియర్ మంత్రులను తప్పించి, యువతకు, ముఖ్యంగా జెన్-జీ తరం నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలో పార్టీ అధిష్ఠానం ఉన్నట్లు సమాచారం. యువ ఓటర్లను ఆకర్షించే లక్ష్యంతో కొత్త తరానికి చెందిన నాయకులను మంత్రివర్గంలోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

మంత్రి పదవుల రేసులో పలు పేర్లు వినిపిస్తున్నాయి. శ్రీకాంత్‌ షిండే, ఈటల రాజేందర్‌, డీకే అరుణ, కకోలీ ఘోష్‌, తదితర నేతలకు అవకాశాలు ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ నుంచి కూడా పలు కీలక మార్పులు ఉండొచ్చని సమాచారం. ఇక ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన ఎంపీలకు(రాఘవ్‌ చద్దా, టీఎంసీ నుంచి పలువురు, మహారాష్ట్ర నుంచి కొందరు) కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల నుంచి వచ్చిన నేతలకు ప్రాధాన్యత ఇచ్చే దిశగా చర్చలు జరుగుతున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

గతంలో మోదీ 2.0 ప్రభుత్వ హయాంలో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో 12 మంది మంత్రులు రాజీనామా చేయగా, పలువురికి పదోన్నతులు లభించాయి. దాదాపు 30 మంది కొత్త వారికి మంత్రివర్గంలో చోటు దక్కింది. అదే తరహాలో ఈసారి కూడా భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం లేదా బీజేపీ అధిష్ఠానం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారాలపై ఆసక్తి నెలకొంది. రాజకీయంగా కీలకమైన రాష్ట్ర ఎన్నికల ముందు జరిగే ఈ పునర్వ్యవస్థీకరణ దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీయనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement