ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై రాజకీయ పోరు మరింత ఉధృతమైంది. అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారంటూ ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలు.. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనలను కొనసాగిస్తున్నాయి. వరుస ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ రాజకీయంగా వేడెక్కింది. ఇప్పటికే మూడు రోజులుగా నిరసనలు చేపట్టిన విపక్ష ఎంపీలు.. నాలుగో రోజూ తమ ఆందోళనలను కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో..
ఎస్‌ఐఆర్ అంశంపై తదుపరి కార్యాచరణను ఖరారు చేసేందుకు విపక్ష ఎంపీలు నేడు మధ్యాహ్నం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో సమావేశం కానున్నారు. అనంతరం ఇండియా కూటమి నేతల బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తమ అభ్యంతరాలను వివరించనుంది. ఓటర్ల జాబితా నుంచి అర్హులైన వారి పేర్ల తొలగింపు, ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై ఫిర్యాదు చేయడంతోపాటు సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఈ భేటీకి సంబంధించి పది మంది నేతల బృందం రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించనున్నట్లు సమాచారం.
రేపు జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆందోళన
మరోవైపు, సీఈసీ రాజీనామా డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) రేపు జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చింది. విద్యార్థి సంఘాలు, ఇతర సంస్థలు కూడా ఈ ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. అయితే, నిరసనకు పోలీసుల అనుమతి విషయంలో స్పష్టత లేకపోయినా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని సీజేపీ ప్రతినిధులు చెబుతున్నారు. నిరసనకు ముందు తమ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారని ఆ సంస్థ ఆరోపించగా, ఈ పరిణామాలు ఢిల్లీలో ఉద్రిక్తతలను పెంచాయి.
భారీ భద్రత
వరుస నిరసనలు, రేపటి ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సుమారు 20 వేల మంది పోలీసులను మోహరించినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. నిరసనకారుల కదలికలపై నిఘా పెంచడంతోపాటు రద్దీ ప్రాంతాల్లో అదనపు బలగాలను అందుబాటులో ఉంచారు. ఆందోళనల కారణంగా న్యూఢిల్లీ పరిధిలో ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉండటంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మద్యం దుకాణాలు బంద్
మరో కీలక పరిణామంగా.. ఢిల్లీలో అక్టోబర్ 9, 10 తేదీల్లో అన్ని రిటైల్ మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పోలీసుల నుంచి అందిన సమాచారం ఆధారంగా శాంతిభద్రతలను కాపాడేందుకు ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది.
ఎస్‌ఐఆర్‌పై భిన్న వాదనలు
ఎస్‌ఐఆర్ ద్వారా పశ్చిమ బెంగాల్‌లో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోయాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు, ముస్లిం వర్గాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉందని విమర్శిస్తున్నాయి. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ సహా పలువురు విపక్ష నేతలు సీఈసీ రాజీనామాతోపాటు ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని కోరుతున్నారు.
అయితే, ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్‌ను ఓటర్ల జాబితాలో నకిలీ, పునరావృత, మరణించిన వారి పేర్లను తొలగించే ప్రక్రియగా సమర్థిస్తోంది. మరోవైపు 42 మంది మాజీ న్యాయమూర్తులు కూడా ఎన్నికల సంఘానికి మద్దతుగా బహిరంగ లేఖ విడుదల చేసి, ఆరోపణలు చేసేవారు ఆధారాలను సమర్పించాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణపై మొదలైన వివాదం ఇప్పుడు ఎన్నికల సంఘం నాయకత్వంపై రాజకీయ పోరుగా మారింది.
ఇదీ చదవండి: దేశం కంటే జ్ఞానేశ్ కుమార్ గొప్ప?


