తమిళనాడు సీఎం విజయ్‌ సంచలన ఆదేశం | No Political Interference, Punish Even the Powerful CM Vijay to Officials | Sakshi
Sakshi News home page

తమిళనాడు సీఎం విజయ్‌ సంచలన ఆదేశం

Jun 30 2026 8:00 AM | Updated on Jun 30 2026 8:49 AM

No Political Interference, Punish Even the Powerful CM Vijay to Officials

సినీ హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించిన విజయ్‌.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా తన పాలనా శైలితో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ఆయన.. తాజాగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు చర్చనీయాంశంగా మారాయి. రాజకీయ జోక్యానికి తావులేకుండా చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని, నేరస్తులు ఎంతటి పలుకుబడి ఉన్నవారైనా ఉపేక్షించవద్దని అధికార యంత్రాంగానికి స్పష్టమైన సందేశం ఇచ్చారు. 

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు, కమిషనర్లు, ఐజీలు, డీఐజీలు సహా రాష్ట్ర ఉన్నతాధికారులతో సీఎం విజయ్‌ రెండు రోజుల ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని ప్రారంభించారు. నామక్కల్‌ కవింజర్‌ మాళిగైలో సోమవారం జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా పలువురు ఉన్నతాధికారులు, మంత్రులు పాల్గొన్నారు. మహిళల భద్రత, డ్రగ్స్‌ నిర్మూలన, వ్యవస్థీకృత నేరాల అణచివేతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తేల్చిచెప్పారు.

సమావేశాన్ని ప్రారంభించిన అనంతరం అధికారులను ఉద్దేశించి విజయ్‌ కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని, చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు ఎంతటి శక్తిమంతులైనా, ఎంతటి రాజకీయ పలుకుబడి ఉన్నవారైనా నిష్పాక్షికంగా చట్టప్రకారం శిక్షించాలి. అమాయకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పడకూడదు అని అధికారులను ఆదేశించారు. రాజకీయ ఒత్తిళ్లకు తావివ్వకుండా స్వేచ్ఛగా విధులు నిర్వహించాలని సూచించారు.

మహిళల భద్రత, చిన్నారుల రక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం విజయ్‌ స్పష్టం చేశారు. మహిళలపై నేరాలు, పోక్సో కేసుల విచారణలో ఎలాంటి జాప్యం ఉండకూడదని, విద్యార్థులు, చిన్నారుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో నిఘా పెంచి డ్రగ్స్‌ ముఠాలపై ఉక్కుపాదం మోపాలని పోలీసు అధికారులకు సూచించారు.

రాష్ట్రాన్ని 'డ్రగ్స్‌-ఫ్రీ తమిళనాడు'గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని విజయ్‌ ప్రకటించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలు, అక్రమ మద్యం తయారీ, ఇసుక అక్రమ తవ్వకాలు, ఖనిజాల స్మగ్లింగ్‌, వ్యవస్థీకృత నేరాలపై రాజీపడకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే, వాటి మూలాలను గుర్తించి ముందస్తుగా అడ్డుకోవడంపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు.

రౌడీషీటర్లు, బెయిల్‌పై బయట ఉన్న నేరస్థుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని విజయ్‌ ఆదేశించారు. సైబర్‌ నేరాలు, కుల ఘర్షణలు, సామాజిక ఉద్రిక్తతలను ప్రారంభ దశలోనే గుర్తించి నివారించేలా యంత్రాంగం పనిచేయాలని పేర్కొన్నారు. భూ వివాదాలు హింసాత్మక ఘటనలకు దారితీయకుండా జిల్లా స్థాయిలో ప్రత్యేక పరిష్కార కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

అవినీతికి తావులేని పారదర్శక పాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని విజయ్‌ స్పష్టం చేశారు. తాగునీరు, వైద్యం, విద్య, విద్యుత్‌, ప్రజా రవాణా వంటి మౌలిక సేవలను ప్రజలకు సమర్థవంతంగా అందించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు.

మూడు విడతల్లో జరుగుతున్న ఈ ఉన్నతస్థాయి సదస్సులో తొలి రోజు కలెక్టర్లు, పోలీసు అధికారులు సంయుక్తంగా పాల్గొన్నారు. రెండో రోజు జిల్లాల అభివృద్ధి పనులపై కలెక్టర్లతో, అనంతరం పోలీసు అధికారులతో సీఎం విజయ్‌ విడివిడిగా సమీక్ష నిర్వహించనున్నారు. సమావేశాల ముగింపులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కలెక్టర్లు, పోలీసు అధికారులు, అటవీ శాఖ అధికారులను సీఎం విజయ్‌ స్వయంగా సత్కరించి పురస్కారాలు అందజేయనున్నారు.

అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పాలన, శాంతిభద్రతలు, మహిళల భద్రత, డ్రగ్స్‌ నిర్మూలనపై సీఎం విజయ్‌ తీసుకుంటున్న కఠిన వైఖరి తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఆయన పాలనా శైలి ఇప్పుడు రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement