యూట్యూబ్‌లో 4 లక్షల మందికి పైగా వీక్షకులు
ఆయుష్ మంత్రిత్వ శాఖ అరుదైన ఘనత
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం–2026 వేడుకలకు ముందు ఆయుష్ మంత్రిత్వ శాఖ అరుదైన ఘనతను సాధించింది. యూట్యూబ్ వేదికగా నిర్వహించిన ప్రత్యక్ష యోగా ప్రసారంలో అత్యధిక మంది వీక్షకులు పాల్గొనడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదయ్యింది. ఆదివారం ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా చేపట్టిన ఈ గ్లోబల్ ఆన్‌లైన్ యోగా సెషన్‌ను ఏకంగా 4,35,831 మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. దీంతో 2024లో నమోదైన 2,46,252 మంది రికార్డును అధిగమించారు.
ఈ సందర్భంగా కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్ మాట్లాడుతూ, యోగా పట్ల ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు ‘యోగా–365’స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. కామన్ యోగా ప్రోటోకాల్‌పై జరిగిన ఈ సెషన్‌లో విద్యార్థులు, యోగా నిపుణులు, సామాన్య ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ‘ఆరోగ్యవంతమైన జీవనం కోసం యోగా’అనే థీమ్‌తో ఈ ఏడాది జూన్ 21వ తేదీన కోల్‌కతా వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రధాన వేడుకలు జరగనున్నాయి.


