ముంబై లోకల్ రైలు ప్రయాణిల‌కు బీమా! | Mumbai local train commuters accident insurance coverage update | Sakshi
Sakshi News home page

‘లోకల్‌’ ప్రయాణికులకు వ్యక్తిగత బీమా!

Oct 8 2026 8:09 PM | Updated on Oct 8 2026 8:11 PM

Mumbai local train commuters accident insurance coverage update

మరాఠీ ఏకీకరణ సమితి డిమాండ్‌ మేరకు రైల్వే మండలి కసరత్తు

అతి తక్కువ ప్రీమియంతో ప్రతి ఒక్కరికీ బీమా రక్షణ

కేంద్రం ఆమోదం కోసం ప్రతిపాదన

అనుమతి లభిస్తే  లక్షల మంది ప్రయాణికులకు బీమా భద్రత

దాదర్‌: ముంబై లోకల్‌ రైళ్లలో నిత్యం ప్రయాణించే ప్రయాణికులకు స్వతంత్ర వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ కల్పించే ప్రతిపాదనపై ముంబై రైల్వే మండలి కసరత్తు ప్రారంభించింది. అతి తక్కువ ప్రీమియంతో ప్రతి ప్రయాణికుడికి బీమా రక్షణ కల్పించేలా ప్రతిపాదన సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీనికి కేంద్రం ఆమోదం లభిస్తే ముంబై లోకల్‌ రైళ్లలో రోజూ రాకపోకలు సాగించే సుమారు 75–80 లక్షల మంది ప్రయాణికులకు ప్రత్యేక బీమా రక్షణ లభించే అవకాశం ఉంది. ముంబై లోకల్‌ రైల్వే పరిధిలో ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు ప్రమాద బీమా ఇవ్వాల‌ని మరాఠీ ఏకీకరణ సమితి కొంతకాలంగా రైల్వే మండలితో సంప్రదింపులు జరుపుతోంది. ఈ అంశంపై రైల్వే అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో ప్రయాణికులకు వ్యక్తిగత ప్రమాద బీమా కల్పించే అంశాన్ని పరిశీలించాలని రైల్వే మండలి నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ప్రమాదాలు, వైద్య ఖర్చులకు ఆసరాగా 
ముంబైలో సెంట్రల్, వెస్ట్రన్, హార్బర్‌ రైల్వే మార్గాల ద్వారా లోకల్‌ రైళ్లు నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల గుండా రాకపోకలు సాగిస్తున్నాయి. రోజూ సుమారు 75–80 లక్షల మంది ప్రయాణికులు లోకల్‌ రైళ్లపై ఆధారపడుతున్నారు. వీరిలో ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు అధిక సంఖ్యలో ఉన్నారు. ప్రయాణికుల్లో సుమారు 70 శాతం మంది నెలవారీ, త్రైమాసిక, వార్షిక సీజన్‌ పాస్‌లతో ప్రయాణిస్తుండగా, మిగిలిన వారు సింగిల్, రిటర్న్‌ టికెట్లతో రాకపోకలు సాగిస్తున్నారు.

సీజన్‌ పాస్‌ హోల్డర్లు, టికెట్‌ తీసుకుని ప్రయాణించే వారికి రూ.10–20 వరకు అతి తక్కువ ప్రీమియంతో ప్రమాద బీమా పాలసీ అమలు చేయాలని మరాఠీ ఏకీకరణ సమితి రైల్వే బోర్డుకు ప్రతిపాదించింది.రైలు ప్రయాణ సమయంలో ప్రమాదానికి గురై మృతి చెందిన వారు, పాక్షికంగా అంగవైకల్యానికి గురైన వారు, అవయవాలు కోల్పోయిన వారు, శాశ్వతంగా వికలాంగులైన ప్రయాణికులతో పాటు ప్రమాదాల కారణంగా ఆస్పత్రుల్లో చేరిన వారికి కూడా బీమా రక్షణ కల్పించాలని సమితి కోరుతోంది. చికిత్సకు అయ్యే వైద్య ఖర్చులను సైతం బీమా పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేసింది.

ఇదీ చ‌ద‌వండి: నానా ప‌టేక‌ర్‌కు ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ ద‌యా నాయ‌క్ నివాళి

ఉదయం, సాయంత్రం పీక్‌ అవర్స్‌లో లోకల్‌ రైళ్లలో విపరీతమైన రద్దీ ఉంటుంది. రైళ్లలోకి వెళ్లేందుకు స్థలం లేక అనేక మంది తలుపుల వద్ద, ఫుట్‌బోర్డులపై నిల్చుని ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలో అదుపుతప్పి రైలు నుంచి కిందపడే ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కోల్పోతుండగా, మరికొందరు తీవ్రంగా గాయపడుతున్నారు. మరోవైపు ఏసీ లోకల్‌ రైళ్లలో సాంకేతిక లోపాల కారణంగా ఎయిర్‌ కండిషనింగ్‌ వ్యవస్థ పనిచేయకపోవడం, ప్రయాణికులు అస్వస్థతకు గురికావడం వంటి ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయని సమితి పేర్కొంది.

ఇదీ చ‌ద‌వండి: అదే మా ఇద్దరి చివరి సంభాషణ.. తుకారం ముండే

ఇలాంటి సందర్భాల్లో చికిత్స పొందే ప్రయాణికులకు కూడా బీమా రక్షణ కల్పించాలని కోరింది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగత ప్రమాద బీమా పథకానికి సంబంధించిన ప్రతిపాదనను రూపొందించే ప్రక్రియను రైల్వే మండలి ప్రారంభించినట్లు సమాచారం. ప్రతిపాదన సిద్ధమైన అనంతరం కేంద్రం ఆమోదం లభిస్తే తదుపరి కార్యాచరణ చేపట్టే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement