''మీరు వెళ్లిపోయారంటే నమ్మశక్యంగా లేదు. కొద్ది రోజుల క్రితమే మనం మాట్లాడుకున్నాం. అదే మన చివరి సంభాషణ అంటూ ఎందుకో నమ్మబుద్ధి కావడం లేదు'' అంటూ ముంబై పోలీసు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్‌ను స్మరించుకుంటూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారాయన. ఆత్మీయుడైన నానా మరణం తనకెంతో లోటు అని పేర్కొన్నారు. ప్రతి సందర్భంలోనూ తనకు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు.
''మీరు అద్భుతమైన బహుముఖ ప్రజ్ఞాశాలి. వెండితెరపై మీరు పోషించిన ప్రతి పాత్రలోనూ అసాధారణ రీతిలో ఒదిగిపోయారు. నన్ను స్ఫూర్తిగా తీసుకుని రూపొందించిన సినిమాలో మీరు చేసిన పోలీసు పాత్ర నాకు ప్రేరణగా నిలిచింది. మీరు కేవలం ఒక పోలీస్ అధికారిగా నటించలేదు.. యూనిఫాం వెనుక ఉన్న వ్యక్తిని, ఒత్తిళ్లను, మానవత్వాన్ని తెరపై ఆవిష్కరించారు. ఒక పోలీస్ అధికారిగా ఉండటంలో నిజమైన అర్థాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేశారు.
నటుడిగా కంటే కూడా మీరు నాకు మంచి స్నేహితుడు. అవసరమైనప్పుడల్లా నాకు అండదండలు అందించారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతాను. మిమ్మల్ని తెలుసుకోవడం, అన్నింటికన్నా ముఖ్యంగా మిమ్మల్ని నా స్నేహితుడిగా, సోదరుడిగా పిలుచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రేమగా గుర్తుంచుకుంటాను'' అంటూ నివాళి అర్పించారు. కాగా, దయా నాయక్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన 'అబ్ తక్ ఛప్పన్' సినిమాలో ఇన్‌స్పెక్టర్ సాధు అగాషే పాత్రను నానా పటేకర్ పోషించిన సంగతి ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది.
'దయ' టైటిల్ అనుకున్నారు!
రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో షిమిత్ అమిన్ దర్శకత్వంలో అబ్ తక్ ఛప్పన్ సినిమా తెరకెక్కింది. 2004లో విడులైన ఈ సినిమాలో ఇన్‌స్పెక్టర్ సాధు అగాషే పాత్రను నానా పటేకర్ పోషించారు. దయా నాయక్ నిజ జీవితం నుంచి ప్రేరణ పొంది ఈ పాత్రను రూపొందించారు. ఈ సినిమాకు మొదట 'దయ' అనే టైటిల్ పెట్టాలని అనుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. నానా పటేకర్ పోషించిన సాధు అగాషే పాత్ర ఆయన కెరీర్‌లో బెస్ట్ ఫెర్మారెన్స్‌లో ఒకటిగా ప్రశంసలు అందుకుంది.
ఇదీ చదవండి: అదే మా ఇద్దరి చివరి సంభాషణ.. తుకారం ముండే


