నానా పటేకర్‌ మృతి.. పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ ఎమోషనల్‌ | Pak Ex Cricketer Basit Ali Emotional Tribute To Nana Patekar, Highlights Their 32 Year Friendship Beyond Borders, Watch Video | Sakshi
Sakshi News home page

Basit Ali : నానా చెప్పిన మాట.. ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా: బాసిత్‌ అలీ

Oct 9 2026 12:57 PM | Updated on Oct 9 2026 1:19 PM

Pakistan Former Cricketer Basit Ali Emotional Tribute To Nana Patekar Friendship Advice

దిగ్గజ నటుడు నానా పటేకర్‌ మరణవార్తతో సినీ పరిశ్రమతో పాటు ఆయనతో అనుబంధం ఉన్నవారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ బాసిత్‌ అలీ సైతం ఈ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యారు. నానా పటేకర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన తన జీవితంలో చెప్పిన ఓ మంచి మాటను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నానని ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.

1994లో పరిచయం..
‘ఉదయాన్నే నానా పటేకర్‌ మరణవార్త వినగానే ఏమీ తోచలేదు.  ఆయన నాకు మంచి మిత్రుడు. ఓ లివింగ్‌ లెజెండ్‌. 1994లో ఆయనతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి తమ మధ్య మంచి అనుబంధం కొనసాగింది. ఆయన నాతో పాత జ్ఞాపకాలను పంచుకునేవారు. ఆయనతో గడిపిన క్షణాలు ఇప్పటికీ గుర్తున్నాయి’ అని పేర్కొన్నారు.  తన తల్లితోనూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారని బాసిత్‌ అలీ తెలిపారు. 

తల్లి మరణించినప్పుడు..
తన తల్లి మరణించిన సమయంలో నానా పటేకర్‌ చేసిన ఫోన్‌కాల్‌ను బాసిత్‌ అలీ ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తనకు ఫోన్‌ చేసిన నానా.. ఇకపై జాగ్రత్తగా ఉండాలని, తనను తాను చూసుకోవాలని చెప్పారట. నానా చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ తన మనసులో నిలిచిపోయాయని భావోద్వేగానికి గురయ్యారు. కష్టకాలంలో మనకు అండగా నిలిచే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని, అలాంటి వారిలో నానా పటేకర్‌ ఒకరని బాసిత్‌ అలీ పేర్కొన్నారు. ఆయన తనపై చూపిన ఆప్యాయతను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు.

అనారోగ్య సమయంలోనూ..
‘గుండె సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన టైంలో నానా పటేకర్‌ నుంచి ఓ మెసేజ్‌ వచ్చింది. నా ఆరోగ్యం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా కోలుకున్నాక ఫోన్‌ చేయాలని కోరారు. ఆ తర్వాత నానాకు ఫోన్‌ చేశాను.  ఆయన ఎంతో సమయం కేటాయించి తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఇతరుల పట్ల శ్రద్ధ చూపడం, మనుషులతో సంబంధాలకు విలువ ఇవ్వడం నానా పటేకర్‌లోని గొప్ప లక్షణాలు’ అని  ప్రశంసించారు.

సరదాగా ‘యంగ్ మ్యాన్‌’ అని పిలిచేవాడు..
నానా పటేకర్‌కు 75 ఏళ్లు అంటే ఎవరూ నమ్మలేరని బాసిత్‌ అలీ అన్నారు. తాను ఆయన్ను ఎప్పుడూ సరదాగా ‘యంగ్ మ్యాన్‌’ అని పిలిచేవాడినని గుర్తు చేసుకున్నారు. దానికి నానా కూడా నవ్వుతూ.. ‘నువ్వూ ముసలివాడివే, నేనూ ముసలివాడినే’ అని బదులిచ్చేవారని చెప్పారు. తెరపై తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన నానా పటేకర్‌.. నిజ జీవితంలోనూ మనుషుల పట్ల ప్రేమాభిమానాలు చూపించే గొప్ప వ్యక్తి అని బాసిత్‌ అలీ కొనియాడారు. అలాంటి మంచి మనిషిని కోల్పోవడం తీరని లోటని, ఆయనతో తనకున్న అనుబంధం, జ్ఞాపకాలు ఎప్పటికీ తన మనసులో నిలిచిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

(ఇదీ చదవండి:నాని-నితిన్ 'అలియాస్ రుక్మిణీ' రిలీజ్ డేట్)
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement