అతడు స్టేజీ మీదా తెర మీదా ‘నట సామ్రాట్’.
అతడు జీవితంలో హలధారి. అవసరమైతే దేశం కోసం
సరిహద్దులో తుపాకీ ధరించి నిలబడ్డ సైనికుడు.
సినీ ముఠాలకు వ్యతిరేకి.
నిర్మాత ఎదుట తల వొంచడానికి ఇష్టపడని మొండి ఘటం.
అతని కోపం ఆక్రోశం... అతని నవ్వు వెక్కిరింత.
ఫ్రేముకు విలువ పెంచి ఫ్రేములో ఇరికిద్దామంటే దొరకని నటుడు.
నానా పాటేకర్ ఒక విస్మయం. అతడొక విడ్డూరం. వైఢూర్యం.
చివరగా అతడు అగ్నితో మేకప్ కడిగేశాడు.
భారతీయ సినీ పరిశ్రమలో అద్భుతమైన, సహజమైన నటనతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు నానా పాటేకర్ (75) ఇకలేరు. గోవాలోని డోనా పౌలాలో ఉన్న తన నివాసంలో అపస్మారక స్థితిలో కనిపించిన ఆయన్ని వెంటనే మణిపాల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయన్ని కాపాడేందుకు వైద్యులు సీపీఆర్ చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. నానా పాటేకర్‌కి దాదాపు 45 నిమిషాలు సీపీఆర్ చేసినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని, ఉదయం 5:20 గంటల సమయంలో కార్డియాక్ అరెస్ట్ (గుండెపోటు) కారణంగానే తుది శ్వాస విడిచారని మణిపాల్ హాస్పిటల్ ఆంకాలజీ విభాగం చీఫ్ శేఖర్ సల్కర్ తెలిపారు.
నానా పాటేకర్ 1951 జనవరి 1న జన్మించారు. ఆయన అసలు పేరు విశ్వనాథ్ పాటేకర్. ముజాఫర్ అలీ దర్శకత్వం వహించిన ‘గమన్’ అనే హిందీ సినిమాతో ఆయన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. హిందీతో పాటు మరాఠీ సినిమాల్లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు పోషించారాయన. ‘పరిందా, ప్రహార్, అంగార్, తిరంగా, క్రాంతివీర్, ఖామోషి’ వంటి చిత్రాలు ఆయన కెరీర్‌లో ప్రత్యేకమైనవిగా నిలిచాయి.
1978లో మరాఠీ సినీ నటి, నిర్మాత నీల్‌కాంతిని నానా పాటేకర్ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి మధ్య తలెత్తిన విభేదాల కారణంగా ఇద్దరూ విడివిడిగా ఉంటున్నప్పటికీ విడాకులు తీసుకోలేదు. వీరికి ఇద్దరు కుమారులు కాగా ఒక అబ్బాయి పుట్టిన రెండేళ్లకే అనారోగ్య కారణాలతో చనిపోయాడు. మరో అబ్బాయి మల్హర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఇదిలా ఉంటే... నానా పాటేకర్ మృతిపై పోలీసులు మెడికో లీగల్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఆకస్మిక మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తమ సంతాపం తెలిపారు.
స్నేహితుడికి చివరి సందేశం... నానా పాటేకర్ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2:30 గంటల ప్రాంతంలో ‘నాకు ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదు’ అంటూ తన మిత్రుడుకి సందేశం పంపించారు. అయితే ఆ టైమ్‌లో గాఢమైన నిద్రలో ఉండడంతో ఆలస్యంగా ఆ మెసేజ్ చూసుకున్న స్నేహితుడు కంగారుగా తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆయన నివాసానికి చేరుకున్నారు. అప్పటికే నానాకు విపరీతంగా చెమటలు పడుతున్నాయని, ఆయన నెమ్మదిగా స్పృహ కోల్పోవడం గమనించి, వెంటనే కేర్ టేకర్‌కు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత ఆస్పత్రి ఎమర్జెన్సీ బృందానికి ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న వెంటనే మెడికల్ టీమ్ నానా పాటేకర్ నివాసానికి చేరుకుంది. కానీ, అప్పటికే ఆయన శరీరం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ప్రాథమిక చికిత్స అందిస్తూనే అత్యవసర వైద్యం కోసం గోవాలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు.
ముంబైలో ఒక ప్రొడ్యూసర్ నానా పాటేకర్ ఇంటికి వచ్చాడు. సినిమాలో వేషం ఉందని చెప్పాడు. ‘కోటి రూపాయలు ఇస్తే చేస్తాను’ అన్నాడు నానా పాటేకర్. ‘కోటి రూపాయలా?’... క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కు అంత ఇవ్వడం అసంభవం. కాని ఆ క్యారెక్టర్ నానా వేస్తేనే పండుతుంది. ప్రొడ్యూసర్ కాసేపు గుటకలు మింగి ‘సరే నానా’ అన్నాడు. ‘వెరీగుడ్. నీకు కంచాలు కడగడం వచ్చా?’ అని అడిగాడు నానా. ‘ఎందుకు?’ అన్నాడు ప్రొడ్యూసర్. ‘అన్నం వండుతాను. కలిసి భోంచేద్దాం. తర్వాత నీ కంచం నువ్వు కడిగి పెట్టి వెళ్లాలి’.... కోట్లు పెట్టి సినిమా తీస్తున్న సంగతి మర్చి కంచం కడగడానికి ఉపక్రమించాడు ఆ నిర్మాత. హిందీ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులకు రెమ్యూనరేషన్ పెంచినవాళ్లు ఇద్దరే... ఒకరు గబ్బర్ సింగ్ అను అంజాద్ ఖాన్. మరొకరు నానా పాటేకర్.
ఇలాగే నానా పాటేకర్ ఇంటికి మరో ప్రొడ్యూసర్ వచ్చి కోట్లు, లక్షల వ్యవహారం మాట్లాడుతున్నాడు. నానా తల్లి వచ్చి ‘పిండి గిర్నీ నుంచి పిండి తీసుకురా పోరా’ అంది. నానా ప్రొడ్యూసర్‌తో ‘ఒక నిమిషం ఉండు’ అని వీధి చివర పిండి గిర్నీకి వెళ్లి పిండి తీసుకొచ్చి తల్లికి ఇచ్చి మళ్లీ మాటల్లో పడ్డాడు. ‘ఏంటి నానా ఇది’ అనడిగితే ‘అవునయ్యా... ఇంట్లో మా అమ్మ, నేను ఉంటాం. ఆమె నాకు కాకపోతే పని ఎవరికి చెప్తుంది?’ అన్నాడతడు.
నానా అన్ని మంచి గుణాలు ఉన్న వ్యక్తి. అనేక అసంబద్ధతలు ఉన్న వ్యక్తి కూడా. నానాది మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా మురుద్–జంజీరా అనే తీర్రపాంత గ్రామం. నానా అక్కడే ఏడో క్లాస్ వరకూ చదువుకున్నాడు. తండ్రి ముంబైలో చిన్న వ్యాపారం చేసేవాడు. తల్లి, పిల్లలు ఊళ్లో ఉండేవారు. నానా అందరిలోకి చిన్నవాడు. చామన ఛాయ. తన రంగు కారణంగా తండ్రి తనను ప్రేమించడం లేదనే సందేహం నానాలో ఉండేది. ఆ ప్రేమ రాహిత్యం వల్ల క్లాసులో బాగా అల్లరి చేసేవాడు. తను స్కూల్ నాటకంలో పాత్ర వస్తే తండ్రి ముంబై నుంచి ప్రత్యేకంగా వచ్చి చూసి మెచ్చుకున్నాడు. తండ్రి ప్రేమ పొందడానికి నాటకం ఒక మార్గం అని నానా చిన్నారి మనసులో ముద్రపడింది.
నానా తండ్రి వ్యాపారం నానా ఎనిమిదో క్లాసు వచ్చేసరికి దివాలా తీసింది. కుటుంబం ఊరు ఖాళీ చేసి ముంబైలోని దాదర్‌లో తల దాచుకుంది. 13 ఏళ్ల వయసున్న నానా ఒకవైపు చదువుకుంటూ మరో వైపు స్కూల్ నుంచి వచ్చి ఇంటికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇటుక బట్టీలో పని చేసేవాడు. నెలకు 35 రూపాయల జీతం, రాత్రి భోజనం పెట్టేవారు. ఆ రోజుల్లో ఆ 35 రూపాయలు నానా కుటుంబాన్ని నిలబెట్టాయి. నానా మంచి ఆర్టిస్ట్. లెటరింగ్, బ్రష్ వర్క్ బాగా చేస్తాడు. అందువల్ల సిటీలో జీబ్రా క్రాసింగ్‌కి రంగులు వేసే పని వచ్చేది. రాత్రంతా ఆ పని చేసి డబ్బు సంపాదించేవాడు.
ఎస్‌ఎస్‌ఎల్‌సి తర్వాత ముంబై జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో నాలుగేళ్ల డిగ్రీలో చేరాడు నానా. 120 రూపాయల ఫీజు కట్టడానికి డబ్బు ఉండేది కాదు. నాటకాల్లో నటిస్తే చిల్లర డబ్బులు దొరికేవి. డిగ్రీ అయ్యాక వెంటనే అడ్వర్‌టైజ్‌మెంట్ కంపెనీలో మంచి ఉద్యోగం దొరికినా నాటకం కోసం వదిలేసి చాలీచాలని జీవితంవైపు వచ్చాడు. అతని భార్య నీల్‌కాంతి నాటకాలు వేసేది. అయితే ఆమెకు అది హాబీ. ఆమె బ్యాంక్ ఆఫీసర్. ‘నువ్వు నాటకాల్లో వెళ్లు. నేను సంపాదిస్తాను’ అని చెప్పింది. వాళ్లు పెళ్లి చేసుకున్నారు. అలా నానా నాటకం కొనసాగింది.
నానా పాటేకర్‌కు మొదటి అవకాశం ఇచ్చిన వాడు దర్శకుడు ముజఫర్ అలీ (ఉమ్రావ్‌జాన్ ఫేమ్). సినిమా పేరు ‘గమన్’. ఆ సినిమాలో స్మితా పాటిల్ ఉంది. ఆమె ఇతడి ప్రతిభను గుర్తించి బి.ఆర్. చోప్రా కొడుకు రవి చోప్రా తీస్తున్న ‘ఆజ్ కి ఆవాజ్’లో విలన్ వేషం ఇప్పించింది. ఆ తర్వాత దర్శకుడు ఎన్. చంద్ర ‘అంకుశ్’ తీయడంతో నానా కొద్దిగా తెలిశాడు. అదే ఎన్.చంద్ర మన ‘ప్రతిఘటన’ రీమేక్ ‘ప్రతిఘాత్’లో నానాకు సుత్తి వేలు వేషం ఇచ్చాడు. 1988లో ‘సలామ్ బాంబే’ వచ్చింది. 1990లో ‘పరిందా’తో నానా పాటేకర్ మొత్తం దేశానికి తెలిసిపోయాడు. ‘పరిందా’లో నానా వేసిన ‘అన్నా’ పాత్ర నానా జీవితాన్నే కాదు భారతీయ సినిమాను కూడా మలుపు తిప్పింది.
పార్లల్ సినిమాలు దేశంలో మొదలై నసీరుద్దీన్ షా, ఓంపురి, షబానా ఆజ్మీ, స్మితా పాటిల్... వీళ్లంతా ఒక బృందంగా సినిమాలు చేస్తూ ఉన్నా నానా వీళ్లలో కలవలేదు. ‘నా దారి వేరే’ అన్నట్టుగా ఉండిపోయాడు. అతడు తయా రైంది పూణె యాక్టింగ్ స్కూల్‌లో కాదు. స్టేజ్ మీద. మరాఠీ నాటకం విస్తృతంగా చేశాడు. ‘పురుష్’ అనే నాటకాన్ని తెలుగులో ‘రక్తకన్నీరు’లాగా 1600 ప్రదర్శనలు ఇచ్చాడు. ముంబైలోని నాటక దిగ్గజం విజయ మెహతా అతడికి నాటకాల్లో అవకాశం ఇవ్వడమే కాదు తల్లిలా ఆదరించింది. నిజానికి నానా కేవలం నాటకాల్లోనే ఉండిపోదామనుకున్నాడు. అయితే సినిమాయే అతణ్ణి వెతుక్కుంది.
బాలీవుడ్‌లో ‘యాంగ్రీ యంగ్‌మేన్’ అంటే అమితాబ్ బచ్చన్. కోపంగా ఉండే హీరోగా మొదట ‘జంజీర్’లో కనిపించాడు. అతడి హవా కొనసాగుతూ ఉండగానే నానా పటేకర్ మరో యాంగ్రీ యంగ్‌మేన్‌గా తెర మీదకు వచ్చాడు. సమాజంలోని సమస్త అడ్డదిడ్డాల మీద అసహనం వ్యక్తం చేసే హీరోగా, నటుడిగా నానా ముద్ర వేయగలిగాడు. 1993లో వచ్చిన ‘తిరంగా’లో నానా పోషించిన ఇన్‌స్పెక్టర్ శివాజీరావ్ పాత్రే దీనికి నిదర్శనం. ఈ సినిమాలో నానా తన పాత్రను నిలబెట్టుకోవడమే కాదు.. అదే సినిమాలో ఉన్న సీనియర్ నటుడు రాజ్‌కుమార్ తనను మింగేయకుండా కాపాడుకున్నాడు. రాజ్ కుమార్‌ను ఢీ కొడుతూ నటించాడంటే వీడెంత మొనగాడు... అనుకున్నారు జనం.
1992 డిసెంబర్‌లో ముంబై అల్లర్లు జరిగాయి. దాని కొనసాగింపుగా 1993 పేలుళ్లు జరిగాయి. రెండూ నానా పటేకర్‌ను బాగా డిస్ట్రబ్ చేశాయి. హిందూ ముస్లింల మధ్య అభద్రత ఉన్న ఆ సందర్భంలో నానా తన జీప్‌లో ఒక్కడే తిరుగుతూ సామరస్యం కోసం ప్రయత్నించాడు. అనేక రాత్రిళ్లు పక్కన ఒక వాటర్ బాటిల్ పెట్టుకుని తిరిగేవాడు. పోలీసులు కూడా అతణ్ణి ఏమీ అనేవారు కాదు. అప్పుడు గమనించిన విషయాలన్నీ అతడు ‘క్రాంతివీర్’ సినిమాలో ఆవేశంగా చెప్పాడు. ప్రజలతో ఆడుకునే స్వార్థ రాజకీయాల వల్లే ఇదంతా అని ఆగ్రహంతో అరిచి అరిచి చెప్పాడు. ఆ సినిమాలో నానా మాట్లాడే ప్రతి మాట సూపర్‌హిట్ అయ్యింది. దీని కొనసాగింపుగా వచ్చిన ‘అగ్నిసాక్షి’ (1996), ‘ఖామోషి’ (1996), ముస్తఫా (1997) సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. ‘యశ్వంత్’లో నానా చెప్పిన ‘సాలా... ఏక్ మచ్ఛర్ ఆద్మీకో హిజ్‌డా బనాదేతా హై’... మాస్‌లో పంచ్ డైలాగ్‌లా మిగిలింది.
నానా మన తెలుగు దర్శకులతో పని చేశాడు. రామ్‌గోపాల్ వర్మ ‘అబ్ తక్ చప్పన్’ నానాకు చాలా పేరే తెచ్చింది. అదే రామ్‌గోపాల్ వర్మ తీసిన ‘ది అటాక్స్ ఆఫ్ 26/11’లో పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. కృష్ణవంశీ ‘అంతఃపురం’ హిందీలో ‘శక్తి’గా రీమేక్ అయితే ప్రకాశ్ రాజ్ పాత్రను నానా పోషించాడు. 2007లో వచ్చిన ‘వెల్‌కమ్’ నానా ఇమేజ్‌ను పూర్తిగా మార్చేసింది. ‘మంచి ఇమేజ్’ కోసం పాకులాడే డాన్‌గా ఆ సినిమాలో ఆయన నటన జనాన్ని తెగ నవ్వించింది. ఆ పాత్రను కాపీ చేస్తూ తెలుగులో అనేక సినిమాలు వచ్చాయి. నానా పాటేకర్ నటించిన ‘ట్యాక్సీ నంబర్ 9211’ తెలుగులో మోహన్‌బాబు, విష్ణుల కాంబినేషన్‌లో ‘గేమ్’గా రిలీజ్ అయ్యింది. రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘కాలా’లో నానా విలన్‌గా నటించడమే కాదు తమిళంలో డబ్బింగ్ చెప్పారు. ‘హౌస్‌ఫుల్ 5’ ఆయన నటించిన భారీ ఆఖరు సినిమా.
నానా పాటేకర్ మరాఠిలో నటించిన ‘నటసామ్రాట్’ నానా ఎందుకు నటసామ్రాటో నిరూపిస్తుంది. మరాఠీలో చాలాకాలంగా నాటకంగా ప్రసిద్ధమైన ఈ కథను దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ నానా పాటేకర్‌తో మరాఠీలో తీస్తే సూపర్ డూపర్ హిట్ అయ్యింది. నాటక రంగం నుంచి నిష్క్రమించిన గొప్ప నటుడు జీవన నాటక రంగంలో చేష్టలుడిగి, డైలాగుల్లేని పాత్రగా ఎలా మిగిలాడో ఈ సినిమా చూపుతుంది. సినిమా మొదలైనప్పటి నుంచి ముగిసే వరకూ నానా విశ్వరూపం చూడొచ్చు. ఈ సినిమా తెలుగులో ‘రంగమార్తాండ’గా కృష్ణవంశీ రీమేక్ చేశారు. చూడండి తమాష. అంతఃపురంలో ప్రకాశ్ రాజ్ చేసిన పాత్రను హిందీలో నానా చేస్తే మరాఠీలో నానా చేసిన పాత్రను తెలుగులో ప్రకాశ్ రాజ్ చేశాడు. నిజానికి ఇప్పుడే నానా చేయాల్సిన పాత్రలు పెరిగాయి. ఈ లోపే ఆయన మనకు దిగ్భ్రాంతి మిగిల్చాడు.
నానాకు నటనలో ఎంత పట్టు ఉందో క్రికెట్, రైఫిల్ షూటింగ్‌ల్లోనూ అంతే గ్రిప్ ఉంది. నానా మంచి ‘ఆఫ్‌స్పిన్’ బౌలర్. రైఫిల్ షూటింగ్‌లో నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుండి ఋరెనౌండ్ షాట్’గా గుర్తింపు ఉంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల వెనుకబడుతున్న ఎంతోమంది యువ షూటర్ల శిక్షణా వ్యయాలను నానా తన సొంత డబ్బుతో ప్రోత్సహించాడు.
తెరపై విప్లవాలు మాట్లాడటం వేరు... తెర వెనుక మానవీయమూర్తిగా ఉండటం వేరు. 2015లో మహారాష్ట్రలోని విదర్భా, మరాఠ్వాడా ప్రాంతాలు కరువు బారిన పడి ఆత్మహత్యలకు నిలయాలుగా మారాయి. వర్షాలు లేక అన్నదాతలు ప్రాణాలు విడుస్తుంటే, వారి వెనుక మిగిలిన కుటుంబాల దిక్కుతోచని స్థితి నానా గుండెను మెలిపెట్టింది. ఆయన కేవలం సంతాప సందేశాలతో సరిపెట్టుకోలేదు. తన మిత్రుడు మకరంద్ అనాస్పురేతో కలిసి ‘నామ్ ఫౌండేషన్’ స్థాపించి ఒక నిశ్శబ్ద కారుణ్య విప్లవానికి తెరతీశాడు. ఆత్మహత్య చేసుకున్న 500 మంది రైతుల భార్యలకు తండ్రిలా, అన్నలా అండగా నిలిచాడు. ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్)లోని కార్పొరేట్ ఆసుపత్రులతో స్వయంగా మాట్లాడి, ఆ కుటుంబాలకు పూర్తిగా వైద్యసేవలు అందేలా చూశాడు. అంతటితో ఆగకుండా, ఆ రైతు బిడ్డల చదువుల బాధ్యతను భుజాలపై వేసుకున్నాడు.
తెరపై మిలటరీ దుస్తులు వేసి డైలాగులు చెప్పే నటులను చూశాం... కానీ దేశం కోసం నిజంగానే తుపాకీ పట్టి, బంకర్లలో పడుకుని, ప్రాణాలకు తెగించి సరిహద్దుకు వెళ్లిన ఏకైక నటుడు నానా పాటేకర్!
1999లో కార్గిల్ యుద్ధం జరుగుతున్న సమయం... దేశమంతా రేడియోలు, టీవీల ముందు కూర్చుని సరిహద్దుల్లో ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతోంది. ఆ సమయంలో నానా పాటేకర్ మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా యుద్ధంలో దూకాడు. సివిలియన్‌కు ప్రవేశం లేదు అని మిలటరీ నిరాకరించినా ఏకంగా రక్షణ శాఖా మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్‌తో చెప్పించి బయల్దేరి వెళ్లాడు. అప్పటికే ‘ప్రహార్’ సినిమా కోసం మూడు సంవత్సరాల పాటు కఠినమైన ఆర్మీ శిక్షణ తీసుకుని, టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ కెప్టెన్ గా ఉన్న నానా దాదాపు రెండున్నర నెలల పాటు కార్గిల్‌లో ‘క్విక్ యాక్షన్ టీమ్’లో పని చేశాడు. ‘75 కేజీల బరువుతో వెళ్లి 55 కిలోల బరువుతో తిరిగి వచ్చాను’ అని తెలిపాడాయన.
నానా చుట్టూ ఎన్నో వివాదాలున్నాయి. దర్శకులు విధు వినోద్ చోప్రా , సంజయ్ లీలా బన్సాలీ లాంటి వాళ్లతోనే సెట్‌లో పేచీ పడ్డాడు. చాలామంది నటీనటులతో నానాకు పడదు. నానాకు అవార్డులు రాకుండా చూసే పెద్ద పటాలమే ఈ కారణంగా తయారై ఉంది. నానా వ్యక్తిగత జీవితంలో కూడా సమస్యలు ఉన్నాయి. అతని మొదటి కొడుకు శారీరక అవకరాలతో పుట్టడం నానాను బాగా డిస్ట్రబ్ చేసింది. ‘నా కొడుకు ఇలా పుట్టడమా’ అని షాక్‌లో ఆ పిల్లాణ్ణి దగ్గరకే తీయలేదు. ఆ తర్వాత తీసినా రెండేళ్ల వయసులోనే ఆ బాబు చనిపోయాడు. ఆ తర్వాత మళ్లీ కొడుకు పుట్టాడు. అతని పేరు మల్హార్. అయితే ‘ఖామోషీ’, ‘అగ్నిసాక్షి’ చేస్తుండగా మనీషా కొయిరాలాతో ఏర్పడిన బంధం నానాను భార్యకు దూరం చేసిందని అంటారు. కొడుకు తల్లితో వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆయేషా జుల్కాతో రిలేషన్ వల్ల మనీషాతో కూడా తెగదెంపులయ్యాయని కథనం. 2008 నాటి ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా పాట చిత్రీకరణ సమయంలో నానా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని నటి తనుశ్రీ దత్తా ఆరోపించింది. అయితే నానా ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు.
నానా రైతులా బతకడానికి ఇష్టపడ్డాడు. ‘నాకు నా పల్లెటూరే ప్రశాంతతను ఇస్తుంది. నేను ఇప్పుడు పల్లెటూరి వాడినే’ అని తరచూ చెబుతుండేవాడు. పుణే సమీపంలోని ఖడక్‌వాస్లాలో నిర్మించుకున్న 27 ఎకరాల ఫామ్‌హౌస్ కట్టుకున్నాడు. వీకెండ్‌లో సరదాగా గడపడానికి కాకుండా నానా ఇక్కడే ఉంటూ వ్యవసాయం చేసేవాడు. స్థానిక రైతులతో కలిసి ఈ 27 ఎకరాల్లో వరి, గోధుమలు, సజ్జలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి పండించేవాడు. వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయాన్ని పొలంలో పని చేసే పేద కూలీలకు, స్థానిక రైతులకు సమానంగా పంచేసేవాడు. లాక్‌డౌన్ సమయంలో ఆయన ఇక్కడే గడిపాడు. ఫామ్‌హౌస్‌లో పెంచుకునే కుక్కలు, ఆవులు, రెండు ఎడ్ల బండ్లు ఆయనకు తోడుగా ఉండేవి.
తెరపై నానా ఒక ప్రశ్న. జవాబు దొరకని ప్రశ్న. నిజ జీవితంలో కూడా మన జీవనంలోని నిజాయితీని, విలువలు, మనలోని నిష్క్రియను ప్రశ్నించిన గొంతు. ఆయన లేకున్నా ఆయ గొంతు మనల్ని వెంటాడుతుంది.
అవార్డులు అరల్లో ఉంటాయి. సినిమాలు యూట్యూబ్‌లో ఉంటాయి. కానీ కార్గిల్ బంకర్‌లో జవాన్ల పక్కన తుపాకీ పట్టుకున్న నటుడు, మరాఠ్వాడా పొలాల్లో రైతు భుజం మీద చేయి వేసిన మనిషి – తెరపై కాదు, జనం గుండెల్లో బతుకుతాడు.
నానా పాటేకర్ చనిపోలేదు. అలాంటి మనుషులు చనిపోరు.
తెర దించి పునఃయశస్సుకు ఆరంభం పలుకుతారు.


