సాంకేతిక రంగంలో భారతీయులు సాధిస్తున్న విజయాలు ఎంతోమందికి స్ఫూర్తి అనడంలో సందేహం లేదు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోడానికి పేదింటి రైతు బిడ్డ శ్రమ, కృషి,అద్భుతమైన ప్రయాణమే ఇందుకు నిదర్శనం. బిహార్‌లోని ఒక సాధారణ రైతు కుటుంబంలో 'సత్యం కుమార్' భారతదేశంలోనే అత్యంత పిన్న వయసులోప్రతిష్టాత్మక ఐఐటీ జేఈఈ (IIT JEE) పరీక్షను పాసైన విద్యార్థిగాసత్యం కుమార్ చరిత్ర సృష్టించాడు .అంకిత భావం, ఓర్పు పట్టుదలగా ప్రయత్నించాలే గానీ అద్భుత విజయాలు, మరెన్నో రికార్డులు అతణ్ణి వరించాయి. 13 ఏళ్లకే ఐఐటీ ర్యాంక్ సాధించి, 13 ఏళ్లకే ఐఐటీ జేఈఈ క్రాక్, 24 ఏళ్లకే పీహెచ్‌డీ! సత్యం కుమార్ సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందామా!
1999, జూలై 20న బీహార్‌లో ఒక రైతు కుటుంబంలో జన్మించిన సత్యం, చిన్న వయస్సు నుండే అసాధారణమైన విద్యా ప్రతిభను కనబరిచాడు. అతనిలోని తెలివితేటలను గుర్తించిన ఒక కుటుంబ స్నేహితుడు.. ఐఐటీ జేఈఈ కోచింగ్ కోసం అతడిని రాజస్థాన్‌లోని కోటాకు పంపించాల్సిందిగా తండ్రికి సలహా ఇచ్చాడు. అయితే ఒక చిన్న గ్రామం నుండి ఐఐటి వరకు, ఆపై అమెరికా వరకు సత్యం కుమార్ ప్రయాణం చాలా సాఫీగా సాగినట్లు అనిపించినా, అది అంత సులభమైనది కాదు. అతని జీవితంలో ఎన్నో ఒడి దుడుకులు ఎదురయ్యాయి. ముఖ్యంగా అతని తండ్రి రైతు కావడంతో, సత్యంను చదువుల కోసం అమెరికాకు పంపించడం వారి కుటుంబానికి ఒక సవాలుగా మారింది. ఒకానొక సమయంలో అతని తండ్రి తన పొలాన్ని, ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసి వచ్చింది. సత్యం ప్రతిభ, తెలివితేటల కారణంగా, అతనికి టెక్సాస్ విశ్వవిద్యాలయంలో స్కాలర్‌షిప్ లభించింది.
అలా సత్యం కుమార్ కేవలం 12 ఏళ్ల వయసులోనే మొదటిసారి ఐఐటీ జేఈఈ పరీక్షను క్లియర్ చేసి, దేశ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఐఐటీయన్‌గా రికార్డు సృష్టించాడు. అయితే, ఆ ఫలితంతో సంతృప్తి చెందని అతను, మరుసటి ఏడాది (2013లో) మళ్లీ పరీక్ష రాసి.. కేవలం 13 ఏళ్ల వయసులోనే ఆల్ ఇండియా 670వ ర్యాంక్ (AIR 670) సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
తన విజయం గురించి ఐఐటీ కాన్పూర్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సత్యం మాట్లాడుతూ.. "నేను జేఈఈ క్రాక్ చేసినప్పుడు నా కల నిజమైంది. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో ఒకదానిలో చదువుకునే అవకాశం నాకు దక్కింది" అని పేర్కొన్నాడు.
ఐఐటీ కాన్పూర్
ర్యాంక్ సాధించిన తర్వాత సత్యం కుమార్ ఐఐటీ కాన్పూర్‌లో చేరి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డ్యూయల్ డిగ్రీ (BTech, MTech) పూర్తి చేశాడు. ఐఐటీలో ఉన్న సమయంలోనే అతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్‌పై పట్టు సాధించాడు. ఇది అతని భవిష్యత్తు సాంకేతిక రంగానికి బలమైన పునాదిగా మారింది.
ఐఐటీ కాన్పూర్ వాతావరణం నన్ను పరిశోధనలు, ఆవిష్కరణల వైపు అడుగులు వేసేలా ప్రోత్సహించింది అంటారు సత్యం. కష్టమైన సమస్యలను కూడా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని తనకు ఇచ్చిందని గర్వంగా ప్రకటించారు.
24 ఏళ్లకే పీహెచ్‌డీ
ఆ తర్వాత సత్యం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. కేవలం 24 ఏళ్ల వయసులోనే పీహెచ్‌డీ (PhD) పూర్తి చేశాడు. తన డాక్టరేట్ చదువు సమయంలోనే, అతను ప్రముఖ యాపిల్ (Apple) సంస్థలో మెషిన్ లెర్నింగ్ విభాగంలో ఇంటర్న్‌షిప్ చేసి, ఏఐ (AI) రీసెర్చ్‌లో మంచి అనుభవం సంపాదించాడు. ప్రస్తుతం అతను ప్రసిద్ధ 'టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్' (Texas Instruments) సంస్థలో 'మెషిన్ లెర్నింగ్ సిస్టమ్స్ రీసెర్చ్ ఇంజనీర్'గా పని చేస్తున్నాడు. అక్కడ అడ్వాన్స్‌డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీల అభివృద్ధిపై దృష్టి పెట్టాడు.
నెటిజన్ల ప్రశంసలు
సత్యం కుమార్ స్ఫూర్తిదాయక కథనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు అతని అసాధారణ ప్రతిభను కొనియాడుతున్నారు. పల్లెటూరి బిహారీ పిల్లగాడు13 ఏళ్లకే ఐఐటీ సాధించి, ఇప్పుడు టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ఎమ్‌ఎల్ ఇంజనీర్‌గా రాణించడం అద్భుతం, ఎంతో స్ఫూర్తిదాయకమైన సంగతి అంటూ ఒకరు ప్రశంసించారు. మరొకరు.. "ఖచ్చితంగా, ఇది తరానికి ఒక్కరు మాత్రమే పుట్టే అద్భుతమైన ప్రతిభ" అని ప్రశంసించారు. అన్ని రికార్డులను, నిబంధనలను బద్దలు కొట్టిన ఒక లెజెండ్ అంటూ మరొకరు కొనియాడటం గమనార్హం.


