న్యూఢిల్లీ: దేశరాజధాని డిల్లీలో జరిగిన పేలుడుపై దర్యాప్తు ముమ్మరం అయ్యింది. ఈ నేపధ్యంలో పలు ఆధారాలు బయటపడుతున్నాయి. పేలుడు సంభవించడానికి కొన్ని నిమిషాల ముందు ముసుగు ధరించిన ఒక వ్యక్తి హ్యుందాయ్ ఐ 20 కారును నడుపుతున్నట్లు కనిపిస్తున్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది. పార్కింగ్ స్థలం దగ్గరి దృశ్యాలలో ఇది ఒకటి. నల్లటి ముసుగు ధరించిన వ్యక్తి HR26CE7674 నంబర్ ప్లేట్ కలిగిన హ్యుందాయ్ ఐ20 కారును నడుపుతున్నట్లు ఆ ఫొటోలో కనిపిస్తోంది.
సోమవారం సాయంత్రం 6:52 గంటల ప్రాంతంలో ఎర్రకోట సమీపంలో జరిగిన ఈ పేలుడులో తొమ్మిది మంది మరణించగా, 20 మంది గాయపడ్డారు. అనేక వాహనాలు దగ్ధమయ్యాయి. వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం నిందితుడి కారు పార్కింగ్ స్థలంలోనికి ప్రవేశించడం, బయటకు వెళ్లడం చూపించే సీసీటీవీ ఫుటేజ్‌లు పోలీసులకు లభ్యమయ్యాయి. ఆ సమయంలో నిందితుడు ఒంటరిగా ఉన్నాడని గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ఆ వాహనం కదలికలను నిర్ధారించడానికి అక్కడికి సమీపంలోని టోల్ ప్లాజాల ఫుటేజ్‌లతో సహా 100 కి పైగా సీసీటీవీ క్లిప్‌లను అధికారులు పరిశీలిస్తున్నారని ఏజెన్సీ వర్గాలు తెలిపాయి.
అధిక తీవ్రత కలిగిన పేలుడుకు ముందు హ్యుందాయ్ కారు ప్రయాణాన్ని ట్రాక్ చేయడానికి సీసీటీవీ క్లిప్ దర్యాప్తు అధికారులకు సహాయపడింది. ఈ వాహనం దర్యాగంజ్ మార్కెట్ ప్రాంతం గుండా సునేహ్రీ మసీదు సమీపంలోనికి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో, పేలుడుకు దాదాపు మూడు గంటల ముందు చేరుకుంది. వాహనం యూ టర్న్ తీసుకొని లోయర్ సుబాష్ మార్గ్ వైపు వెళుతుండగా, కారు సిగ్నల్ వద్దకు వస్తోందని, పేలుడు సంభవించినప్పుడు వేగం తగ్గిందని సీసీటీవీ ఫుటేజ్‌లో తెలుస్తున్నదని ఒక అధికారి పేర్కొన్నారు.
సోమవారం సాయంత్రం నేతాజీ సుబాష్ మార్గ్‌లో లాల్ కిలా మెట్రో స్టేషన్‌కు సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర జరిగిన పేలుడు హ్యుందాయ్ ఐ20 కారును ఛిన్నాభిన్నం చేసింది.ఈ ఘటనలో తొమ్మిదిమంది మరణించగా 20 మందికి పైగా జనం గాయాలపాలయ్యారు. ఇది దేశవ్యాప్తంగా భయాందోళనలకు దారితీసింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ), పేలుడు పదార్థాల చట్టం తదితర కఠినమైన చట్టాల కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. పేలుడుకు దారితీసిన కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందం మంగళవారం తెల్లవారుజామున పేలుడు జరిగిన ప్రదేశం నుండి నమూనాలను సేకరించిందని ‘హిందుస్తాన్ టైమ్స్’ పేర్కొంది.
ఇది కూడా చదవండి: ఢిల్లీ ఘటన: ‘అమెరికా’ హెచ్చరిక


