వివాదాస్పద వీడియోపై సీఎం భగవంత్‌మాన్‌ క్లారిటీ | Mask Used To Create Fake Footage: Bhagwant Mann On Video Row | Sakshi
Sakshi News home page

వివాదాస్పద వీడియోపై సీఎం భగవంత్‌మాన్‌ క్లారిటీ

Jun 25 2026 7:58 PM | Updated on Jun 25 2026 8:06 PM

Mask Used To Create Fake Footage: Bhagwant Mann On Video Row

చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ మరో వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. మ‌ద్యం సేవిస్తూ.. సిక్కు మ‌త‌ గురువుల ఫోటోల‌పై సీఎం భ‌గ‌వంత్ మ‌ద్యం చ‌ల్లుతున్న‌ట్లుగా ఉన్న ఓ వీడియో ఇటీవ‌ల వైర‌ల్‌గా మారింది. దీంతో విప‌క్ష పార్టీల‌న్నీ పంజాబ్ సీఎంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించాయి. ఈ వివాదాస్పద వీడియో రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. అయితే, ఈ వీడియోపై సీఎం భగవంత్‌మాన్‌ స్పందిస్తూ.. ఆ వీడియో పూర్తిగా నకిలీదేనని.. తనను పోలిన వ్యక్తికి ప్రత్యేకంగా మాస్క్ వేయించి చిత్రీకరించారని.. రాజకీయ దురుద్దేశంతోనే వైరల్‌ చేశారని ఆయన తేల్చిపారేశారు.

చండీగఢ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన భగవంత్ మాన్.. వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే అందులోని వ్యక్తి తాను కాదని స్పష్టమవుతుందని చెప్పారు. చిన్నప్పుడే జరిగిన శస్త్రచికిత్స కారణంగా తన మెడపై ఉన్న మచ్చ వీడియోలో కనిపించడం లేదని పేర్కొన్నారు. “ఆ వీడియో సృష్టించిన వారు నా మెడపై ఉన్న మచ్చను పెట్టడం మర్చిపోయారు. వీడియోను స్లో మోషన్‌లో జూమ్ చేసి చూస్తే మెడ వద్ద మాస్క్ ఆనవాళ్లు కనిపిస్తాయని మాన్ తెలిపారు.

వీడియోపై ఎలాంటి దర్యాప్తుకైనా తాను సిద్ధమని స్పష్టం చేసిన ఆయన.. అందులో కనిపిస్తున్న వ్యక్తి శరీరాకృతి, ఎత్తు, నడక తీరు తనతో ఏమాత్రం సరిపోలవని చెప్పారు. తన ఎత్తుతో పోలిస్తే ఆ వ్యక్తికి సుమారు రెండు అంగుళాల తేడా ఉందని పేర్కొన్నారు. ఈ వీడియోను రాజకీయ ప్రత్యర్థులు కావాలనే ప్రచారం చేస్తున్నారని మాన్ ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేక కొన్ని పార్టీలు మతపరమైన అంశాలను ఉపయోగించి తన ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్నాయని విమర్శించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement