
ఒడిశా : అత్తగారి ఇంట్లో తమ కుమార్తెను హత్య చేశారని మృతిరాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. బొయిపరిగుడ మెయిన్ రోడ్డులో నివాసముంటున్న మంజులా నాయిక్ కుమార్తె వర్షా నాయిక్(20) 2023 సెప్టెంబర్ 16వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయింది. బొయిపరిగుడ హనుమాన్ నగర్‌లోని ధన టక్రి కుమారుడు దుఖి శ్యామ్ టక్రిను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి వారు కలిసి నివసిస్తున్నారు.
అయితే శుక్రవారం వర్ష నాయిక్ అత్తగారింట్లో ఉరిపోసుకుందని అత్తింట్లో వారు వెల్లడించారు. అయితే తన కుమార్తెను హత్య చేశారని మృతురాలి తల్లి ఆరోపించింది. గత నాలుగు నెలలుగా తన కుమార్తెను కొడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. తన కుమార్తెను ఆమె భర్త దుఖి శ్యామ్ హత్య చేశాడని, హంతకుడిని అరెస్టు చేసి తగిన శిక్ష విధించాలని కోరింది. ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.