మార్చి 29 నుంచి మజ్జిగౌరి చైత్రోత్సవాలు
రాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం, కొర్కెలు తీర్చే చల్లని తల్లి మజ్జిగౌరి వార్షిక చైత్రోత్సవాలు మార్చి 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బుధవారం నాడు మందిరం కార్యాలయంలో మేనేజింగ్ ట్రష్టీ రాయిసింగి బిడిక ఆధ్వర్యంలో జరిగిన కమిటీ సభ్యుల సమావేశంలో నిర్ణయించారు. ఉత్సవాల్లో భాగంగా మార్చి 28 వ తేదీ సాయంత్రం మందిరం సమీపంలో గల జంఝావతి నది వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించి శుద్ధమైన గంగాజలాలను తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో నిలపడంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. 29 నుంచి అమ్మవారి చైత్రోత్సవ పూజలను నిర్వహిస్తారు. ఐదు రోజుల పాటుగా జరిగే ఉత్సవాలు ఏప్రిల్ 2 వ తేదితో ముగుస్తాయి.
రూ.16 లక్షలతో ఉత్సవాలు
ఈ ఏడాది అమ్మవారి చైత్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కమిటీ నిర్ణయించింది. అందుకు సుమారు రూ.16 లక్షలను కేటాయించింది. ఇందులొ ఐదు రోజుల పాటుగా జరిగే పూజల కోసం అదేవిధంగా విద్యుత్ అలంకరణలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం నిధులు కేటాయించేందుకు సమావేశంలో నిర్ణయించారు. గంజాం జిల్లా నుంచి ఏటాలా ఈసారి కూడా పూజలు నిర్వహించేందుకు పండితులను రప్పించాలని సమావేశంలో నిర్ణయించారు. ఐదు రోజుల పాటు నిర్వహించే విశేష పూజలతో పాటు చండీహోమం కార్యక్రమాలు యథావిధిగా నిర్వహిస్తారు. ఉత్సవాలను తిలకించేందుకు హాజరయ్యే భక్తులకు తాగునీటి సౌకర్యాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో పాటు ఆది,మంగళ, బుధవారాల్లో అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉండటంతో పాటు చైత్రోత్సవాల్లొ వారి సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నందున భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకునేందుకు సమావేశంలో చర్చించారు. సమావేశంలో ట్రస్ట్ సభ్యులు ఇప్పిలి సన్యాసిరాజు, దేవేంద్ర బెహర, రాధాక్రిష్ణ దొలాయి. మంగరాజ్, దొరబాబు తదితరులు పాల్గొన్నారు.
మార్చి 29 నుంచి మజ్జిగౌరి చైత్రోత్సవాలు


