● ఆరుగురికి తీవ్ర గాయాలు
భువనేశ్వర్: నయాగఢ్ జిల్లా నువాగావ్ ప్రాంతం కొరొడా గ్రామంలో బాణసంచా పేలుడు సంఘటన సంభవించింది. బాణసంచా తయారీ చేస్తుండగా శుక్ర వారం ఉదయం ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు, వారందరినీ నయాగఢ్ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 7వ తేదీన జరగనున్న లంకా దహనం ఉత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న బాణసంచా పోటీల్లో పాలుపంచుకునేందుకు బాణసంచా తయారు చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన వారిలో ఇద్దరు మహిళలు, ఒక మైనర్ ఉన్నట్లు సమాచారం. నువాగావ్ ఠాణా పోలీసులు ఘటనా స్థలం సందర్శించి క్షేత్ర స్థాయిలో తీవ్రతను సమీక్షించారు.


