జయపురం: జయపురం పట్టణంలో పోలీసు విభాగ అధికారులు మొదటి సారి జలఛత్ర కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిని జయపురం సబ్‌డివిజన్ పోలీసు అధికారి అర్చిత మిత్తల్ ప్రారంభించారు. జయపురంలో పోలీసు స్టేషన్‌లు నెలకొల్పిన నాటి నుంచి నేటి వరకు పోలీసు స్టేషన్‌లలో వేసవి కాలంలో ప్రజల దప్పిక తీర్చేందుకు ఇలాంటి జలఛత్ర కేంద్రాలు జిల్లాలో ఎన్నడూ ఏర్పాటు చేయలేదు. ఇటీవల బాద్యతలు చేపట్టిన సబ్‌డివిజన్ పోలీసు అధికారి అర్చిత మిత్తల్ ఆదేశాల మేరకు జయపురం పట్టణ పోలీసు స్టేషన్, సదర్ పోలీసు స్టేషన్, మహిళా పోలీసు స్టేషన్‌లలో జల ఛత్ర కేంద్రాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా సిడబ్ల్యూసీ అధ్యక్షురాలు డాక్టర్ బి.గాయిత్రీ దేవి, ఐపీఎస్ అధికారి కేబీ రామ్ సదన్, పట్టణ పోలీసు అధికారి ఉల్లాస చంద్ర రౌత్, సదర్ పోలీసు అధికారి సచీంద్ర కుమార్ ప్రధాన్, మహిళా పోలీసు స్టేషన్ అధికారి ఖాలక్ లతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


