ముగిసిన మజ్జి గౌరమ్మ చైత్రోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన మజ్జి గౌరమ్మ చైత్రోత్సవాలు

Apr 4 2026 7:19 AM | Updated on Apr 4 2026 7:19 AM

రాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న మజ్జిగౌరి మందిరం చైత్రోత్సవాలు గురువారం రాత్రి చండీ హోమం పూర్ణాహుతితో ముగిశాయి. మార్చి 29 వ తేదీ నుంచి ప్రారంభమైన ఉత్సవాలు ఐదు రోజుల పాటుగా ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి జరిగిన చండీ హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో మందిరం కమిటీ అధ్యక్షులు రాయిసింగి బిడిక, సభ్యులు ఇప్పిలి సన్యాసిరాజు, వడ్డాది శ్రీనివాస్‌రావు, పెద్దీన వాసు, పాలకొండ ప్రకాష్‌ దంపతులు పాల్గొన్నారు. చండీ హోమాన్ని ఉత్సవ పూజలను నిర్వహించేందుకు గంజాం జిల్లా నుంచి వచ్చిన ప్రత్యేక పురోహిత బృందం సంప్రదాయబద్ధంగా అమ్మవారి ఉత్సవ పూజలను నిర్వహించారు. గురువారం రాత్రి 8.15 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. గత ఐదు రోజులుగా ఉపవాసాలతో పూజలను ఆచరిస్తున్న కమిటీ సభ్యులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించి పూర్ణాహుతితొ వారి ఉపవాస దీక్షలను విరమించారు. ఇదిలాఉండగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని వీక్షించేందుకు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలొ హాజరయ్యారు. పూర్ణాహుతి మండపంలో వారితో తీసుకువచ్చిన కొబ్బరి, చిల్లర పైసలు, నెయ్యి తదితర పూజా సామగ్రిని పురోహితులకు సమర్పించారు.

ముగిసిన ప్రధాన ఘట్టాలు

ఉత్సవాల ముగింపు రోజు అత్యంత ప్రాధాన్యమైన ఘట్టాలు రాత్రి 9.30 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన పూజారి చంద్రశేఖర్‌ బెరుకొ నేతృత్వంలో ముందుగా మందిరం ప్రాంగణంలో అగ్నిపూజలను నిర్వహించారు. అనంతరం పెద్ద పెద్ద కలప దుంగలను వేసి నిప్పు వెలిగించారు. అవి కాలి నిప్పులుగా మారిన తర్వాత అంతకు ముందు ఊరేగింపులో ఉన్న అమ్మవారి ప్రతిరూపాలైన ఘటాలను మోసుకుంటూ వచ్చిన పూజారులు ఈ నిప్పులపై (మల్లెలు)పై నడిచారు. ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం ముళ్ల కంపలపై ఊయలను రూపొందించి దానిపై పూజారి కూర్చుని ఊగారు. ఈ తరహా కార్యక్రమాలన్నీ శాస్త్రోక్తంగా నిర్వహించారు. సంప్రదాయాలకు అనుగుణంగా పూజారులు నిర్వహించారు. దీంతో ఉత్సవాలకు ముగింపు పలికారు. అనంతరం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు అమ్మవారి ఘటాలను మందిరం నుంచి తీసుకువచ్చి సమీపంలో గల పాదాల గుడికి తీసుకువెళ్లి అక్కడ నిమజ్జనం చేశారు. దీంతో ఉత్సవాలు ముగిసినట్లుగా భావిస్తారు. ఉత్సవాల్లో భాగంగా వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి. పుష్ప సినిమాలొ తరహా ఒక యువకుడు వేషధారణ చేసి అందరినీ ఆకర్షించాడు

అమ్మవారి యథారూపం

ఉత్సవాలు ముగియడంతొ అమ్మవారు యథారూపంగా భక్తులకు దర్శనం ఇస్తారు. స్వర్ణాలంకరణలో కనిపించిన అమ్మవారు తిరిగి యథారూపంగా దర్శనం ఇస్తారు. అమ్మవారికి అలంకరించిన బంగారు ఆభరణాలు తిరిగి మందిరం కమిటీ పూర్తి పోలీస్‌ బందోబస్తు మధ్య స్థానిక ట్రెజరీలో భద్రంగా దాచారు. మళ్లీ అమ్మవారు ప్రత్యేక దినాలైన దసరా రోజుల్లో స్వర్ణాలంకారణ రూపంతో భక్తులకు తిరిగి దర్శన భాగ్యం కలిగిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement