కాలిబూడిదైన ఎలక్ట్రికల్ స్కూటీ
రాయగడ: పార్కింగ్ చేసి ఉన్న ఒక ఎలక్ట్రికల్ స్కూటీ కాలిబూడిదైన ఘటన జిల్లాలోని సదరు సమితి పితామహల్ వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పితామహల్ గ్రామంలో నివసిస్తున్న సుభాష్ చంద్ర బిశ్వాల్ అనే వ్యక్తి పదిహేను రోజుల క్రితం బ్యాటరీతో నడిచే ఎలక్ట్రికల్ స్కూటీని కొనుగోలు చేశాడు. మంగళవారం యథావిధిగా తన ఇంటి ముందు పార్కింగ్ చేసి రాత్రి పడుకున్నారు. అర్థరాత్రి భారీ శబ్ధం రావడంతో ఇంటి బయటకు వచ్చి చూడగా చుట్టూ దట్టమైన పొగ అలుముకుంది. అనంతరం పార్కింగ్ చేసిన స్యూటీ నుంచి మంటలు చెలరేగడంతో ఉలిక్కిపడ్డాడు. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే స్కూటీ మంటలకు పూర్తిగా దగ్ధమయ్యింది. అయితే ఏ కారణంతో స్కూటీలో మంటలు చెలరేగాయి అనేది తెలియడం లేదు. స్కూటీలో షార్ట్ సర్క్యూట్ వలన ప్రమాదం చోటుచేసుకుని ఉంటుందని భావిస్తున్నారు.


