‘మా అమ్మ ఆచూకీ తెలిస్తే చెప్పండన్న’.. కూలిన ఎయిరిండియా విమానం కింద.. | A Man Search For Missing Mother And 2 Year Old Daughter After Air India Incident | Sakshi
Sakshi News home page

‘మా అమ్మ ఆచూకీ తెలిస్తే చెప్పండన్న’.. కూలిన ఎయిరిండియా విమానం కింద..

Jun 13 2025 7:39 PM | Updated on Jun 13 2025 8:55 PM

A Man Search For Missing Mother And 2 Year Old Daughter After Air India Incident

గాంధీ నగర్‌: ఎయిరిండియా బోయింగ్‌ 787–8 డ్రీమ్‌లైనర్‌ ఏఐ171 విమానం కుప్పకూలిన బీజే మెడికల్‌ కాలేజీలో హృదయ విదారక దృశ్యాలు మనసులను మెలిపెడుతున్నాయి. విమాన ప్రమాద సమయంలో బీజే మెడికల్‌ కాలేజీ బిల్డింగ్‌లో తన తల్లి శార్లాబెన్ ఠాకూర్‌, రెండేళ్ల కుమార్తె ఆధ్య ఉన్నారు. పెను విషాదంపై సమాచారం అందుకున్న బాధితుడు తన అమ్మ, కుమార్తెతో పాటు అక్క ఆచూకీ కోసం వెతుకుతున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.

ప్రమాదంలో చెల్లాచెదురైన ప్రయాణికుల మృత దేహాల్ని గుర్తిస్తున్న అధికారుల్ని.. తనని నవ మాసాలు కనిపెంచిన అమ్మ.. తాను కన్న కూతురు, అక్క చనిపోయారని ఓవైపు కీడు శంకిస్తున్నా ఆ బాధను పంటి బిగువున భరిస్తూ.. పొంగుకొస్తున్న దుఖాన్ని దిగమింగుకుంటూ బాధితుడు ..‘సార్‌ .. మా అమ్మ, కూతురు,అక్క ఎక్కడ ఉన్నారో.. ఏమో? వాళ్ల ఆచూకీ తెలిస్తే చెప్పండన్నా అంటూ అమాయకంగా.. బాధతో ప్రాధేయపడుతున్న దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టిస్తున్నాయి. బాధితుడి వేడుకోలుతో అధికారులు అతని తల్లి,కుమార్తె ఆచూకీ గుర్తించే పనిలో పడ్డారు.

 

 ఎయిరిండియా కుప్పకూలిన హాస్టల్‌ భవనాలు కింద వైద్య విద్యార్థులు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు చిక్కుకున్నారు. బాధితుడి తల్లి బీజే మెడికల్‌ కాలేజీ వైద్య విద్యార్థులకు, ప్రొఫెసర్లకు భోజనం వండేది. భోజనం, చపాతీలు, గుజరాతీ వంటలు చేయగా.. వాటిని, ఆమె కుమారుడు ప్రతీ రోజు కళాశాల క్యాంపస్‌లో డెలివరీ చేసేవాడు. తిరిగి బీజే మెడికల్‌ కాలేజీ హాస్టల్‌కు వచ్చేవారు. ఎప్పటిలాగే కుమార్తెను తన తల్లి దగ్గర వదిలేసి పక్కనే ఉన్న సివిల్‌ ఆస్పత్రిలో లంచ్‌ బాక్స్‌లు ఇచ్చేందుకు వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి ఈ ఘోరం జరిగింది. 

ఈ విషాదంపై శార్లాబెన్ కుమారుడు రవీ మాట్లాడుతూ.. విమాన ప్రమాదం జరిగిన సమయంలో సివిల్ హాస్పిటల్‌కు టిఫిన్ బాక్సులు అందించటానికి వెళ్లాను. ఎప్పటిలాగే ప్రతి రోజు భోజనం ఇచ్చినట్లుగా జూన్ 12న  నేను మధ్యాహ్నం 1 గంటకు హాస్పిటల్ సిబ్బందికి, హాస్టల్‌కు భోజనం అందించడానికి వెళ్లాను. తిరిగి రావడంతో ఓ విమానం మెస్‌లో దూసుకొచ్చిందని విన్నాను. విమానం కూలిన ప్రదేశంలో మా అమ్మ కూర్చుంది. ఆ ప్రదేశం మొత్తం పూర్తిగా కాలిపోయింది. మా అమ్మ, కుమర్తె, అక్కడ  ఉన్నారని కంటతడి పెడుతూ మీడియాతో మాట్లాడారు. గంటలు గడుస్తున్నాయి. వాళ్ల ఆచూకీ లభించలేదు. అయినప్పటికీ వారి ఆచూకీ గుర్తించేందుకు మరో 72 గంటలు వేచి చూడాలని చెప్పారని వాపోయారు.
 

ప్రమాదం జరిగిన ఒక రోజు తరువాత సివిల్ హాస్పిటల్‌లో వైద్యులు మరణించిన వ్యక్తుల కుటుంబ సభ్యుల నుండి డీఎన్ఏ నమూనాలు సేకరిస్తున్నారు. మరోవైపు జేబీ మెడికల్‌ కాలేజీ బిల్డింగ్‌లో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాల్ని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. బాధితుడు రవి చెప్పిన ప్రాంతం అంతా  మనుషుల శరీర భాగాలు గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి. వాటిని గుర్తించేందుకు బాధితుల కుటుంబసభ్యుల డీఎన్‌ఏని సేకరిస్తున్నారు.  బాధితుడి రవి కూడా తన వాళ్ల ఆచూకీ దొరుకుతుందేమోనని విషాదం నిండిన కళ్లతో ఎదురు చూస్తున్నాడు.  

Advertisement
 
Advertisement
Advertisement