
పిటిషనర్ పెద్దిరాజుపై సీజేఐ జస్టిస్ గవాయ్ ఆగ్రహం
గోపనపల్లి భూవివాదంపై పిటిషన్ కొట్టివేత
కేసు విత్‌డ్రా చేసుకొనేందుకు అనుమతించని సీజేఐ
సాక్షి, న్యూఢిల్లీ: గోపన్‌పల్లి భూ వివాదం కేసులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా ఎన్.పెద్దిరాజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ట్రాన్స్‌ఫర్ పిటిషన్‌ను మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌసుమి భట్టాచార్యపై అసంబద్ధ ఆరోపణలు చేసినందుకు పిటిషనర్ పెద్దిరాజు, అతని తరఫు న్యాయవాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
వారిపై కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు ప్రారంభించకూడదో ఆగస్టు 11న తదుపరి విచారణ సందర్భంగా వ్యక్తిగతంగా హాజరై సమాధానం ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. ‘న్యాయమూర్తులను ఇబ్బందికర స్థితిలోకి నెట్టేలా ఎవరైనా ఆరోపణలు చేయడం మేము సహించం. ఇలాంటి వ్యవహారాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చర్యలతో న్యాయవ్యవస్థ పరువు పోతుంది. అలాంటి వ్యాఖ్యలపై కఠినంగా వ్యవహరించాలి.
ఇక్కడ మేము న్యాయవాదులను కూడా రక్షించాలనే ఉద్దేశంతో ఉన్నాం’అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. రేవంత్ రెడ్డికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఇతర న్యాయస్థానానికి బదిలీ చేయాలంటూ పెద్దిరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును రద్దుచేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆరోపణలు చేస్తూ పెద్దిరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
క్షమాపణలతో తప్పించుకోలేరు
విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున న్యాయవాది రితేష్ పాటిల్ ట్రాన్స్‌ఫర్ పిటిషన్‌ను వెనక్కు తీసుకుంటామని సుప్రీంకోర్టును కోరారు. అయితే ధర్మాసనం నిరాకరించింది. ‘ఇది కేవలం లిటిగెంట్ తప్పు మాత్రమే కాదు, అలాంటి వ్యాఖ్యలపై సంతకం చేసిన న్యాయవాది కూడా కోర్టు ధిక్కారానికి బాధ్యత వహించాలి. ‘మీరంతా మొదట న్యాయమూర్తిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు సమరి్పంచండి. అవి నిజాయితీగా ఉన్నాయో లేదో చూస్తాం. అంతేతప్ప, మీరు పిటిషన్ వెనక్కు తీసుకుంటామంటే క్షమించలేం’అని ధర్మాసనం స్పష్టం చేసింది. రేవంత్ రెడ్డి తరఫున సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
అసలు ఏం జరిగిందంటే..
గోపన్‌పల్లిలో సర్వే నంబర్ 127లోని సొసైటీకి సంబంధించిన భూమిని ఆక్రమించడంతోపాటు నిర్మాణాలను జేసీబీతో కూల్చేశారంటూ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో 2016లో కేసు నమోదైంది. పెద్దిరాజు ఫిర్యాదు మేరకు.. ఏ–1గా కొండల్ రెడ్డి (రేవంత్ రెడ్డి సోదరుడు), ఏ–2గా ఈ.లక్ష్మయ్య, ఏ–3గా రేవంత్ రెడ్డిని చేర్చారు. ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసును కొట్టేయాలని రేవంత్ 2020లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై హైకోర్టులో వాదనలు విన్న జడ్జి జస్టిస్ మౌషుమీ భట్టాచార్య ధర్మాసనం.. రేవంత్ రెడ్డి ఘటనా స్థలంలో లేరనే విషయాన్ని ఫిర్యాదుదారు సైతం అంగీకరించారని పేర్కొంది. తాను లేను కాబట్టి తనపై కేసు కొట్టేయాలని అడుగుతున్నారని, మిగతా వారిపై కేసుకొట్టేయాలని అడగటం లేదని వ్యాఖ్యానించింది. రేవంత్‌రెడ్డి ఆదేశాలమేరకే దూషించాడనే ఆరోపణలకు ఆధారాలు లేవని తెలిపింది. ఈ క్రమంలో జూలై 18న రేవంత్‌పై నమోదైన కేసును కొట్టేసింది.