breaking news
gopanpalli
-
సీఎం రేవంత్‌కు సుప్రీంకోర్టులో ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: గోపన్‌పల్లి భూ వివాదం కేసులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా ఎన్.పెద్దిరాజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ట్రాన్స్ఫర్ పిటిషన్‌ను మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌసుమి భట్టాచార్యపై అసంబద్ధ ఆరోపణలు చేసినందుకు పిటిషనర్ పెద్దిరాజు, అతని తరఫు న్యాయవాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.వారిపై కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు ప్రారంభించకూడదో ఆగస్టు 11న తదుపరి విచారణ సందర్భంగా వ్యక్తిగతంగా హాజరై సమాధానం ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. ‘న్యాయమూర్తులను ఇబ్బందికర స్థితిలోకి నెట్టేలా ఎవరైనా ఆరోపణలు చేయడం మేము సహించం. ఇలాంటి వ్యవహారాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చర్యలతో న్యాయవ్యవస్థ పరువు పోతుంది. అలాంటి వ్యాఖ్యలపై కఠినంగా వ్యవహరించాలి.ఇక్కడ మేము న్యాయవాదులను కూడా రక్షించాలనే ఉద్దేశంతో ఉన్నాం’అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. రేవంత్ రెడ్డికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఇతర న్యాయస్థానానికి బదిలీ చేయాలంటూ పెద్దిరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును రద్దుచేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆరోపణలు చేస్తూ పెద్దిరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. క్షమాపణలతో తప్పించుకోలేరు విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున న్యాయవాది రితేష్ పాటిల్ ట్రాన్స్ఫర్ పిటిషన్‌ను వెనక్కు తీసుకుంటామని సుప్రీంకోర్టును కోరారు. అయితే ధర్మాసనం నిరాకరించింది. ‘ఇది కేవలం లిటిగెంట్ తప్పు మాత్రమే కాదు, అలాంటి వ్యాఖ్యలపై సంతకం చేసిన న్యాయవాది కూడా కోర్టు ధిక్కారానికి బాధ్యత వహించాలి. ‘మీరంతా మొదట న్యాయమూర్తిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు సమరి్పంచండి. అవి నిజాయితీగా ఉన్నాయో లేదో చూస్తాం. అంతేతప్ప, మీరు పిటిషన్ వెనక్కు తీసుకుంటామంటే క్షమించలేం’అని ధర్మాసనం స్పష్టం చేసింది. రేవంత్ రెడ్డి తరఫున సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. అసలు ఏం జరిగిందంటే.. గోపన్‌పల్లిలో సర్వే నంబర్ 127లోని సొసైటీకి సంబంధించిన భూమిని ఆక్రమించడంతోపాటు నిర్మాణాలను జేసీబీతో కూల్చేశారంటూ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో 2016లో కేసు నమోదైంది. పెద్దిరాజు ఫిర్యాదు మేరకు.. ఏ–1గా కొండల్ రెడ్డి (రేవంత్ రెడ్డి సోదరుడు), ఏ–2గా ఈ.లక్ష్మయ్య, ఏ–3గా రేవంత్ రెడ్డిని చేర్చారు. ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసును కొట్టేయాలని రేవంత్ 2020లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై హైకోర్టులో వాదనలు విన్న జడ్జి జస్టిస్ మౌషుమీ భట్టాచార్య ధర్మాసనం.. రేవంత్ రెడ్డి ఘటనా స్థలంలో లేరనే విషయాన్ని ఫిర్యాదుదారు సైతం అంగీకరించారని పేర్కొంది. తాను లేను కాబట్టి తనపై కేసు కొట్టేయాలని అడుగుతున్నారని, మిగతా వారిపై కేసుకొట్టేయాలని అడగటం లేదని వ్యాఖ్యానించింది. రేవంత్‌రెడ్డి ఆదేశాలమేరకే దూషించాడనే ఆరోపణలకు ఆధారాలు లేవని తెలిపింది. ఈ క్రమంలో జూలై 18న రేవంత్‌పై నమోదైన కేసును కొట్టేసింది. -
మృత్యు పిల్లర్
హైదరాబాద్: నగరానికి వలస పోయి చేతనైన పనిచేసుకుంటూ తమ పిల్లలకు కడుపు నింపుకుందామనుకున్న ఆ దంపతుల ఆశ తీరకుండానే ఆవిరైపోయింది. బతుకుదెరువు కోసం భవన నిర్మాణ కూలీలుగా ఇద్దరు చిన్నారులతో వలస వచ్చిన ఆ భార్యాభర్తలు నగరంలో జీవనం కొనసాగిస్తున్నారు. అయితే నిర్మాణంలో ఉన్న భవనానికి పునాది లేకుండా సిమెంట్ ఇటుకలతో నిర్మించిన ఓ పిల్లర్ వారి పిల్లల పాలిట మృత్యు శకటమైంది. తమ అభాగ్య జీవితాల్లో భాగ్య రేఖలు నింపుతారని కొండంత ఆశతో ఉన్న ఆ దంపతులకు ఆ పిల్లర్ తీరని గర్భశోకాన్ని మిగిల్చింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగిన ఈ ఘటన వివరాలు సీఐ రవీందర్ చెప్పిన కథనం మేరకు..ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన దస్తగిరి, భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్‌కు వలసవచ్చి గోపన్‌పల్లిలోని బెల్ల్ల విస్తవిల్లాస్ ఆర్చ్‌లో ఉంటూ భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నారు. శుక్రవారం బెర్ల విస్తవిల్లాస్ ఆర్చ్‌లోని భవనంలో కూలీ పనులు చేస్తుండగా వారి కూతుళ్లు అమ్ములు(6), ప్రవళిక(3) ఇద్దరు కలిసి భవనం ముందు ఆడుకుంటున్నారు. ఆ చిన్నారులు ఆడుకుంటుండగా మధ్యాహ్నం పిల్లర్ కుప్పకూలిపోయింది. అందులోని సిమెంట్ ఇటుకలు ఆ చిన్నారులపై పడటంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తల్లిదండ్రులు స్థానికుల సహాయంతో వారిని నల్లగండ్లలోని సిటిజన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసిన తరువాత అక్కడ నుండి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిర్మాణదారులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు మృతి చెందిన విషయం తెలుసుకున్న గచ్చిబౌలి కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. సంఘటన గురించి పోలీసులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత లేకుండా నిర్మించడమే కారణం గోపన్‌పల్లిలోని బెర్ల విస్తవిల్లార్ ఆర్చ్ పేరుతో ఓ సంస్థ ఇండిపెండెంట్ భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. భవన నిర్మాణాల్లో భాగంగా భవన డిజైన్ కోసమని సిమెంట్ ఇటుకలతో పునాది లేకుండానే ఓ పిల్లర్‌ను నిర్మించడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. -
డిఫ్తీరియా కేసులు మరో పది..
నల్లకుంట, న్యూస్‌లైన్: నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిలో బుధవారం మరో 10 డిఫ్తీరియా కేసులు నమోదయ్యాయి. మంగళవారం మొత్తం 33 మంది ఆస్పత్రిలో చేరగా, 14 మందిని బుధవారం డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం మొత్తం 29 మంది చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు. కాగా, డిఫ్తీరియా ప్రబలిన గోపన్‌పల్లిలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ముషీరాబాద్ బడీమసీద్- అబ్దుల్ కరీమ్ (11), వట్టిపల్లి ఫతేమైదాన్- మతిన్ (11), జెరీలిన్, అలీజా కోట్ల- సాలిహా సిద్ధిఖి (9), మలక్‌పేట- అమీనాబీ (12)లకు డిఫ్తీరియా సోకినట్టు గుర్తించారు. ఇప్పటి వరకు ఈ నెలలో డిఫ్తీరియాకు సంబంధించి 150 కేసులు నమోదైనట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ స్పష్టం చేశారు. కొత్తగా ఆస్పత్రిలో చేరిన వారు వీరే... గోపన్‌పల్లి- వంశీకృష్ణ (9), సంతోష్‌నగర్- మరియాకాసిమ్ (9), జైన్ (19), సికింద్రాబాద్- రిజ్వాబేగం (45), చాదర్‌ఘాట్- ప్రియాంక (8), ఖార్వాన్- నఫీజ్ (20), కోకాపేట- అనురాధ (25), యాకుత్‌పుర- సమీర్ (11), ఎన్టీఆర్ నగర్- సాయినిధి (3). ఎమర్జెన్సీ నిధులతో వాక్సిన్ కొనుగోలు ఆస్పత్రి ఎమర్జెన్సీ బడ్జెట్లో 20 శాతం నిధులను డిఫ్తీరియా వ్యాక్సిన్ కొనుగోలుకే వెచ్చించాల్సి వస్తోంది. ఒక్కో రోగికి 10 వేల యూనిట్లు ఇవ్వాల్సి వస్తోంది. ఇందు కోసం రూ.1500 ఖర్చవుతున్నాయి. ప్రభుత్వమే దీన్ని ఉచితంగా సరఫరా చేస్తే బాగుంటుంది. - డాక్టర్ శంకర్, సూపరింటెండెంట్, ఫీవర్ ఆస్పత్రి