
అందరూ గ్రేడ్ –ఏ ఉగ్రవాదులే
సుదీర్ఘ శ్రమకు ఫలితమే ‘మహదేవ్’
లోక్‌సభకు వెల్లడించిన అమిత్ షా
ఇద్దరు ముష్కరుల వద్ద పాకిస్తాన్ ఓటర్ ఐడీలు
వారి ఆయుధాలు కూడా పాక్‌వే
పాక్‌కు కాంగ్రెస్ క్లీన్‌చిట్ అంటూ నిప్పులు చెరిగిన అమిత్ షా
న్యూఢిల్లీ: వేలాది మంది విచారణ. అనుమా నితులపై నిరంతర నిఘా. ఆశ్రయమిచ్చిన వారి నిర్బంధం. గత ఏప్రిల్ 22న పహల్గాంలో పాశవిక దాడికి పాల్పడి 26 మంది అమాయక పర్యాట కులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల కోసం ‘ఆపరేషన్ మహదేవ్’లో భాగంగా భద్రతా దళాలు నెలల తరబడి వేటాడిన తీరిది. శాటిలైట్ ఫోన్ సిగ్నల్స్ సాయంతో ఆనుపానులు చిక్కడంతో ఎట్టకేలకు వారి పాపం పండింది.
సోమవారం జమ్మూ కశ్మీర్‌లో భద్రతా దళాల చేతుల్లో హతమ య్యారు. ఆ ముగ్గురూ పహల్గాం దాడిలో పాల్గొన్న ముష్కరు లేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. వారిని గుర్తించేందుకే నెలల సమయం పట్టిందని వెల్ల డించారు. సాంకేతికత, మానవ నిఘా సాయంతో ఉగ్రవాదులను కదలి కలను కనిపెట్ట గలిగినట్టు వివరించారు. ఆపరేషన్ సిందూర్‌పై మంగళవా రం లోక్‌సభలో ప్రత్యేక చర్చలో ఆ యన ప్రసంగించారు. ఆ పాశవిక దాడితో గాయ పడ్డ దేశ ప్రజల హృద యాలకు సాంత్వన చేకూ ర్చిన ఆపరేషన్ మహదేవ్ తాలూకు వివరాలను సభకు వెల్లడించారు.
హతులైన ముగ్గురిని సులే మాన్ అలియాస్ ఫైజల్, అఫ్గాన్, జిబ్రాన్‌గా గుర్తించారు. వారంతా ఏ గ్రేడ్ ఉగ్రవాదులేనని తెలిపారు. సైన్యం తాలూకు 4 పారా మిలిటరీ బలగాలు, సీఆర్పీఎఫ్ జవాన్లు, జమ్మూ కశ్మీర్ పోలీసులు కలసి కట్టుగా ఆపరేషన్‌లో పాలుపంచుకున్నట్టు వివరించారు. పహల్గాం దాడికి పాల్పడ్డ ముష్కరులను ఏరివేసి జాతికి ఊరట కల్పించామని చెప్పారు. ‘‘ఇంత మంచి వార్త విని అధికార పక్షంతో పాటు విపక్షాలు ఆనందిస్తాయని ఆశించా. కానీ వారి ముఖాలన్నీ కళతప్పి కనిపిస్తున్నాయి’’ అంటూ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ తప్పిదమే ‘పాక్’!
ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమవుతూ వస్తోందని అమిత్ షా ఎద్దేవా చేశారు. దేశ సమస్యలన్నింటికీ కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమంటూ తూర్పారబట్టారు. పాక్ ఆక్రమిత భూభాగాలను స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన అవకాశాలన్నింటినీ కాంగ్రెస్ ఎప్పటికప్పుడు కాలదన్నుతూ వచ్చిందని ఆరోపణలు గుప్పించారు. అలాంటి పార్టీకి మోదీ ప్రభుత్వం పాక్‌పై పూర్తిస్థాయిలో నిర్ణాయక చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించే నైతిక అర్హత కూడా లేదన్నారు. పహల్గాం దాడిలో పాక్‌కు క్లీన్‌చిట్ ఇచ్చేందుకు ఎక్కడ లేని ఉత్సాహమూ చూపిన చరిత్ర ఆ పార్టీది అంటూ మండిపడ్డారు.
పహల్గాం దాడికి పాల్పడింది స్థానిక ఉగ్రవాదులే కావచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోం మంత్రి పి.చిదంబరం ఇటీవల కూడా వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. పీఓకేను స్వాధీనం చేసుకునే అవకాశం చేతికందిన వేళ సైనిక చర్యను కేంద్రం నిలిపేసిందా అంటూ కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగొయ్ సభలో ప్రశ్నించడంపై అమిత్ షా మండిపడ్డారు. ‘‘వాళ్లు ఏం నిరూపించాలని అనుకుంటున్నారు? ఎవరిని కాపాడాలనుకుంటున్నారు? ఇదంతా పాక్‌ను కాపాడేందుకు స్పష్టమైన కుట్రే’’ అంటూ తూర్పారబట్టారు.
స్వాతంత్య్రం వచ్చిన వేళ దేశ విభజనను కాంగ్రెస్ వ్యతిరేకించి ఉంటే జమ్మూ కశ్మీర్‌లో అసలు ఉగ్ర భూతం జడలు విప్పేదే కాదన్నారు. ఉగ్రవాదానికి పాక్ తల్లివేరుగా మారిందంటూ దుయ్యబట్టారు. ఆ దేశం ఏర్పాటును కాంగ్రెస్ తాలూకు తప్పిదంగా అభివర్ణించారు. పాక్‌కు బుద్ధి చెప్పేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే జారవిడిచిందని ఆరోపించారు. ‘‘1948లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను మన సైన్యం పూర్తిగా విముక్తం చేసే సమయంలో నాటి కాంగ్రెస్ ప్రధాని నెహ్రూ ఏకపక్షంగా కాల్పుల విమరణ ప్రకటించారు. 1962 యుద్ధం వేళ అస్సాంను చైనా దఖలు పరుస్తున్నట్టు బాహాటంగా ప్రకటన చేశారు.
పైగా ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ హోదా అవకాశాన్నీ కాలదన్నారు. 1971లో 90,000 మంది పాక్ సైనికులు భారత్‌కు లొంగిపోయారు. ఆ సంఖ్య నాటి పాక్ సైన్యంలో ఏకంగా 42 శాతం. అంతేగాక 15 వేల చదరపు కి.మీ. పాక్ భూభాగం కూడా మన అదుపులోకి వచ్చింది. అయినా పీఓకేను వెనక్కు తీసుకునేందుకు నాటి కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. సరికదా, ఆ యుద్ధంలో స్వాధీనం చేసుకున్న పాక్ భూభాగాన్ని కూడా పువ్వుల్లో పెట్టి వెనక్కిచ్చారు. ఇలాంటి చరిత్ర ఉన్నవాళ్లు, పహల్గాం దాడికి పాల్పడ్డవారిని ఎందుకు పారిపోనిచ్చారని నన్ను అడుగుతున్నారు.
వారిని తుదముట్టించడం ద్వారా ఈ ప్రశ్నకు నా తరఫున భద్రతా దళాలే బదులిచ్చాయి. 1986లో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాక్‌కు పారిపోయింది కూడా కాంగ్రెస్ ప్రధాని రాజీవ్ హయాంలోనే. 1993లో ఉగ్రవాదులు సయీద్ సలాహుద్దీన్, టైగర్ మెమన్, అనీస్ ఇబ్రహీం కస్కర్, 2007లో రియాజ్ భత్కల్, 2010లో ఇక్బాల్ భత్కల్ దేశం వీడి పారిపోయినప్పుడు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెసే. వీళ్లందరినీ ఎందుకు పారిపోనిచ్చారో విపక్ష నేత రాహుల్‌గాంధీ నుంచి తెలుసుకోవాలని అనుకుంటున్నా’’ అని అన్నారు.