
ఇప్పుడే నిర్ణయానికి రావడం తొందరపాటే
అహ్మదాబాద్ ఘటనపై ఎయిరిండియా సీఈవో వ్యాఖ్య
న్యూఢిల్లీ: గత నెలలో అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు అనంతరం మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఎయిరిండియా సీఈవో కాంప్‌బెల్ విల్సన్ పేర్కొన్నారు. పైలట్ల సామర్థ్యాన్ని కొట్టిపారేయలేమన్న ఆయన.. విమానంలో మెకానికల్, మెయింటెనెన్స్‌కు సంబంధించిన లోపాలేవీ ఈ నివేదిక పేర్కొనలేదని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఘటనపై ఇప్పుడే నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుందని అభిప్రాయపడ్డారు.
‘ప్రాథమిక నివేదిక విడుదలతోపాటు ఘటనకు దారి తీసిన పరిస్థితులు, కారణాలపై అదనంగా మరిన్ని వివరాలు వెల్లడవుతున్నాయి. ఇది మరింత స్పష్టతను, మరిన్ని ప్రశ్నలను లేవనెత్తడం ఏమాత్రం ఆశ్చర్యం కలిగించడం లేదు’అంటూ ఆయన తమ సిబ్బందికి పంపిన అంతర్గత మెమోలో పేర్కొన్నారు. ఇంధన నాణ్యతలోగానీ, టేకాఫ్ ప్రక్రియలోగానీ తేడాల్లేవన్నారు. అదేవిధంగా, ఇద్దరు పైలట్లకు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష కూడా జరిగిందన్నారు.
‘ప్రాథమిక నివేదికలో ప్రమాదానికి ఎలాంటి కారణం గుర్తించలేదు. ఎటువంటి సిఫారసులు చేయలేదు. పైపెచ్చు ఈ విచారణ ఇంకా కొనసాగుతోంది. అందుకే ఊహాగానాలకు తెరలేపవద్దు’అని కోరారు. తుది నివేదిక వెలువడే వరకు మరిన్ని సెనేషనల్ వార్తలు, వదంతులు వస్తాయనడంలో సందేహం లేదని వ్యాఖ్యానించారు. ఎయిరిండియా బోయింగ్ విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాసిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ)శనివారం ప్రాథమిక నివేదిక విడుదల చేయడం తెల్సిందే. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే విమానం రెండు ఇంజన్ల ఫ్యూయల్ సప్లయ్ స్విచ్‌లు నిలిచినట్లు పైలట్ల మధ్య సంభాషణల ద్వారా వెల్లడైందని తెలిపింది.
ఫ్యూయల్ స్విచ్‌లను తనిఖీ చేయించండి: డీజీసీఏ
ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడమే అహ్మదాబాద్ ఘటనకు దారి తీసినట్లు తేలడంతో దేశీయ విమానయాన సంస్థలకు డీజీసీఏ కీలక ఆదేశాలిచి్చంది. ఆయా సంస్థలు తమ బోయింగ్ 787, 737 రకం విమానాల్లో ఇంధన స్విచ్ లాకింగ్ వ్యవస్థలను తనిఖీ చేయాలని స్పష్టం చేసింది. కాగా ఎయిరిండియా ప్రమాద నివేదికలోని కీలక విషయాలను ప్రభుత్వం వెల్లడించకమునుపే వాల్‌స్ట్రీట్ జర్నల్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఎలా తెలిసిపోయాయని శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంకా చతుర్వేది ప్రశ్నించారు.