ఢిల్లీ సీఎం రేఖా గుప్తాను చంపేస్తానంటూ బెదిరింపులు | Man Arrested For Giving Death Threat To Delhi Chief Minister Rekha Guptha | Sakshi
Sakshi News home page

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాను చంపేస్తానంటూ బెదిరింపులు

Jun 8 2025 6:07 AM | Updated on Jun 8 2025 6:07 AM

Man Arrested For Giving Death Threat To Delhi Chief Minister Rekha Guptha

నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు 

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను హత్య చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన శ్లోక్‌ త్రిపాఠి అలియాస్‌ శ్లోక్‌ తివారీ(30) అనే వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతడు మద్యం మత్తులో బెదిరింపులకు దిగినట్లు గుర్తించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టి, ఘజియాబాద్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శ్లోక్‌ త్రిపాఠి ఎల్‌ఎల్‌బీ చదివాడు. యూపీలోని ఘజియాబాద్‌ కోర్టులో డాక్యుమెంట్‌ రైటర్‌గా పని చేస్తున్నాడు. 2020లో పెళ్లి చేసుకున్నాడు. గత ఏడాది భార్య అతడిని వదిలేసి, ఢిల్లీకి వెళ్లిపోయింది. భర్త తాగుడు వ్యసనం భరించలేక దూరంగా ఉంటోంది. 

మళ్లీ ఎలాగైనా భార్యతో కలిసి జీవించాలని శ్లోక్‌ త్రిపాఠి నిర్ణయించుకున్నాడు. ఆమె వినకపోవడంతో పోలీసుల సాయం తీసుకోవాలని భావించాడు. గురువారం, శుక్రవారం రాత్రిపూట చిత్తుగా మద్యం సేవించి, 112 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌ నెంబర్‌కు పదేపదే ఫోన్‌ చేశాడు. తన భార్యను తనతో కలపాలని పోలీసులను కోరాడు. వారు పట్టించుకోకపోవడంతో ఢిల్లీ ముఖ్యమంత్రిని రేఖా గుప్తాను చంపేస్తానంటూ హెచ్చరించాడు. దాంతో ఘజియాబాద్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ పోలీసులకు సమాచారం చేరవేశారు. ఇరు రాష్ట్రాల పోలీసులు అతడి కోసం ఉమ్మడిగా గాలింపు చర్యలు ప్రారంభించారు. ఘజియాబాద్‌లో అరెస్టు చేశారు. మరోవైపు సీఎం రేఖా గుప్తా భద్రతను మరింత పెంచారు. 

Advertisement
 
Advertisement
Advertisement