కొచ్చి తీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక  | Liberian cargo ship sinks off Kochi | Sakshi
Sakshi News home page

కొచ్చి తీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక 

May 26 2025 4:33 AM | Updated on May 26 2025 4:33 AM

Liberian cargo ship sinks off Kochi

లీకైన రసాయనాలు హై అలర్ట్‌ ప్రకటించిన కేరళ ప్రభుత్వం 

ఓడలోని 27 మంది సిబ్బందిని రక్షించిన కోస్ట్‌గార్డ్, నేవీ 

కొచ్చి: కేరళలోని కొచ్చి తీరంలో శనివారం బోల్తాపడిన లైబీరియా కార్గోషిప్‌ ఆదివారం పూర్తిగా మునిగిపోయినట్లు భారత కోస్ట్‌ గార్డ్‌ ప్రకటించింది. నౌకలో 27 మంది సిబ్బంది ఉండగా.. ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ 24 మందిని రక్షించింది. నేవీ షిప్‌ ఐఎన్‌ సుజాత మరో ముగ్గురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. నౌకలో భారీగా రసాయనాలు ఉన్నాయని, అవి సముద్రంలో లీకై, వేగంగా విస్తరిస్తుండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని కేరళ ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. రసాయనాల లీకేజీని అరికట్టడానికి కోస్ట్‌గార్డ్‌ కృషి చేస్తోంది.  

సురక్షితంగా బయటపడ్డ సిబ్బంది..  
లైబీరియాకు చెందిన ఎమ్‌ఎస్‌సీ ఈఎల్‌ఎస్‌ఏ 3 శనివారం సాయంత్రం వంగిపోవడంతో ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌కు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన కోస్ట్‌గార్డ్‌ 24 మంది సిబ్బందిని రక్షించింది. 24 మంది సిబ్బందిలో ఒక రష్యన్‌ (ది మాస్టర్‌), 20 మంది ఫిలిప్పీన్స్, ఇద్దరు ఉక్రేనియన్లు, ఒక జార్జియన్‌ జాతీయుడు ఉన్నారు. పరిస్థితిని పర్యవేక్షించడానికి ముగ్గురు సీనియర్‌ సిబ్బంది ఓడలోనే ఉండిపోయారు. అయితే.. ఆదివారం తెల్లవారుజాము సమయానికి అది పూర్తిగా బోల్తా పడటంతో ఇండియన్‌ నేవీ షిప్‌ ఐఎన్‌ సుజాత ఆ ముగ్గురిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చింది.  

కంటైనర్లలో ప్రమాదకర రసాయనాలు... 
బోల్తా పడిన ఓడలో 13 కంటైనర్లలో ప్రమాదకరమైన రసాయనాలు, 640 ఇతర కంటైనర్లు ఉన్నా యి. వీటిలో 84.44 మెట్రిక్‌ టన్నుల డీజిల్, 367.1 మెట్రిక్‌ టన్నుల ఫర్నేస్‌ఆయిల్, కాల్షియం కార్బైడ్‌ వంటి ప్రమాదకర రసాయనాలు ఉన్నాయి. ఓడ మునిగిపోయిన తరువాత రసాయనాలు లీకయ్యా యి. ఇవి సముద్రపు నీటితో కలిసి అత్యంత ప్రమాదకరమైన ఎసిటిలీన్‌ వాయువును విడుదల చేస్తుందని కోస్ట్‌గార్డ్‌ హెచ్చరించింది. మ్యాపింగ్‌ సాంకేతికతతో చమురు లీకేజీని అంచనా వేస్తున్నారు. లీక్‌ అయిన ఇంధనం గంటకు దాదాపు మూడు కిలోమీటర్ల వేగంతో కదులుతోందని గుర్తించింది. పర్యావరణానికి తీవ్రమైన ముప్పు కావడంతో.. చము రును విచ్ఛిన్నం చేయడానికి వైమానిక డోరి్నయర్‌ విమానాలు డిస్పర్సెంట్‌ను స్ప్రే చేస్తున్నాయి. 

కేఎస్‌డీఎంఏ హెచ్చరికలు..  
కేరళలోని సముద్ర తీరం జీవవైవిధ్యానికి నిలయం. పర్యాటకానికి ప్రధాన ఆకర్షణ. ఈ రెండింటికి ఎలాంటి విఘాతం కలగకుండా కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (కేఎస్‌డీఎంఏ) చర్యలు తీసుకుంటోంది. కంటైనర్లు చమురుతో సహా సరుకు ఒడ్డుకు కొట్టుకువచ్చే అవకాశం ఉందని, తీర ప్రాంతాల్లో చమురు పొరలు కనిపించవచ్చని హెచ్చరికలు జారీ చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది. ఒడ్డుకు కొట్టుకువచ్చే కార్గో కంటైనర్లు లేదా చమురును తాకవద్దని సూచించింది. ఒడ్డున కంటైనర్లు లేదా చమురు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రకటించింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement