న్యాయశాస్త్రం భాషను ప్రజలకు అర్థమయ్యేలా మార్చాలి
పౌరులందరికీ న్యాయం సులభంగా అందాలి
కోర్టు తీర్పులను, న్యాయ పత్రాలను స్థానిక భాషల్లో తీసుకురావాలి
ప్రభుత్వ న్యాయ సహాయ వ్యవస్థతో లక్షలాది వివాదాలకు తెర
జాతీయ సదస్సులో ప్రధాని మోదీ స్పష్టికరణ
న్యూఢిల్లీ: అందరికీ అర్థమయ్యేలా న్యాయశాస్త్రం భాషను సులభతరంగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. స్థానిక భాషలోనే న్యాయశాస్త్రం అందుబాటులోకి వస్తే ప్రజలకు ఎనలేని మేలు జరుగుతుందని చెప్పారు. ప్రజలందరికీ న్యాయం సులభంగా అందే సౌలభ్యం ఉండాలని పేర్కొ న్నారు. ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా న్యాయం సమానంగా, సులువుగా అందుబాటులోకి రావాలన్నారు.
శనివారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో ‘న్యాయ సహాయ వ్యవస్థల బలోపేతం’ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడారు.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్, తదుపరి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌తోపాటు సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దేశంలో సామాజిక న్యాయ సాధనకు సులభతర న్యాయం అత్యంత కీలకమని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. కోర్టు తీర్పులను, న్యాయ సంబంధిత పత్రాలను స్థానిక భాషల్లో తీసుకురావాలని కోరారు. ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఎంతో కృషి చేస్తోందని ప్రశంసించారు. స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇస్తూ సుప్రీంకోర్టు ప్రారంభించిన చర్యలను ఆయన గుర్తుచేశారు. 80 వేలకుపైగా తీర్పులను 18 భారతీయ భాషల్లోకి అనువదిస్తోందని తెలియజేశారు. ఈ గొప్ప ప్రయత్నం హైకోర్టులు, జిల్లా స్థాయి కోర్టుల్లోనూ జరగాలని ఆకాంక్షించారు.
మాతృభాషలో చట్టంతో లబ్ధి
న్యాయం అనేది సమాజంలో కొందరికే పరిమితం కాకూడదని, అది అందరికీ అందాలని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. పేదలకు, అణగారిన వర్గాలకు సులభంగా న్యాయం దక్కడంలో ప్రభుత్వ న్యాయ సహాయ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని మోదీ తెలిపారు. న్యాయాన్ని ప్రతి పౌరుడికీ చేర్చడమే మన లక్ష్యం కావాలని సూచించారు. సులభతర న్యాయాన్ని మరింత మెరుగుపర్చడానికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని, ఇకపై ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయనుందని ఉద్ఘాటించారు. కక్షిదారులకు అర్థమయ్యే భాషలో తీర్పులివ్వాలని, న్యాయాన్ని చేకూర్చాలని చెప్పారు.
చట్టాలను రూపొందించే సమయంలో ఈ విషయాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ప్రజలకు వారి మాతృభాషలో చట్టం గురించి తెలిస్తే వివాదాలు చాలావరకు తగ్గిపోతాయని స్పష్టంచేశారు. ప్రతి ఒక్కరికీ న్యాయం అందుబాటులో ఉంటే.. నిర్దిష్ట గడువులోగా న్యాయం సులభంగా అందితే.. సామాజిక న్యాయానికి అదే బలమైన పునాది అవుతుందని తేలి్చచెప్పారు. న్యాయ విభాగంలో టెక్నాలజీ ప్రాధాన్యతను ప్రస్తావించారు. ఈ–కోర్టుల ప్రాజెక్టుతో సత్ఫలితాలు వస్తున్నాయని చెప్పారు.
కాలం చెల్లిన చట్టాలను రద్దుచేశాం
సులభతర వాణిజ్యం, సులభతర జీవనాన్ని పెంపొందించడంపై తమ ప్రభుత్వం గత 11 ఏళ్లుగా ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని ప్రధాని మోదీ వివరించారు. అవసరంలేని 40 వేలకుపైగా నియమ నిబంధనలను రద్దు చేశామని తెలిపారు. జన విశ్వాస్ చట్టం ద్వారా 3,400కుపైగా న్యాయ వ్యవహారాలను నేరరహితం(డిక్రిమనలైజ్) చేశామన్నారు. అలాగే కాలం చెల్లిన 1,500 చట్టాలను రద్దు చేశామని గుర్తుచేశారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న చట్టాల్లో మార్పులు చేసి భారతీయ న్యాయ సంహితను తీసుకొచ్చామని వెల్లడించారు. మధ్యవర్తిత్వంతో వివాదాలు సులువుగా పరిష్కారం అవుతాయని సూచించారు.
మూడేళ్లలో 8 లక్షల వివాదాలు పరిష్కారం
నేషనల్ లీగల్ సరీ్వసెస్ అథారిటీ(నల్సా) ఏర్పాటై 30 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ సంస్థ ఆధ్వర్యంలో కమ్యూనిటీ మధ్యవర్తిత్వంపై ఏర్పాటు చేసిన నూతన శిక్షణా విధానాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. వివాదాలను పరిష్కరించడానికి, లిటిగేషన్లు తగ్గించడానికి, సమాజంలో శాంతి సామరస్యం నెలకొల్పడానికి అవసరమైన వనరులను ఈ శిక్షణ అందిస్తుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. లోక్ అదాలత్‌లు, ప్రి–లిటిగేషన్ సెటిల్‌మెంట్లతో లక్షలాది వివాదాలు వేగంగా పరిష్కారం అవుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం ప్రారంభించిన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్‌తో కేవలం మూడేళ్లలో 8 లక్షలకుపైగా వివాదాలు పరిష్కారానికి నోచుకున్నాయని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు.


