ఈ ఏడాది రబీ సాగు..భలే జోరు | Rabi crop records over 8 lakh hectare compared to last year 2025-26 | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది రబీ సాగు..భలే జోరు

Dec 24 2025 1:13 PM | Updated on Dec 24 2025 1:33 PM

Rabi crop records over 8 lakh hectare compared to last year 2025-26

దేశవ్యాప్తంగా 5.80 కోట్ల హెక్టార్లలో రబీ పంటలు

సెనగ సాగులో సరికొత్త రికార్డు.. 

పప్పుధాన్యాల సాగులో భారీ పెరుగుదల

ఆశాజనకంగా గోధుమ, వరి.. నూనెగింజలకూ మంచి డిమాండ్‌

కేంద్ర వ్యవసాయ శాఖ తాజా  నివేదిక వెల్లడి

గతేడాదితో పోలిస్తే 8 లక్షల హెక్టార్లు పెరిగిన విస్తీర్ణం 

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రబీ సీజన్‌ సాగు జోరందుకుంది. వాతావరణం అను కూలించడం, జలాశయాల్లో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉండటంతో అన్నదాతలు ఉత్సాహంగా సాగు పనులు చేపట్టారు. గత ఏడాదితో పోలిస్తే ఈసా రి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది డిసెంబర్‌ 19 నాటికి అందిన సమాచా రం ప్రకారం.. దేశవ్యాప్తంగా మొత్తం 5.80 కోట్ల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతున్నట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయానికి ఇది 5.72 కోట్ల హెక్టార్లుగా ఉండగా, ఈసారి అదనంగా 8.12 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు వేయడం విశేషం. ఈ మేరకు మంగళవారం కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. 

పప్పుధాన్యాలపై పెరిగిన మక్కువ
ఈ సీజన్‌లో రైతులు పప్పుధాన్యాల సాగు వైపు ఎక్కువగా మొగ్గు చూపినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పప్పుధాన్యాల మొత్తం సాగు విస్తీర్ణం 126.74 లక్షల హెక్టార్లకు చేరింది. గతేడాది ఇది 123.01 లక్షల హెక్టార్లు మాత్రమే. అంటే సుమారు 3.72 లక్షల హెక్టార్ల పెరుగుదల నమోదైంది. ఇందులో సెనగలదే సింహభాగంగా ఉంది. గత ఏడాది 86.81 లక్షల హెక్టార్లలో సెనగలు సాగు చేయగా, ఈసారి అది 91.70 లక్షల హెక్టార్లకు పెరిగింది. అంటే ఒక్క సెనగ సాగులోనే దాదాపు 4.89 లక్షల హెక్టార్ల భారీ పెరుగుదల కనిపించింది. కాగా పెసలు, మినప పంటల సాగు కూడా నిలకడగా సాగుతోంది. కుల్తీ, ఇతర పప్పుధాన్యాల సాగు వివరాలను కూడా కేంద్రం వెల్లడించింది.

ఆహార భద్రతకు భరోసా.. ధుమ, వరిదేశ ఆహార భద్రతలో కీలకమైన గోధుమ, వరి సాగు కూడా ఆశాజనకంగా ఉంది. రబీ సీజన్‌లో ప్రధాన పంట అయిన గోధుమ సాగు 301.63 లక్షల హెక్టార్లకు చేరింది. గతేడాది సుమారు 3 కోట్ల హెక్టార్లతో పోలిస్తే 1.29 లక్షల హెక్టార్ల పెరుగుదల నమోదైంది. అదే సమయంలో రబీ వరి సాగులోనూ మంచి వద్ధి కనిపిస్తోంది. గతేడాది 11.52 లక్షల హెక్టార్లలో వరి నాట్లు పడగా, ఈసారి అది 13.35 లక్షల హెక్టార్లకు పెరిగింది. 1.83 లక్షల హెక్టార్ల మేర సాగు విస్తీర్ణం పెరగడం వరి రైతుల ఉత్సాహానికి నిదర్శనమని వ్యవసాయ శాఖ పేర్కొంది.

నూనెగింజలు, చిరుధాన్యాల తీరు ఇలా..
వంటనూనెల కొరతను తగ్గించే దిశగా నూనెగింజల సాగు కూడా సానుకూలంగా ఉంది. మొత్తం 93.33 లక్షల హెక్టార్లలో నూనెగింజలు సాగవుతున్నాయి. ఇందులో ఆవాలు సాగు విస్తీర్ణం 87.95 లక్షల హెక్టార్లకు చేరాయి. చిరుధాన్యాల విషయంలో శ్రీ అన్న (మిల్లెట్స్‌) సాగు పట్ల రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. జొన్నలు, మొక్కజొన్న, రాగులు తదితర పంటలు కలిపి మొత్తం 45.65 లక్షల హెక్టార్లలో సాగవుతున్నాయి. జొన్నల సాగు 19.33 లక్షల హెక్టార్లుగా, మొక్కజొన్న సాగు 14.97 లక్షల హెక్టార్లుగా నమోదైంది. బార్లీ సాగు కూడా 6.94 లక్షల హెక్టార్లకు చేరింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement