మహారాష్ట్రలోని లోహగఢ్ కోటలో జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసుకు సంబంధించిన విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. కేతన్ కాబోయే భార్య సియాకు ఈ పెళ్లి ఇష్టం లేక ప్రియుడు చేతన్ చౌదరితో తన బంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతోనే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సియా, చేతన్ ఇద్దరిపై హత్య, క్రిమినల్ ప్లానింగ్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరూ రిమాండ్‌లో ఉన్నారు. వీరి విచారణలో భాగంగా కీలక విషయాలను పోలీసులు రాబట్టారు.
పెళ్లి రద్దుకు ఒప్పుకోలేదు, పారిపోయినా వదలనన్నాడు : సియా
పోలీస్ వర్గాల సమాచారం ప్రకారం తనకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదనే విషయాన్ని కేతన్ అగర్వాల్‌కు ముందే చెప్పానని సియా విచారణాధికారులకు తెలిపింది. చేతన్ చౌదరితో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని చెప్పినట్టు వెల్లడించింది. అయితే ఇపుడు పెళ్లి రద్దు చేసుకుంటే, తమ ఫ్యామిలీ పరువు పోతుంతని చెప్పాడని, ఒకవేళ ఆమె పెళ్లి నుంచి తప్పించుకోవడానికి పారిపోవాలని చూసినా, వదిలిపెట్టేది లేదని కేతన్ బెదిరించాడని సియా క్లెయిమ్ చేసింది.
అయితే, సియా చేస్తున్నఈ ఆరోపణలు/వాదనలు ఇంకా కోర్టు, పోలీసుల దర్యాప్తులోనే ఉన్నాయి. వీటిపై న్యాయపరమైన విచారణ జరగాల్సి ఉంది.
నేరం రుజువైతే ఆమెను ఉరితీయండి!
మరోవైపు తన కూతురి వ్యవహారంపై సియా తల్లి స్పందించారు. తన కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను హత్య చేసినట్లు రుజువైతే, ఆమెకు కఠినమైన శిక్ష పడాలని కూతురు సియా గోయల్‌ను ఉరితీయాలని ఒక తల్లిగా నేను ఈ మాట చెబుతున్నా అన్నారు.
సియా తండ్రి ప్రవీణ్ గోయల్ కూడా ఇదే విధంగా స్పందించారు. నేరం రుజువైతే, తన కూతురైనా సరే, ఉరి తీయాల్సిందే అన్నారు. ఈ ఘటన తర్వాత జూన్ 23న ప్రవీణ్ గోయల్‌కు గుండెపోటు రావడంతో ప్రస్తుతం ఆయన పూణేలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి: కేతన్ హత్యలో మరో ట్విస్ట్ : మాట మారుస్తున్న కిలాడీలు
జరిగిన కథ
పూణేకు చెందిన 26 ఏళ్ల కేతన్ అగర్వాల్‌ను అతని కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ బాబూలాల్ చౌదరి కలిసి సహ్యాద్రి పర్వత శ్రేణుల్లోని లోహగఢ్ కోటపై నుండి కిందకు నెట్టేసి హత్య చేశారు. మొదట దీనిని ట్రెకింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
పక్కా ప్లాన్‌తో హత్య
కేఫ్ మీటింగ్: జూన్ 18 ఉదయం పూణేలోని ఒక కేఫ్‌లో సియా, చేతన్ కలిసి కేతన్‌ను ఎలా చంపాలో ప్లాన్ చేశారు. కోటలో ఏ ప్రాంతం నుండి నెట్టేయాలో కూడా వారు ముందే చర్చించుకున్నారు. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు పోలీసులకు లభించాయి. ప్లాన్ ప్రకారం మధ్యాహ్నం సియా, కేతన్‌ను ట్రెకింగ్ కోసం కోటపైకి తీసుకెళ్లగా, చేతన్ వారిని రహస్యంగా వెంబడించాడు. అనుకూలమైన సమయం చూసి ఇద్దరూ కలిసి కేతన్‌ను లోయలోకి నెట్టేశారు.
గత 6 నుండి 7 నెలల్లో సియా, చేతన్ ల మధ్య 2,004 సార్లు ఫోన్ కాల్స్ జరిగాయి. వారు దాదాపు 238 గంటల పాటు మాట్లాడుకున్నట్లు, కొన్ని కాల్స్ 2-3 గంటల పాటు సాగినట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ 2025 దీపావళి పార్టీలో మొదటిసారి కలుసుకున్నారు.
రూ. 17 కోట్ల ప్యాలెస్, ప్రైవేట్ జెట్స్
కేతన్ అగర్వాల్ తమ కుటుంబానికి చెందిన 'సక్సెస్ గ్రూప్' రియల్ ఎస్టేట్ సంస్థలో డైరెక్టర్ మరియు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా పనిచేసేవాడు. సియా గోయల్ కామర్స్ డిగ్రీ పూర్తి చేసింది. దాదాపు 35ఏళ్లుగా సంబంధాలున్న ఇరు కుటుంబాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో వీరికి నిశ్చితార్థం జరిపించారు. నవంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఒక ప్యాలెస్ వేదికగా వీరి వివాహం ఘనంగా జరగాల్సి ఉంది. సియా, కేతన్‌లకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. నవంబర్‌లో వీరి వివాహాన్ని అత్యంత వైభవంగా జరిపించేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లు చేశాయి. వివాహం కోసం జైపూర్‌లోని ప్యాలెస్‌ను రూ. 17 కోట్లకు బుక్ చేశారు. పెళ్లికి వచ్చే అతిథులను తీసుకురావడం కోసం ప్రత్యేకంగా రెండు ప్రైవేట్ విమానాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంతలోనే కేతన్ హత్యోదంతం ఇరు కుటుంబాల్లో తీవ్ర అలజడి రేపింది.


