కదిలొచ్చిన దేవతలు | Kerala Traffic Jam Heroics: Two Nurses Save Mans Life With CPR, Read Story Inside | Sakshi
Sakshi News home page

కదిలొచ్చిన దేవతలు

Jul 3 2026 6:42 AM | Updated on Jul 3 2026 8:49 AM

Kerala Traffic Jam Heroics: Two Nurses Save Mans Life with CPR

రోడ్డంతా ట్రాఫిక్ జామ్. వాహనాలు అంగుళం కూడా కదలడం లేదు. ఆ సమయంలో ఓ కారులో ఉన్న వ్యక్తికి తీవ్ర గుండెనొప్పి వచ్చింది. ఆస్పత్రికి చేరుకునే ప్రయత్నంలోనే ఆయన స్పృహ కోల్పోయాడు. చుట్టూ ఉన్నవారికి ఏం చేయాలో అర్థం కాక అయోమయం నెలకొంది. కారులో ఉన్నవాళ్ల కేకలు.. ఆర్తనాదాలు. ఏ దేవుళ్లను తల్చుకున్నారో.. ఏమో ఇద్దరు యువతులు హఠాత్తుగా అక్కడ దర్శనమిచ్చారు. ఆ వ్యక్తిని రక్షించారు.

హృదయాన్ని కదిలించే ఘటన కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం ఉదయం థన్నిపుజ సమీపంలోని ఒక్కల్ ప్రాంతానికి చెందిన 43 ఏళ్ల సినోజ్ కారులో కుటుంబంతో వెళ్తుండగా.. తీవ్ర ఛాతినొప్పి వచ్చింది. అలా తానే నడిపించుకుంటూ కారులోనే ఆస్పత్రికి బయలుదేరాడు. అయితే కలాడి వంతెన సమీపంలో భారీ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాడు. నొప్పి మరింత పెరగడంతో కారులోనే స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు. 

అదే సమయంలో పక్కనే ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు నర్సులు ఆ పరిస్థితిని గమనించారు. వెంటనే బస్సు దిగి కారువద్దకు పరుగెత్తారు. ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా సినోజ్‌కు సీపీఆర్ ప్రారంభించారు. అంతటితో ఆగలేదు. సినోజ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తున్న కారులోనే నిరంతరం సీపీఆర్ కొనసాగించారు. దీంతో ఆస్పత్రికి చేరేసరికి ఆయనలో మళ్లీ కదలిక వచ్చింది. 

గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ధమని పూర్తిగా బ్లాక్ కావడంతో.. వెంటనే అత్యవసర యాంజియోప్లాస్టీ నిర్వహించి వైద్యులు రక్షించారు. సకాలంలో సీపీఆర్‌ చేసి సినోజ్‌ ప్రాణాలు కాపాడినందుకు వైద్యులు ఆ ఇద్దరినీ అభినందించారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. వాళ్ల పేర్లు అంజలి బైజు, ఆర్ధ్ర రాజ్‌. అంజలి అంగమాలిలోని ఎల్‌ఎఫ్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తోంది. ఆర్ధ్రరాజ్‌ ఏమో బెంగళూరులో నర్సింగ్ విద్యార్థి. 

ఈ మొత్తం ఎపిసోడ్‌లో.. స్థానికుల పాత్ర గురించి కూడా చెప్పుకోవాలి. సినోజ్‌కు గుండెనొప్పి వచ్చిందని తెలుసుకున్న ఓ వ్యక్తి వెంటనే ఆ కారు స్టీరింగ్ చేపట్టి ఆస్పత్రి వైపు నడిపించాడు. మరికొందరు ట్రాఫిక్‌ను క్లియర్ చేయడంలో సహకరించగా, ఇంకొందరు అంబులెన్స్ ఏర్పాటుకు కృషి చేశారు. అందరి సమిష్టి సహకారంతో విలువైన సమయం ఆదా కావడంతో ఒక ప్రాణం నిలిచింది. 

వైద్య వృత్తి అంటే ఉద్యోగం మాత్రమే కాదు, ప్రాణాలను కాపాడే బాధ్యత కూడా అని అంజలి, ఆర్ద్ర మరోసారి నిరూపించారని నెటిజన్లు కొనియాడుతున్నారు. సరైన సమయంలో అందించిన సీపీఆర్ ఒక మనిషి ప్రాణాన్ని ఎలా కాపాడగలదో ఈ ఘటన మరోసారి స్పష్టంగా చూపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement