డిజిటల్ యుగంలో కర్ణాటక ప్రభుత్వం భారీ ఆవిష్కరణ చేసింది. అత్యంత చౌకైన ఏఐ పర్సనల్ కంప్యూటర్‌ను అభివృద్ధి చేసింది. KEO (Knowledge-driven, Economical, Open-source) పేరుతో తయారైన ఈ కంప్యూటర్ డిజిటల్ అంతరాలను తగ్గించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని అంచనా. త్వరలో జరగబోయే టెక్ సదస్సులో ఈ అత్యంత చౌక ఏఐ పీసీని ఆవిష్కరించనున్నట్లు కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి...
దేశం ఐటీ రంగంలో దూసుకెళుతున్నప్పటికీ సమాజంలోని అన్ని వర్గాల వారికీ అందుబాటులో లేదు. పర్సనల్ కంప్యూటర్లనే ఉదాహరణగా తీసుకుంటే దేశం మొత్తమ్మీద పీసీలున్న కుటుంబాలు పది-15 శాతానికి మించవని ఇటీవలి జాతీయ కుటుంబ సర్వే చెబుతోంది. పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రతి నాలుగు కుటుంబాల్లో ఒకరికి పీసీ ఉంటే.. పల్లెల్లో ఇది ఐదు నుంచి ఏడు శాతం మించడం లేదు. స్మార్ట్‌ఫోన్లపైనే ఆధారపడుతున్నారు. ఫలితంగా ఉద్యోగాలతోపాటు అన్ని రంగాల్లోనూ గ్రామీణులు నగర వాసులతో పోటీ పడలేని పరిస్థితి ఏర్పడుతుంది. నగరాల్లోని విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు, విషయ పరిజ్ఞానాన్ని పెంచే ఇతర డిజిటల్ టూల్స్ అందుబాటులో ఉంటున్నాయి. వీటన్నింటినీ అందించే పీసీలు కొనలేక గ్రామీణ విద్యార్థులు వెనుకబడి పోతున్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం అభివృద్ధి చేసిన KEO ఏఐ పర్సనల్ కంప్యూటర్‌కు ప్రాధాన్యం ఏర్పడుతోంది. ఈ పీసీలో కృత్రిమ మేథ కోసం ప్రత్యేక కోర్ ఉండటం గమనార్హం. RISC-V ప్రాసెసర్, BUDDH అనే ఆన్-డివైస్ AI ఇంజిన్ ఆధారంగా పనిచేస్తుంది.
అత్యంత చౌకైన పీసీగా రూపొందుతున్న దీంట్లో 4జీ కనెక్టివిటీతోపాటు ఈథర్‌నెట్ కూడా ఉంటుంది. యూఎస్‌బీ ఏ, యూఎస్‌బీ-సీ, హెచ్‌డీఎంఐ పోర్టులు, ఆడియో జాక్‌లు ఉంటాయి. అంతేకాకుండా.. కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌తోపాటు వర్డ్, ఎక్సెల్ వంటి ప్రొడెక్టివిటీ టూల్స్‌ను కూడా ముందుగానే ఏర్పాటు చేసి ఉంచారు. ఏఐ ఇంజిన్ బుధ్‌ను కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే రూపొందించిన ఆఫ్‌లైన్ సిలబస్‌తో అనుసంధానమై ఉంటుంది.
కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 15 శాతం లోపు ఇళ్లలో మాత్రమే కంప్యూటర్లు ఉన్నాయని, దాదాపు 60 శాతం విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులు, ఇతరత్ర ప్రాజెక్టుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కర్ణాటక ప్రభుత్వ అధికారులు తెలిపారు. దాదాపు 45శాతం పాఠశాలలలో అసలు కంప్యూటర్లే లేవని దీంతో విద్యార్థులు డిజిటల్ సాంకేతికతను అందిపుచ్చుకోవడం లేదన్నాయి. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని తక్కువ ఖర్చులో కంప్యూటర్‌ను అందించడానికి KEONICS సాయం తీసుకున్నట్లు వివరించారు.ఇది కేవలం విద్యార్థులకు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలకు ఉపయోగపడుతుందని తెలిపారు.


