
11 ఏళ్లలో పదో స్థానం నుంచి ఐదో స్థానానికి చేరుకున్నాం
మూడో స్థానానికి చేరడం ఇక ఎంతోదూరంలో లేదు
స్పష్టమైన ఉద్దేశాలు, నిజాయితీగల ప్రయత్నాలతో ముందుకెళ్తున్నాం
బెంగళూరు పర్యటనలో ప్రధాని స్పష్టీకరణ
డొనాల్డ్ ట్రంప్ ‘డెడ్ ఎకానమీ’ వ్యాఖ్యలను తిప్పికొట్టిన మోదీ
సాక్షి, బెంగళూరు: భారతదేశ ఆర్థిక వ్యవస్థ మృతప్రాయంగా మారిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా తిప్పికొట్టారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా భారత్ పరుగులు తీస్తోందని తేలి్చచెప్పారు. స్పష్టమైన ఉద్దేశాలు, నిజాయితీగల ప్రయత్నాలతో ముందుకెళ్తున్నామని వివరించారు. మన ఆర్థిక వ్యవస్థలో వేగానికి ‘సంస్కరణ, పనితీరు, మార్పు’ చోదక శక్తిగా పని చేస్తున్నాయని వెల్లడించారు.
11 ఏళ్ల క్రితం ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ పదో స్థానంలో ఉండేదని, ఇప్పుడు ఐదో స్థానానికి చేరుకుందని గుర్తుచేశారు. మూడో స్థానానికి ఎగబాకడం ఇక ఎంతో దూరంలో లేదన్నారు. ప్రధాని మోదీ ఆదివారం కర్ణాటక రాజధాని బెంగళూరులో పర్యటించారు. బెంగళూరు మెట్రోరైలు నెట్‌వర్క్‌కు సంబంధించిన ‘ఎల్లో లైన్’ను ప్రారంభించారు. ఆర్.వి.రోడ్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో సంభాíÙంచారు. బెంగళూరు మెట్రోరైల్ ప్రాజెక్టు మూడో దశకు(ఆరెంజ్ లైన్) మోదీ శంకుస్థాపన చేశారు. అలాగే మూడు వందేభారత్ రైళ్లను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. 2014లో ఇండియాలో మెట్రో రైలు వ్యవస్థ కేవలం ఐదు నగరాల్లోనే ఉండేదని, ప్రస్తుతం 24 నగరాల్లో అందుబాటులోకి వచి్చందని చెప్పారు. ఈ వ్యవస్థ వెయ్యి కిలోమీటర్లకు విస్తరించిందని తెలియజేశారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద మెట్రో రైలు నెట్‌వర్క్ మన దేశంలోనే ఉందన్నారు. ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే...
పట్టణ ప్రణాళిక అత్యంత కీలకం
‘‘దేశంలో 2014 కంటే ముందు కేవలం 20 వేల కిలోమీటర్ల రైలు మార్గం విద్యుదీకరణ జరిగింది. గత 11 ఏళ్లలో 40 వేల కిలోమీటర్లకు పైగా విద్యుదీకరణ పూర్తిచేశాం. 2014లో దేశంలో కేవలం 74 ఎయిర్‌పోర్టులు ఉండేవి, ఇప్పుడు వాటి సంఖ్య 160కి చేరింది. 2014లో జాతీయ జలరహదారులు కేవలం మూడు ఉండగా, ప్రస్తుతం అవి 30కి చేరుకున్నాయి. మన నగరాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెంది, ప్రభావంతంగా మారితేనే మన దేశం ప్రగతి పథంలో సాగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. అందుకే నగరాల్లో అధునిక మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. 21వ శతాబ్దంలో పట్టణ ప్రణాళిక, పట్టణ మౌలిక సదుపాయాలు అత్యంత కీలకం. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మన నగరాలు, పట్టణాలను తీర్చిదిద్దుకోవాలి. నవ భారత్ ఎదుగుదలకు బెంగళూరు ఒక ప్రతీక. ఆధ్యాతి్మక జ్ఞానం, సాంకేతిక విజ్ఞానం బెంగళూరు ఆత్మలో మిళితమయ్యాయి.
‘సిందూర్’ విజయం వెనుక సాంకేతికత‘మేక్ ఇన్ ఇండియా’
ఆపరేషన్ సిందూర్ విజయం వెనుక భారతీయ సాంకేతికత, ‘మేక్ ఇన్ ఇండియా’ ఉన్నాయి. మన దేశంపైకి ఉగ్రవాదులను ఏగదోసిన పాకిస్తాన్‌ను కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే మోకాళ్లపై నిల్చోబెట్టాం. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశంలో కొత్త ముఖాన్ని ప్రపంచం తొలిసారిగా దర్శించింది. పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిక్షణ శిబిరాలను, వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాం, మన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాం. దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతోపాటు ‘మేక్ ఇన్ ఇండియా’ బలం మనకు విజయం చేకూర్చిపెట్టాయి. ఆపరేషన్ సిందూర్‌లో బెంగళూరుతోపాటు ఇక్కడి యువత కీలక పాత్ర పోషించారు. ప్రపంచంలో అతిపెద్ద నగరాల్లో ఒకటిగా బెంగళూరు గుర్తింపు పొందడం సంతోషంగా ఉంది. మనదేశం ప్రపంచంతో పోటీ పడడమే కాకుండా, ప్రపంచాన్ని స్వయంగా ముందుకు నడిపిస్తోంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.