హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ చిత్రం అవతార్: ఫైర్ అండ్ యాష్. ఈ సిరీస్‌లో వచ్చిన పార్ట్-3 ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. డిసెంబర్ 19న ఇండియా వ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది మనదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రంగా అవతరించింది. కేవలం ఏడు రోజుల్లోనే ఈ ఘనత సాధించింది.
ఈ క్రమంలోనే అవతార్ -3.. హాలీవుడ్ మూవీ ఎఫ్1 ఇండియా ఆల్‌టైమ్ వసూళ్లను అధిగమించింది. దీంతో ఈ ఏడాది హాలీవుడ్ చిత్రాల లిస్ట్‌లో టాప్ ప్లేస్ కైవసం చేసుకుంది. అవతార్-3 ఇప్పటివరకు ఇండియావ్యాప్తంగా రూ. రూ. 131 కోట్లు వసూలు చేసింది. ఈ క్రమంలోనే 2025లో విడుదలైన బ్రాడ్ పిట్ మూవీ ఎఫ్1 రూ. 129 కోట్ల వసూళ్లను అధిగమించింది. ఇప్పటివరకు భారతదేశంలో 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన విదేశీ చిత్రంగా అవతార్-3 నిలిచింది.
అవతార్ ఫ్రాంచైజీలో వచ్చిన ఈ చిత్రానికి ఇండియాలో అంతగా ఆదరణ దక్కించుకోలేకపోయింది. తొలి రోజు కేవలం రూ. 23 కోట్లు మాత్రమే రాబట్టింది. ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో వసూళ్లపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ మూవీ దురంధర్ బాక్సాఫీస్ బరిలో ఉండడం అవతార్-3కి కలిసి రాలేదని చెప్పాలి. కాగా.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చూస్తే 400 మిలియన్ డాలర్ల మార్క్‌కు దగ్గర్లో ఉంది.


