బంగ్లాదేశ్‌లో ఇటీవల మైనార్టీలపై దాడులు తీవ్రతరం అవుతున్నాయి. అక్కడి మతతత్వ వాదులు వేరు వేరు ఘటనల్లో ఇద్దరు హిందు మతానికి చెందిన వ్యక్తులపై దాడి చేసి చంపారు. అంతే కాకుండా వారి ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో భారతీయ విదేశాంగ శాఖ స్పందించింది. అక్కడ హిందువులపై జరుగుతున్న దాడులు తీవ్రంగా బాధిస్తున్నాయని తెలిపింది.
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై గత కొంతకాలంగా భారత్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం ఎదుట విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సంఘాలు నిరసనలు తెలిపాయి. అంతే కాకుండా పశ్చిమ బెంగాల్‌లో బంగ్లాదేశ్‌లో జరుగుతున్న దాడుల పట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైశ్వాల్ స్పందించారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఘటనలను భారత్ గమనిస్తోందని తెలిపారు.
రణధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ.. "బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా భారత్ తీవ్రంగా పరిగణిస్తుంది. హిందువులపై జరిగే దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము. వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఊపేక్షించేది లేదు. ఈ ఘటనలకు కారణమైన వారిని తీవ్రంగా శిక్షించాలని బంగ్లాదేశ్‌ను కోరుతున్నాము. హిందువులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అక్కడి ప్రభుత్వానిదే." అని రణధీర్ జైశ్వాల్ అన్నారు.
ఈ బుధవారం రాత్రి పాంగ్షా ఉపజిల్లా హోసైన్‌డంగాలో 29ఏళ్ల అమృత్ మండల్ అనే యువకుడిని అక్కడి మత ఛాందస వాదులు కొట్టిచంపారు. అతను బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. అయితే కొద్దిరోజుల క్రితం దీపు చంద్రదాస్ అనే యువకుడిని దైవదూషణ చేస్తున్నాడనే ఆరోపణలతో అక్కడి అల్లరి మూకలు విపరీతంగా కొట్టి చంపారు.అంతే కాకుండా మరో ఘటనలో ఓ హిందూ కుటుంబంపై దాడికి యత్నించగా వారు తృటిలో తప్పించుకున్నారు.
ఈ నెల ప్రారంభంలో అక్కడ ఉస్మాన్ హాది అనే రాడికల్ నేతపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆయన ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు. దీంతో ఆదేశంలో మరోసారి హింస చేలరేగింది. హిందువులే టార్గెట్‌గా అక్కడి మత ఛాందస వాదులు దాడులు జరుపుతున్నారు. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి.


