ఇరాన్‌కు వెళ్లొద్దు.. భారత ప్రభుత్వం అడ్వైజరీ | India eases Iran advisory but warns against non-essential travel | Sakshi
Sakshi News home page

ఇరాన్‌కు వెళ్లొద్దు.. భారత ప్రభుత్వం అడ్వైజరీ

Jun 24 2026 12:22 PM | Updated on Jun 24 2026 12:30 PM

India eases Iran advisory but warns against non-essential travel

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌కు సంబంధించిన ప్రయాణ హెచ్చరికలను భారత ప్రభుత్వం మరోసారి సవరించింది. ప్రస్తుతం ఇరాన్‌లో భద్రతా పరిస్థితులు కొంత మెరుగుపడినప్పటికీ, భారతీయులు అత్యవసరం కాని ప్రయాణాలను మానుకోవాలని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.

టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం విడుదల చేసిన తాజా ట్రావెల్ అడ్వైజరీలో ఇరాన్‌లో పరిస్థితులు గతంతో పోలిస్తే కొంత స్థిరపడుతున్నాయని పేర్కొంది. అయినప్పటికీ భద్రతా పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోలేదని, ఎలాంటి ఆకస్మిక పరిణామాలనైనా తోసిపుచ్చలేమని హెచ్చరించింది. ఇరాన్‌లోని భద్రతా పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నాం. తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు అత్యవసర ప్రయాణాలు చేయవద్దు. అందువల్ల భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇటీవల ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరిగిన ఘర్షణలు, వైమానిక దాడులు, క్షిపణి దాడులు పశ్చిమాసియా ప్రాంతాన్ని తీవ్ర ఉద్రిక్తతల్లోకి నెట్టాయి. ఈ పరిస్థితుల్లో జూన్ 8న భారత ప్రభుత్వం అత్యవసర సూచనలు జారీ చేస్తూ భారతీయులు ఇరాన్‌కు వెళ్లవద్దని, ఇప్పటికే అక్కడ ఉన్నవారు అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా దేశం విడిచి రావాలని సూచించింది. అయితే తాజా సమీక్షలో పరిస్థితులు కొంత మెరుగుపడినట్లు గుర్తించిన భారత రాయబార కార్యాలయం, గత హెచ్చరికలను పూర్తిగా ఎత్తివేయకుండా జాగ్రత్తతో కూడిన కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. 

ఇరాన్‌లో ప్రస్తుతం నివసిస్తున్న భారతీయులు స్థానిక భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలని, రాయబార కార్యాలయంతో నిరంతర సంబంధాలు కొనసాగించాలని కోరింది. అత్యవసర సహాయం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. కాగా, ఇరాన్‌లో ఉన్న భారతీయ విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు మరియు ఇతర పౌరుల భద్రతపై భారత ప్రభుత్వం నిరంతరం నిఘా ఉంచుతోందని అధికారులు తెలిపారు. పరిస్థితుల్లో ఏవైనా మార్పులు చోటుచేసుకుంటే వెంటనే కొత్త సూచనలు జారీ చేస్తామని వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement