బిహార్ సీఎం నితీశ్ కుమార్ స్పష్టీకరణ
తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి
పాట్నా: బిహారీగా ఉండడం, బిహారీనని చెప్పుకోవడం ఇప్పుడు గర్వకారణమని బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్ అన్నారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలంటే మరోసారి ఎన్డీయేను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ మేరకు నితీశ్ కుమార్ శనివారం సోషల్ మీడియాలో ఒక వీడియో సందేశం విడుదల చేశారు. తాను అధికారంలో ఉన్నప్పటికీ తన కుటుంబం కోసం ఏమీ చేయలేదని, ఎల్లప్పుడూ రాష్ట్ర అభివృద్ధి కోసమే కృషి చేశానని తెలిపారు.
బిహార్ ప్రగతే ధ్యేయమని స్పష్టంచేశారు. 2005 నవంబర్‌లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, తమ పాలనలో శాంతి భద్రతలు చాలావరకు మెరుగుపడ్డాయని వివరించారు. చట్టబద్ధ పాలన తీసుకొచ్చామని, ప్రజలు ఇప్పుడు తాము బిహారీలమని గర్వంగా చెప్పుకోగలుగుతున్నారని ఉద్ఘాటించారు. మహిళలు, హిందువులు, ఉన్నత కులాలు, దళితులు, వెనుకబడిన తరగతులు.. ఇలా సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎన్నో చర్యలు చేపట్టామని గుర్తుచేశారు.
తాము మళ్లీ అధికారంలోకి వస్తే అభివృద్ధి, సంక్షేమ పథకాలు యథాతథంగా కొనసాగుతాయని వెల్లడించారు. ఆర్జేడీకి అధికారం అప్పగిస్తే అరాచయ పాలన వస్తుందని నితీశ్ కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. తమకు మరో అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ‘వికసిత్ బిహార్’ తమ ధ్యేయమని అన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా మారుస్తామని హామీ ఇచ్చారు. బిహార్‌లో ఈ నెల 6, 11న అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు.


