నాటి రిఖీ.. నేటి రవి చౌదరి!  | Himachal man lost his memory reunited with family after 45 years | Sakshi
Sakshi News home page

నాటి రిఖీ.. నేటి రవి చౌదరి! 

Nov 22 2025 6:20 AM | Updated on Nov 22 2025 6:20 AM

Himachal man lost his memory reunited with family after 45 years

అదొక అద్భుతం. బాలీవుడ్‌ సినిమాకు తీసిపోని  వాస్తవం. పదహారేళ్ల వయసులో తలకు బలమైన గాయమై..  గతాన్ని పూర్తిగా మరిచిపోయి  అదృశ్యమయ్యాడొక వ్యక్తి.  చిత్రంగా అదే వ్యక్తి సరిగ్గా 45 ఏళ్ల తర్వాత.. మరో గాయంతో పాత జ్ఞాపకాలన్నీ ముసురుకుని  కుటుంబాన్ని చేరుకున్నాడు.  ఆయనే నాటి రిఖీ.. నేటి రవి చౌదరి.

భారమైన బతుకుల్లో ఆనందభాష్పాలు 
హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిర్మౌర్‌ జిల్లా, నది గ్రామంలో ఇటీవల ఈ అపూర్వ కలయిక జరిగింది. కొడుకు చనిపోయాడని ఇన్నాళ్లు భారంగా బతికిన తల్లిదండ్రులు, తోబుట్టువులు.. తమ ప్రియమైన రిఖీని అతడి భార్యాబిడ్డలతో సహా చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఆరోజు.. ఆ గ్రామంలో సంగీతం, పూల వర్షం, ఆనందభాష్పాలు తప్ప మరేమీ కనిపించలేదు.

గాయంతో పునర్జన్మ..
రిఖీ అనే యువకుడు 1980లో హరియాణాలోని యమునా నగర్‌లో ఒక హోటల్‌లో పనిచేసేవాడు. అంబాలా వెళ్లే మార్గంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అతని తలకు బలమైన గాయం తగిలింది. ఆ గాయం అతని మెదడులోని ప్రతి జ్ఞాపకాన్ని తుడిచి పెట్టేసింది. పేరు, ఊరు, కుటుంబం.. అన్నీ మరిచిపోయి జీవచ్ఛవంలా మిగిలాడు. కొత్త స్నేహితులు అతనికి రవి చౌదరి అని పేరు పెట్టారు. గతం తెలియని రవి, ముంబైకి చేరుకుని చిన్న చిన్న పనులు చేస్తూ బతికాడు. తరువాత మహారాష్ట్రలోని నాందేడ్‌కు వెళ్లి, అక్కడి ఒక కాలేజీలో పనిచేస్తూ స్థిరపడ్డాడు. అక్కడే సంతోషి అనే అమ్మాయిని వివాహం చేసుకుని, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకుతో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు.

మలుపు తిప్పిన మరో గాయం
కొన్ని నెలల క్రితం, అతడి జీవితాన్ని మళ్లీ మార్చే మరో సంఘటన జరిగింది. అతని తలకు మరో చిన్న గాయమైంది. అంతే.. రవికి నిద్రలో అస్పష్టమైన దృశ్యాలు కనిపించడం మొదలయ్యాయి. తన గ్రామం నదిలోని మామిడి చెట్టు, సన్నని దారులు, సటౌన్‌ అనే చోట ఉన్న ఇంటి పెరడు.. ఇవే రవికి పదే పదే కలలో కనిపించాయి. అవి కలలు కావు.. ఒకప్పటి జ్ఞాపకాలని తెలుసుకోవడానికి అతనికి ఎంతో సమయం పట్టలేదు. వెంటనే, అతను ఒక కాలేజీ విద్యార్థి సహాయంతో సటౌన్‌ వివరాల కోసం వెతకడం మొదలుపెట్టాడు. గూగుల్‌లో నది గ్రామం గురించి వెతుకుతున్నప్పుడు, వారికి ఒక కేఫ్‌కు సంబంధించిన ఫోన్‌ నంబర్‌ దొరికింది. రిఖీ ఆ నంబర్‌కు ఫోన్‌ చేసి, గ్రామ పెద్ద రుద్ర ప్రకాశ్‌తో మాట్లాడాడు. మాటామంతీ తర్వాత.. రిఖీ బంధువులలో ఒకరైన ఎం.కె.చౌబేకు పాత విషయాలు గుర్తుకొచ్చాయి. ఈ వివరాలన్నీ సరిపోలడంతో, చివరకు నవంబర్‌ 15న రిఖీ.. 45 ఏళ్ల నిరీక్షణకు తెరదించి కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు.

శాస్త్రానికి అందని అద్భుతం 
‘గాయం కారణంగా కోల్పోయిన జ్ఞాపకాలు తిరిగి రావడం అనేది అత్యంత అరుదుగా, అద్భుతాలలో మాత్రమే జరుగుతుంది. వైద్య పరీక్షలు, బ్రెయిన్‌ స్కానింగ్‌ల తర్వాతే దీనికి కచి్చతమైన కారణం తెలుస్తుంది’.. అని మానసిక ఆరోగ్య నిపుణుడు డాక్టర్‌ ఆదిత్య శర్మ పేర్కొన్నారు. 45 ఏళ్ల నిశ్శబ్దం, తరాల అంతరం.. వీటన్నింటినీ ఒకే ఒక్క జ్ఞాపకం ఛేదించింది. కుటుంబ బంధాన్ని తిరిగి కలిపింది. కాలం చేసిన గాయానికి వైద్యం చేసే శక్తి ప్రేమకు మాత్రమే ఉందని ఈ సంఘటన రుజువు చేసింది. రిఖీ, రవి చౌదరిగా.. ఇప్పుడు రెండు జీవితాల సారాన్ని తనలో నింపుకొన్నాడు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement