breaking news
memories lost
-
నాటి రిఖీ.. నేటి రవి చౌదరి!
అదొక అద్భుతం. బాలీవుడ్ సినిమాకు తీసిపోని వాస్తవం. పదహారేళ్ల వయసులో తలకు బలమైన గాయమై.. గతాన్ని పూర్తిగా మరిచిపోయి అదృశ్యమయ్యాడొక వ్యక్తి. చిత్రంగా అదే వ్యక్తి సరిగ్గా 45 ఏళ్ల తర్వాత.. మరో గాయంతో పాత జ్ఞాపకాలన్నీ ముసురుకుని కుటుంబాన్ని చేరుకున్నాడు. ఆయనే నాటి రిఖీ.. నేటి రవి చౌదరి.భారమైన బతుకుల్లో ఆనందభాష్పాలు హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లా, నది గ్రామంలో ఇటీవల ఈ అపూర్వ కలయిక జరిగింది. కొడుకు చనిపోయాడని ఇన్నాళ్లు భారంగా బతికిన తల్లిదండ్రులు, తోబుట్టువులు.. తమ ప్రియమైన రిఖీని అతడి భార్యాబిడ్డలతో సహా చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఆరోజు.. ఆ గ్రామంలో సంగీతం, పూల వర్షం, ఆనందభాష్పాలు తప్ప మరేమీ కనిపించలేదు.గాయంతో పునర్జన్మ..రిఖీ అనే యువకుడు 1980లో హరియాణాలోని యమునా నగర్లో ఒక హోటల్లో పనిచేసేవాడు. అంబాలా వెళ్లే మార్గంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అతని తలకు బలమైన గాయం తగిలింది. ఆ గాయం అతని మెదడులోని ప్రతి జ్ఞాపకాన్ని తుడిచి పెట్టేసింది. పేరు, ఊరు, కుటుంబం.. అన్నీ మరిచిపోయి జీవచ్ఛవంలా మిగిలాడు. కొత్త స్నేహితులు అతనికి రవి చౌదరి అని పేరు పెట్టారు. గతం తెలియని రవి, ముంబైకి చేరుకుని చిన్న చిన్న పనులు చేస్తూ బతికాడు. తరువాత మహారాష్ట్రలోని నాందేడ్‌కు వెళ్లి, అక్కడి ఒక కాలేజీలో పనిచేస్తూ స్థిరపడ్డాడు. అక్కడే సంతోషి అనే అమ్మాయిని వివాహం చేసుకుని, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకుతో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు.మలుపు తిప్పిన మరో గాయంకొన్ని నెలల క్రితం, అతడి జీవితాన్ని మళ్లీ మార్చే మరో సంఘటన జరిగింది. అతని తలకు మరో చిన్న గాయమైంది. అంతే.. రవికి నిద్రలో అస్పష్టమైన దృశ్యాలు కనిపించడం మొదలయ్యాయి. తన గ్రామం నదిలోని మామిడి చెట్టు, సన్నని దారులు, సటౌన్ అనే చోట ఉన్న ఇంటి పెరడు.. ఇవే రవికి పదే పదే కలలో కనిపించాయి. అవి కలలు కావు.. ఒకప్పటి జ్ఞాపకాలని తెలుసుకోవడానికి అతనికి ఎంతో సమయం పట్టలేదు. వెంటనే, అతను ఒక కాలేజీ విద్యార్థి సహాయంతో సటౌన్ వివరాల కోసం వెతకడం మొదలుపెట్టాడు. గూగుల్‌లో నది గ్రామం గురించి వెతుకుతున్నప్పుడు, వారికి ఒక కేఫ్‌కు సంబంధించిన ఫోన్ నంబర్ దొరికింది. రిఖీ ఆ నంబర్‌కు ఫోన్ చేసి, గ్రామ పెద్ద రుద్ర ప్రకాశ్‌తో మాట్లాడాడు. మాటామంతీ తర్వాత.. రిఖీ బంధువులలో ఒకరైన ఎం.కె.చౌబేకు పాత విషయాలు గుర్తుకొచ్చాయి. ఈ వివరాలన్నీ సరిపోలడంతో, చివరకు నవంబర్ 15న రిఖీ.. 45 ఏళ్ల నిరీక్షణకు తెరదించి కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు.శాస్త్రానికి అందని అద్భుతం ‘గాయం కారణంగా కోల్పోయిన జ్ఞాపకాలు తిరిగి రావడం అనేది అత్యంత అరుదుగా, అద్భుతాలలో మాత్రమే జరుగుతుంది. వైద్య పరీక్షలు, బ్రెయిన్ స్కానింగ్‌ల తర్వాతే దీనికి కచి్చతమైన కారణం తెలుస్తుంది’.. అని మానసిక ఆరోగ్య నిపుణుడు డాక్టర్ ఆదిత్య శర్మ పేర్కొన్నారు. 45 ఏళ్ల నిశ్శబ్దం, తరాల అంతరం.. వీటన్నింటినీ ఒకే ఒక్క జ్ఞాపకం ఛేదించింది. కుటుంబ బంధాన్ని తిరిగి కలిపింది. కాలం చేసిన గాయానికి వైద్యం చేసే శక్తి ప్రేమకు మాత్రమే ఉందని ఈ సంఘటన రుజువు చేసింది. రిఖీ, రవి చౌదరిగా.. ఇప్పుడు రెండు జీవితాల సారాన్ని తనలో నింపుకొన్నాడు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
చెదురుతున్న జ్ఞాపకాలు
బోస్టన్: ఫొటోల తరహాలోనే మన జ్ఞాపకాలు కూడా కాలక్రమేణా వాటి నాణ్యతను కోల్పోతాయని ఓ అధ్యయనంలో తేలింది. సాధారణంగా మనుషులు గతంలో చేసిన ఒక్కో ఘటనను ఒక్కో తరహాలో గుర్తుంచుకుంటారని ఈ పరిశోధనలో పాల్గొన్న బోస్టన్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ మౌరీన్ రిట్చీ తెలిపారు. గతంలో ఎదురైన పరిస్థితులను మరోసారి ఎదుర్కొన్నప్పుడు ఆ ఘటన తాలూకు ఎక్కువ విషయాలు మన మెదడులో నిక్షిప్తమవుతాయని వెల్లడించారు. మరికొన్ని సందర్భాల్లో మాత్రం ఈ జ్ఞాపకాలు స్పష్టత లేకుండా, తక్కువ వివరాలతోనే గుర్తుంటాయని పేర్కొన్నారు. ‘భావోద్వేగ’ అంశాల్లో ఎక్కువ స్పష్టత.. రోజువారీ పనులతో పోల్చుకుంటే కారు ప్రమాదం వంటి ఘటనలు వ్యక్తుల మెదళ్లలో బలంగా నిక్షిప్తమవుతాయని గతంలో నిర్వహించిన పరిశోధనలో తేల్చినట్లు రిట్చీ చెప్పారు. ఇలా స్పష్టమైన జ్ఞాపకాలు ఏర్పడటానికి ఆయా వ్యక్తులు వాటిని ఎలా గుర్తుంచుకున్నారు? ఏరకంగా గుర్తుంచుకున్నారు? అనే విషయాలకు మధ్య సంబంధాన్ని తెలుసుకునే దిశగా తమ పరిశోధన సాగిందని వెల్లడించారు. ఇందులో భాగంగా తాము మూడు పరిశోధనలు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా పరిశోధనలో పాల్గొన్న వ్యక్తులకు మానసికంగా కలత కలిగించే చిత్రాలు, సాధారణ చిత్రాలను అందించామన్నారు. ఇవి వేర్వేరు రంగులు, నాణ్యతతో ఉన్నాయన్నారు. అనంతరం వారికి ఏం జ్ఞాపకం ఉందో చెప్పమని కోరగా నిజమైన చిత్రాలను తక్కువ నాణ్యతతో గుర్తుంచుకున్నట్లు తేలిందన్నారు. అలాగే మానసికంగా కలత కలిగించే చిత్రాలను చూసినవారు వాటిని అత్యంత కచ్చితత్వంతో గుర్తుంచుకున్నారనీ, వారి జ్ఞాపకాల నాణ్యత ఏమాత్రం తగ్గలేదని రిట్చీ చెప్పారు. ఫేడింగ్ ఎఫెక్ట్.. సాధారణ ఘటనలను గుర్తుంచుకునే క్రమంలో వాటికి సంబంధించిన చిన్నచిన్న అంశాలను మర్చిపోతారని రిట్చీ తెలిపారు. ఉదాహరణకు సంగీత విభావరికి వెళ్లిన వ్యక్తులు తమ ఇష్టమైన గాయకులను, సంగీతాన్ని బాగా గుర్తుపెట్టుకుంటారన్నారు. అదే సమయంలో ఆ కార్యక్రమంలో వాతావరణం, లైట్లు, శబ్ద తీవ్రత చూచాయగా జ్ఞాపకం ఉంటాయన్నారు. ఇవి కాలక్రమేణా జ్ఞాపకాల నుంచి తొలగిపోతాయని వెల్లడించారు. దీన్ని ‘ఫేడింగ్ ఎఫెక్ట్’గా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. నిజ ఘటనలతో పోల్చుకుంటే ఏ జ్ఞాపకాలైనా తక్కువ కచ్చితత్వంతోనే మెదడులో నిక్షిప్తమవుతాయన్నారు. ఇలా జరిగినప్పటికీ భావోద్వేగాలకు సంబంధించిన జ్ఞాపకాలపై ఈ ఫేడింగ్ ఎఫెక్ట్ ఎలాంటి ప్రభావం చూపలేదని స్పష్టం చేశారు. -
చేదు జ్ఞాపకాల్ని మర్చిపోవాలనుకుంటున్నారా?
న్యూయార్క్: జ్ఞాపకాలు.. కొన్ని తీపివి.. మరి కొన్ని చేదువి. తీపి జ్ఞాపకాల్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని భావిస్తే చేదు జ్ఞాపకాల్ని మాత్రం త్వరగా మర్చిపోవాలనుకుంటాం. అయితే అది అంత సులభం కాదు. కానీ దీనికో చిన్న ఉపాయం సూచిస్తున్నారు నిపుణులు. కంప్యూటర్ గేమ్స్ ఆడితే ఇలాంటి అవాంచిత జ్ఞాపకాలు తగ్గుతాయని వారు సూచిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం మెదడుకు గాయం కావడం వల్ల ఇలాంటి అవాంచిత జ్ఞాపకాలు ఏర్పడే అవకాశం ఉంది. మెదడులో గాయాలున్న వారు అవాంచిత దృశ్యాల్ని చూడడానికి ఇష్టపడరు. వాటిని మర్చిపోవాలని వారు భావిస్తారు. మళ్లీ సాధారణ స్థితికి రావాలని కోరుకుంటారు. అయితే కంప్యూటర్ గేమ్స్ ఆడడం వల్ల ఇలాంటి విషయాల్ని త్వరగా మర్చిపోగలుగుతారని శాస్త్రవేత్తలు తెలిపారు. తమ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్లు తెలిపారు.


