చెదురుతున్న జ్ఞాపకాలు

Like old photographs, memories fade over time - Sakshi

అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి

బోస్టన్‌: ఫొటోల తరహాలోనే మన జ్ఞాపకాలు కూడా కాలక్రమేణా వాటి నాణ్యతను కోల్పోతాయని ఓ అధ్యయనంలో తేలింది. సాధారణంగా మనుషులు గతంలో చేసిన ఒక్కో ఘటనను ఒక్కో తరహాలో గుర్తుంచుకుంటారని ఈ పరిశోధనలో పాల్గొన్న బోస్టన్‌ కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మౌరీన్‌ రిట్చీ తెలిపారు. గతంలో ఎదురైన పరిస్థితులను మరోసారి ఎదుర్కొన్నప్పుడు ఆ ఘటన తాలూకు ఎక్కువ విషయాలు మన మెదడులో నిక్షిప్తమవుతాయని వెల్లడించారు. మరికొన్ని సందర్భాల్లో మాత్రం ఈ జ్ఞాపకాలు స్పష్టత లేకుండా, తక్కువ వివరాలతోనే గుర్తుంటాయని పేర్కొన్నారు.

‘భావోద్వేగ’ అంశాల్లో ఎక్కువ స్పష్టత..
రోజువారీ పనులతో పోల్చుకుంటే కారు ప్రమాదం వంటి ఘటనలు వ్యక్తుల మెదళ్లలో బలంగా నిక్షిప్తమవుతాయని గతంలో నిర్వహించిన పరిశోధనలో తేల్చినట్లు రిట్చీ చెప్పారు. ఇలా స్పష్టమైన జ్ఞాపకాలు ఏర్పడటానికి ఆయా వ్యక్తులు వాటిని ఎలా గుర్తుంచుకున్నారు? ఏరకంగా గుర్తుంచుకున్నారు? అనే విషయాలకు మధ్య సంబంధాన్ని తెలుసుకునే దిశగా తమ పరిశోధన సాగిందని వెల్లడించారు. ఇందులో భాగంగా తాము మూడు పరిశోధనలు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా పరిశోధనలో పాల్గొన్న వ్యక్తులకు మానసికంగా కలత కలిగించే చిత్రాలు, సాధారణ చిత్రాలను అందించామన్నారు. ఇవి వేర్వేరు రంగులు, నాణ్యతతో ఉన్నాయన్నారు. అనంతరం వారికి ఏం జ్ఞాపకం ఉందో చెప్పమని కోరగా నిజమైన చిత్రాలను తక్కువ నాణ్యతతో గుర్తుంచుకున్నట్లు తేలిందన్నారు. అలాగే మానసికంగా కలత కలిగించే చిత్రాలను చూసినవారు వాటిని అత్యంత కచ్చితత్వంతో గుర్తుంచుకున్నారనీ, వారి జ్ఞాపకాల నాణ్యత ఏమాత్రం తగ్గలేదని రిట్చీ చెప్పారు.

ఫేడింగ్‌ ఎఫెక్ట్‌..
సాధారణ ఘటనలను గుర్తుంచుకునే క్రమంలో వాటికి సంబంధించిన చిన్నచిన్న అంశాలను మర్చిపోతారని రిట్చీ తెలిపారు. ఉదాహరణకు సంగీత విభావరికి వెళ్లిన వ్యక్తులు తమ ఇష్టమైన గాయకులను, సంగీతాన్ని బాగా గుర్తుపెట్టుకుంటారన్నారు. అదే సమయంలో ఆ కార్యక్రమంలో వాతావరణం, లైట్లు, శబ్ద తీవ్రత చూచాయగా జ్ఞాపకం ఉంటాయన్నారు. ఇవి కాలక్రమేణా జ్ఞాపకాల నుంచి తొలగిపోతాయని వెల్లడించారు. దీన్ని ‘ఫేడింగ్‌ ఎఫెక్ట్‌’గా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. నిజ ఘటనలతో పోల్చుకుంటే ఏ జ్ఞాపకాలైనా తక్కువ కచ్చితత్వంతోనే మెదడులో నిక్షిప్తమవుతాయన్నారు. ఇలా జరిగినప్పటికీ భావోద్వేగాలకు సంబంధించిన జ్ఞాపకాలపై ఈ ఫేడింగ్‌ ఎఫెక్ట్‌ ఎలాంటి ప్రభావం చూపలేదని స్పష్టం చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

సంబంధిత వార్తలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top