
రాహుల్ గాంధీ ఆరోపణలు.. వాటిని తోసిపుచ్చుతూ ఎన్నికల సంఘం.. పరస్పర సవాళ్లతో దేశవ్యాప్తంగా ఓట్ల దొంగతనం అంశం తీవ్ర చర్చనీయాంగా మారింది. లోక్‌సభలో విపక్ష నేత మరింత స్వరం పెంచి ‘ఈ చోరీ ఒక్క నియోజకవర్గానికే పరిమితం కాలేదని.. చాలా చోట్ల జరిగింది’’ అని అంటున్నారు. ఈ తరుణంలో 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ పలు నియోజకవర్గాల్లో ‘ఓట్ చోరీ’ జరిగిందంటూ ఓ ప్రొఫెసర్ చేసిన పరిశోధన మళ్లీ తెరపైకి వచ్చింది.
2019 లోక్‌సభ ఎన్నికల్లో అనుమానాస్పద రీతిలో అధికార పార్టీ కొన్ని సీట్లు గెల్చుకుందనేది ఆ ప్రొఫెసర్ వాదన. ఆయన పేరు సవ్యసాచి దాస్. హర్యానా అశోకా యూనివర్సిటీలో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ‘‘ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య వెనుకడుగు’’(Democratic Backsliding in the World’s Largest Democracy) పేరిట తన పరిశోధన పత్రాలను 2023లోనే ఆయన బయటపెట్టారు. ఆ సంచలన పరిశోధన సారాంశం ఏంటంటే..
ఆ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయాలు చాలానే సాధించింది. పోటీ తీవ్రంగా ఉన్న 59 స్థానాల్లో.. 41 స్థానాలను కైవసం చేసుకుంది. ఆ ఎన్నికలల్లో బీజేపీ తక్కువ మెజారిటీతో గెలిచిన నియోజకవర్గాల్లో ఓటర్ల వృద్ధి రేటు.. ఓడిన నియోజకవర్గాలతో పోల్చితే సగటున 5% తక్కువగా ఉంది. అందుకే దీనిని వ్యూహాత్మక డాటా మేనిప్యులేషన్‌కి సంకేతంగా సవ్యసాచి తన పరిశోధనల్లో పేర్కొన్నారు. అయితే..
అప్పటి ఓటర్ డాటా, పోలింగ్ సరళి ఆధారంగా జరిగిన పరిశోధన లెక్క ప్రకారం.. బీజేపీకి ఆ 30 స్థానాలు మాత్రమే రావాల్సి ఉంది. అంటే ఆ అదనపు 11 స్థానాలు ఓట్ చోరీతోనే గెలిచిందని "back-of-the-envelope" అనే గణాంకాలతో ఆయన ప్రస్తావించారు.
ఓట్ చోరీ- ఇలా జరిగి ఉండొచ్చు..
ఓటర్ డాటాను ఓ పద్దతి ప్రకారం మేనిపులేషన్ చేయడం అంటే.. ఓటర్ జాబితా నుంచి పేర్లను తొలగించడం, అందునా ప్రత్యేకించి ముస్లిం ఓట్లను తొలగించడం, అలాగే.. పోలింగ్‌బూత్‌ల వద్ద ఓటింగ్ శాతం తగ్గించే చర్యలు తీసుకోవడం లాంటి అంశాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఇక ప్రత్యేకించి.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఇది జరిగిందనే విషయాన్ని పేర్కొన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఓటింగ్ శాతం డేటాలో అసమానతలు గణనీయంగా ఎక్కువగా కనిపించడాన్ని ప్రముఖంగా ప్రస్తావించారాయన. ఆ రాష్ట్రాల సివిల్ సర్వీస్ అధికారుల బలహీనమైన పర్యవేక్షణ వల్ల ఇది జరిగిందని ‘‘ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య వెనుకడుగు’’ పరిశోధన పత్రం పేర్కొంది. ఈ మానిప్యులేషన్ ప్రభుత్వ ఏర్పాటును మార్చకపోయినా..(బీజేపీకి మేజిక్ ఫిగర్ కంటే ఎక్కువే సీట్లే వచ్చాయి..) ప్రజాస్వామ్య నైతికతపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తిందని ప్రొఫెసర్ సవ్యసాచి ఆ నివేదికలో అభిప్రాయపడ్డారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) 303 లోక్‌సభ సీట్లు గెలిచి సింగిల్ డిజిట్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మిత్రపక్షాల సీట్లతో కలిపి 353 కాగా.. రెండోసారి వరుసగా నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీయే సర్కార్‌ను బీజేపీ ఏర్పాటు చేసింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 52 సీట్లతో సరిపెట్టుకుంది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేల్చిన ఆటంబాంబ్‌తో ఓట్ల దొంగతనం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. గతేడాది ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో(ప్రత్యేకించి కర్ణాటక మహదేవ్‌పురలో లక్ష నకిలీ ఓట్లు), మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను మోసం చేయడానికి బీజేపీతో ఎన్నికల కమిషన్ (EC)తో కుమ్మక్కైందని..ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే వ్యూహాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే.. ‘ఓటు చోరీ’ అనే పదాన్ని పదే పదే వినియోగించడాన్ని తప్పుపట్టిన ఈసీ.. ఆధారాలు చూపించాలని రాహుల్‌ను కోరుతోంది.
Revealing Voter Manipulation 🔥
𝐇𝐨𝐰 𝐁𝐉𝐏 𝐒𝐞𝐜𝐮𝐫𝐞𝐝 𝐄𝐱𝐭𝐫𝐚 𝐒𝐞𝐚𝐭𝐬 𝐢𝐧 𝟐𝟎𝟏𝟗 𝐄𝐥𝐞𝐜𝐭𝐢𝐨𝐧𝐬 𝐓𝐡𝐫𝐨𝐮𝐠𝐡 𝐃𝐚𝐭𝐚 𝐒𝐡𝐞𝐧𝐚𝐧𝐢𝐠𝐚𝐧𝐬
A 2023 Research Paper by Sabyasachi Das, Assistant Professor of Economics at Ashoka University, uncovers evidence… pic.twitter.com/NU3MKSSQCP— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) August 13, 2025