సైబర్‌ మోసాల కట్టడికి గ్లోబల్‌ ఫ్రేమ్‌వర్క్‌  | Global Framework urged to curb cyber frauds, deepfakes says pm Narendra Modi | Sakshi
Sakshi News home page

సైబర్‌ మోసాల కట్టడికి గ్లోబల్‌ ఫ్రేమ్‌వర్క్‌ 

Oct 9 2026 5:46 AM | Updated on Oct 9 2026 5:46 AM

Global Framework urged to curb cyber frauds, deepfakes says pm Narendra Modi

ప్రభుత్వాలు, టెక్‌ కంపెనీలు, టెలికం ఆపరేటర్లు కలిసి పనిచేయాలి 

‘ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌–2026’లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు  

సాంకేతికత అనేది ప్రజల విశ్వసనీయతను పొందాలని వెల్లడి  

డీబీటీతో రూ. 5 లక్షల కోట్ల నిధులు ఆదా చేశామని స్పష్టీకరణ

న్యూఢిల్లీ: నేటి ఆధునిక టెక్నాలజీ యుగంలో సీమాంతర సైబర్‌ మోసాలు, డీప్‌ఫేక్‌ ముప్పు నానాటికీ పెరుగుతుండడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి మోసాలు, ప్రమాదాలను ఎదుర్కోవడానికి అందరూ చేతులు కలపాలని, గ్లోబల్‌ ఫ్రేమ్‌వర్క్‌ ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు సైబర్‌ మోసాల బారిన పడకుండా ఒక కట్టుదిట్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వాలు, టెక్నాలజీ కంపెనీలు, టెలికం ఆపరేటర్లు, ఆర్థిక సంస్థలు ఏకతాటిపైకి రావాలని సూచించారు. గురువారం ఢిల్లీలో ‘ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌–2026’లో ప్రధానమంత్రి మాట్లాడారు.

 సైబర్‌ మోసాలను దీటుగా ఎదుర్కోవడంలో భారత్‌ గణనీయమైన అనుభవం గడించిందని, ఈ అనుభవాన్ని ప్రపంచ దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. సైబర్‌ మోసాలు, నేరాలకు సరిహద్దులతో సంబంధం ఉండదని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మోసాలు జరగవచ్చని అన్నారు. అవి ఎప్పుడో సరిహద్దులను దాటేశాయని అన్నారు. సాంకేతికత అనేది ప్రజల విశ్వసనీయతను పొందినప్పుడే అది మరింత విస్తృత స్థాయిని సాధిస్తుందని తేల్చిచెప్పారు. ప్రధానమంత్రి ఇంకా ఏం చెప్పారంటే.. 

సామాన్యుడికి కావాల్సింది అదే 
‘‘సైబర్‌ నేరాలకు సరిహద్దులను అధిగమించే శక్తి ఉంది. ఒక దేశంలో ఉన్న వ్యక్తి మరొక దేశం సహాయంతో మూడో దేశంలో నేరానికి పాల్పడవచ్చు. డీప్‌ఫేక్‌లు ఎంత పెద్ద సవాలుగా మారాయో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి కొత్త ముప్పులను నిరోధించాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిందే. ఇందుకోసం ప్రపంచస్థాయి విధానాన్ని రూపొందించుకోవాలి. ప్రభుత్వాలు, టెక్నాలజీ సంస్థలు, టెలికం ఆపరేటర్లు, ఆర్థిక సంస్థలు ఈ విధానంతో అనుసంధానం కావాలి. 

పైబర్‌ మోసాలను అడ్డుకోగల ఒక ప్రపంచ స్థాయి యంత్రాంగాన్ని రూపొందించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెలికం నెట్‌వర్క్‌ ఆపరేటర్లు ముందుకు రావాలని కోరుతున్నా. టెలికం, డిజిటల్‌ సాంకేతికతల విస్తరణ మరింత పెరగాలంటే వాటి భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడం అత్యంత కీలకం. ముఖ్యంగా మొబైల్, నెట్‌వర్క్‌ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక సాధారణ పౌరుడు నియమావళి లేదా వ్యవస్థల భాషలో ఆలోచించడు. అతడికి నమ్మకమే సర్వోన్నతం. ఎవరు ఫోన్‌ చేస్తున్నారో తెలుసుకోవడం, సందేశం నిజమైనదా లేదా నకిలీదా అని చూడడం, చెల్లింపు సురక్షితమేనా, వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉందా అని చూడడమే సామాన్యుడికి కావాల్సిందని’’ మోదీ అన్నారు.  

టెలికం రంగంలో ‘సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌’ 
‘‘దేశంలో 2022లో 5జీ సేవలను ప్రారంభించాం. ప్రస్తుతం 5జీ కనెక్టివిటీ ప్రతి జిల్లాకూ చేరింది. 5.5 లక్షలకు పైగా బేస్‌ స్టేషన్లు 5జీ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నాయి. 2022తో పోలిస్తే మొబైల్‌ ఇంటర్నెట్‌ వేగం 10 రెట్లు పెరిగింది. డిజిటల్‌ పాలనలో భారత్‌కు అపారమైన అనుభవం ఉంది. డీబీటీ ద్వారా దాదాపు రూ.50 లక్షల కోట్లను లబి్ధదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేశాం. దీంతో దాదాపు రూ.5 లక్షల కోట్లు పక్కదారి పట్టకుండా ఆదా అయ్యాయి. ఆ డబ్బు ఇప్పుడు అర్హులైన లబి్ధదారులకు చేరుతోంది. సరైన ప్రయోజనాల కోసం ఖర్చవుతోంది. టెలికం రంగంలో ‘సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌’ వేగంగా దూసుకెళ్తోంది’’అని మోదీ వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement